వ్యాక్సిన్ వార్: జగన్ తో కేసీఆర్ కలిసొచ్చేనా..?

కేంద్రంతో రాష్ట్రాల వ్యాక్సిన్ వార్ మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటివారు నేరుగా మోదీతో ఫైట్ కి దిగారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. మా దగ్గర డబ్బుల్వేవు,…

కేంద్రంతో రాష్ట్రాల వ్యాక్సిన్ వార్ మొదలైంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటివారు నేరుగా మోదీతో ఫైట్ కి దిగారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్.. మా దగ్గర డబ్బుల్వేవు, వ్యాక్సిన్ వ్యవహారం కేంద్రమే చేపట్టాలని కుండబద్దలు కొట్టారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాసిన లేఖ కలకలం రేపింది.

వ్యాక్సినేషన్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఒకే గొంతుక వినిపిద్దామని కోరారు జగన్. మరి జగన్ మాటను ఎంతమంది మన్నిస్తారు, మోదీకి ఎంతమంది సాగిలపడతారనేదే ఇప్పుడు తేలాల్సి ఉంది. మిగతా వారి విషయాన్ని వదిలిపెడితే.. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ రియాక్షన్ ఏంటనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

తెలంగాణ గడ్డపైనే వ్యాక్సిన్ తయారయిందని సంతోష పడ్డ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా వ్యాక్సిన్ కొరత ఇబ్బంది పెట్టింది. ఓవైపు ప్రజల నుంచి ఒత్తిడి పెరగడం, మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో వ్యాక్సిన్ విరామం ప్రకటించాల్సి వచ్చింది.  ఏపీలో కూడా ఇలాగే విరామం ప్రకటించినా ఇప్పుడు పరిస్థితులు చక్కబడటంతో వ్యాక్సినేషన్ మొదలు పెట్టారు. కానీ కేంద్రం రాష్ట్రాలకిచ్చే వాటా ఏమూలకీ సరిపోదు.

అందుకే జగన్ లేఖాస్త్రాలను బయటకు తీశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచే దిశగా తొలి అడుగు వేశారు, మోదీతో మొహమాటాలేవీ లేవని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ మాత్రం మోదీ విషయంలో మరీ ఇంత ముక్కుసూటిగా ఉండే అవకాశాలు కనిపించడం లేదు. వ్యాక్సిన్ కొరత విషయంలో ఇప్పటి వరకూ కేసీఆర్ కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేదు. అంతే కాదు.. జనం ఆరోగ్యశ్రీ అడిగితే, కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ కి ఓటు వేసి బీజేపీ అధిష్టానాన్ని ఖుషీ చేశారు.

ఇటీవల జరిగిన, జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు కేంద్రంతో కేసీఆర్ దోస్తీని చెప్పకనే చెబుతున్నాయి. ఢిల్లీలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కేసీఆర్-మోదీ బంధాన్ని బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో బీజేపీ, టీఆర్ఎస్ తో చేతులు కలిపితే మాలాంటి వారి పరిస్థితి ఏంటి అని ఆ పార్టీలో చేరబోతున్న ఈటల అనుమానం వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు జేపీ నడ్డా, ఈటల అనుమానాల్ని కొట్టిపారేసినా.. తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను ఎవరూ ఊహించలేరు.

ప్రధాని మోదీతో స్నేహం కోరుకుంటున్న కేసీఆర్ ఇప్పుడు వ్యాక్సిన్ విషయంలో రచ్చకెక్కుతారని ఎవరూ అనుకోరు. మరి టీకా కోసం, రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం.. మోదీతో కయ్యానికి దిగే విషయంలో ఎంతమంది జగన్ గట్టున ఉంటారో, ఎంతమంది ఆ గట్టున చేరుతారో చూడాలి.