చేసిన తప్పులను సమీక్షించుకుంటాం, సవరించుకుంటాం, తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందుతాం… సాధారణంగా అధికారాన్ని కోల్పోయిన ఏ పార్టీ అయినా చెప్పే మాట, చెప్పాల్సిన మాట ఇది. ప్రత్యేకించి ఒక టర్మ్ అధికారం తర్వాత ఓడిపోయిన వారు తమ పాలనలో జరిగిన లోటుపాట్లను ప్రతిపక్షంలోకి వెళ్లాకా అయినా సమీక్షించుకోవాలి. సమీక్షించుకుంటున్నట్టుగా అయినా కనిపించాలి కనీసం!
ప్రజలు ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే సదరు పార్టీలకు అధికారం అప్పగిస్తారు కూడా. గతంలో అధికారంలో ఉన్నప్పుడు వీళ్లు చేసిన తప్పులు ఇప్పుడు చేయరు.. అనే విశ్వాసం ప్రజల్లో మళ్లీ కలగాలి. అధికారాన్ని మళ్లీ కోరుకునే పార్టీలే ఆ విశ్వాసాన్ని కలిగించాలి. ఇదంతా రాజకీయంలో నిరంతర ప్రక్రియ!
మరి అదేంటో..కానీ తెలుగుదేశం అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఇంకా తను చేసిన తప్పులేంటో అర్థం కావడం లేదట! అధికారం కోల్పోయి రెండేళ్లు అయ్యాయి, మరో మూడేళ్లకు మళ్లీ ఎన్నికలు వస్తాయి.. ఇప్పుడు జూమ్ మీటింగుల్లో మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు తన హయాంలో, అధికారం తన చేతిలో ఉన్నప్పుడు తను చేసిన తప్పులేంటో అర్థం కావడం లేదని వాపోతున్నారు!
సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే వ్యంగ్యరీతిలోనే అవి ఎక్కువ వైరల్ అవుతున్నాయంటే చంద్రబాబు మాటలకు రియాక్షన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
2004లో అధికారం కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు తను మారినట్టుగా తరచూ వ్యాఖ్యానించే వారట తన పార్టీ శ్రేణుల మధ్యన. పదే పదే.. మారడం, మార్పు అనే మాటలను అప్పుడు ఎక్కువ ఉపయోగించారు. అలా మారినట్టుగా బోలెడంత కవరింగ్ ఇచ్చినా, 2009లో అనేక పార్టీలతో పొత్తులతో వెళ్లినా అధికారం అందలేదు.
అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు ఇంకా 2014-19ల మధ్యన చేసిన తప్పులేంటో అర్థం కావడం లేదట. రెండేళ్లైనా ఇంకా అర్థం కాకపోతే ఇంకెప్పటికి అర్థం అవుతాయి? అసలు తప్పులే జరగలేదు అనేది చంద్రబాబు నాయుడి ఫీలింగ్.
మరి అంత మర్యాద రామన్న పాలన అయ్యుంటే.. మరీ 23 సీట్లకు ఎందుకు పరిమితం అయినట్టో.. ఆయన సొంత తనయుడు, టీడీపీ భావి ఆశాకిరణం లోకేషుడు ఎందుకు ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోయారో చంద్రబాబుకు అర్థం కానట్టుగా ఉంది. ఇలా అర్థం చేసుకోలేకపోవడంలోనే ఐదేళ్లూ గడిచిపోతాయేమో చంద్రబాబు గారూ!