ఆసుపత్రి గోడలు పిలుస్తున్నాయి…

ఆసుపత్రికి వెళ్తే నయం కావాలి. దాన్నే రోగులు కూడా నమ్ముతారు. కానీ కరోనా కాలం కలికాలాన్ని మించిపోయింది. దాంతో ఎంతటి బలవంతులు అయినా కరోనా సోకడంతో ఒక్కసారిగా కృంగిపోతున్నారు. కరోనా కౌగిలిలోకి వెళ్ళి బలి…

ఆసుపత్రికి వెళ్తే నయం కావాలి. దాన్నే రోగులు కూడా నమ్ముతారు. కానీ కరోనా కాలం కలికాలాన్ని మించిపోయింది. దాంతో ఎంతటి బలవంతులు అయినా కరోనా సోకడంతో ఒక్కసారిగా కృంగిపోతున్నారు. కరోనా కౌగిలిలోకి వెళ్ళి బలి కావడానికి ఇష్టపడని వారు ఏకంగా బలవన్మరణాలను ఆశ్రయిస్తున్నారు. ఆ విధంగా విశాఖలో వరస ఆత్మహత్యలు ఈ మధ్య కాలంలో చోటు చేసుకుంటున్నారు. అవి సంచలనమే రేకెత్తిస్తున్నాయి.

ఇరవై రోజుల వ్యవధిలో విశాఖ ఇన్న్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఇద్దరు కరోనా రోగులు ఆసుపత్రి పై అంతస్తు గోడ దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది నిజంగా విషాదమే. కరోనా సోకితే బతకమని అనుకుంటున్నారో లేక సమాజం చులకన చేస్తుందని మధనపడుతున్నారో తెలియదు కానీ ముప్పు కంటే ముందే మృత్యువుని ఆహ్వానిస్తున్నారు.

ఇక విశాఖలో పెద్దాసుపత్రిగా పిలవబడే కేజీహెచ్ లో కూడా ఈ మధ్య కాలంలో ఇద్దరు కరోనా రోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కరోనా వంటి మహమ్మారి విషయంలో అందరూ బాధ్యతగా ఉండాలి. 

చిల్లర రాజకీయాల కోసం నేతాశ్రీలు భయపెట్టే విధంగా ప్రచారం చేయడం, శవాల గుట్టగా రాష్ట్రం మారుతుందని శాపనార్ధాలు పెట్టడం ఇలాంటివన్నీ కూడా కరోనా రోగుల విషయంలో పెను ప్రభావం చూపుతున్నాయని మానసిక విశ్లేషకులు అంటున్నారు.

కరోనాకు మందులు మాత్రమే కాదు, కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా మేధావులు అంటున్నారు. మరో వైపు కరోనా విషయంలో ఎంతటి వారు అయినా మాట తూలకుండా ఉంటేనే తప్ప ఇలాంటి ఆత్మహత్యల నుంచి బయటపడలేమని కూడా సైకాలజిస్టులు చెబుతున్నారు.