రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరున్న భూమా కుటుంబ ఆస్తుల జప్తు ప్రకటన సంచలనం రేపుతోంది. భూమా రాజకీయ వారసులుగా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి కొనసాగుతున్నారు. ఆళ్లగడ్డ నుంచి అఖిల, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి గత సార్వత్రిక ఎన్ని కల్లో ఓటమి పాలయ్యారు.
ఇదిలా ఉండగా ఆళ్లగడ్డలోని జగత్ డెయిరీకి ఆంధ్రా బ్యాంక్ నుంచి తీసుకొచ్చిన రుణాన్ని చెల్లించకపోవడంతో …సదరు బ్యాంక్ వారు నేడు భూమా కుటుంబ ఆస్తుల జప్తు ప్రకటన ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది. గతంలో భూమా నాగిరెడ్డి హయాంలోనే నంద్యాల ఆంధ్రాబ్యాంక్ నుంచి రుణం తీసుకున్నారు.
ఆయన జీవించినంత కాలం రుణాన్ని చెల్లిస్తూ వచ్చారని సమాచారం. అయితే ఆకస్మిక మరణంతో రుణ చెల్లింపులకు భూమా అఖిలప్రియ గుడ్‌బై చెప్పారని సమాచారం. ఈ క్రమంలో రుణం ఇంతింతై అన్నట్టు పెరిగిపోయి చెల్లించడానికి భారంగా మారింది.
బ్యాంక్‌ల విలీన ప్రక్రియలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఇండియాలో ఆంధ్రాబ్యాంక్ విలీనం అయిన నేపథ్యంలో …రుణాన్ని రాబట్టుకునేందుకు ఆ బ్యాంక్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో రుణానికి సంబంధించి మూడు వేర్వేరు ప్రకటనలను పత్రికలకు ఇచ్చింది.
ఈ ప్రకటనలో పేర్కొన్న ప్రకారం మొత్తం రూ.16 కోట్లకు తక్కువ కాకుండా రుణం చెల్లించాల్సి ఉంది. అయితే గతంలో ఈ రుణం పొందేందుకు భూమా కుటుంబ సభ్యులకు చెందిన మొత్తం ఆస్తులను సెక్యూరిటీ పెట్టారు.
వీటి విలువ రూ.100 కోట్ల పైమాటే. చెల్లించాల్సింది రూ.16 కోట్లు. తమకు బకాయి పడ్డ రుణాలను రెండు నెలల్లోపు చెల్లించాలని, లేదంటే మొత్తం ఆస్తులను జప్తు చేస్తామని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరిస్తూ ప్రకటన జారీ చేయడం కర్నూలు జిల్లాలో కలకలం రేపుతోంది. అయితే భూమా అనుచరుల నుంచి మరో వాదన తెరపైకి వచ్చింది.
ఈ మొత్తం రుణాన్ని చెల్లించి, వందల కోట్ల ఆస్తులను సొంతం చేసుకునే ఎత్తుగడతోనే తమ నాయకురాలు బకాయి డ్రామాకు తెరలేపారనే వాదన వినిపిస్తోంది. ఇందులో వాస్తవం ఎంతో త్వరలో తేలే అవకాశం ఉందంటున్నారు.