కరోనా వైరస్ కొంత మందికి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. దీంతో నోటికొచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా తిట్టి పోస్తున్నారు. దేశానికి అనేక మరపురాని విజయాలు అందించిన టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. మైదానంలో బంతితో ఓ ఆట ఆడుకున్న ధోనీతో నెటిజన్లు ఓ ఆట ఆడుకున్నారు. రకరకాల కామెంట్స్‌తో ధోనీని చెడుగుడు ఆడుకున్నారు.
దీనంతటికి ధోనీ ప్రకటించిన విరాళమే కారణం. కరోనా బాధితులను ఆదుకునేందుకు పూణెలోని ముకుల్ మాధవ్ ఫౌండేషన్‌కు క్రౌడ్ ఫండింగ్ వెబ్సైట్ కెట్టో ద్వారా ధోనీ లక్ష రూపాయల విరాళం అందించాడు. అయితే, ధోనీ నికర ఆస్తి రూ. 800 కోట్లు. ఇంత పెద్ద మొత్తంలో క్రికెట్ ద్వారా సంపాదించుకున్న ధోనీ దేశంలో ఆపదలో ఉంటే కేవలం లక్ష రూపాయలు విరాళం కింద ఇవ్వడం ఏంటని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేశారు.
ఈ కామెంటక్స్పై ధోనీ ఏ మాత్రం స్పందించలేదు. కానీ ధోనీ భార్య సాక్షికి మాత్రం నెటిజన్ల కామెంట్స్ బాగా కోపం తెప్పించాయి. ట్విట్టర్ ద్వారా ఆమె కూడా తిట్ల దండకానికి దిగారు. ఇలాంటి సున్నిత సమయాల్లో తప్పుడు వార్తలు ప్రచురించడం మానేయాలని మీడియా సంస్థలను ఆమె అభ్యర్థించారు.
బాధ్యతాయుతమైన జర్నలిజం అదృశ్యమైనందుకు ఆశ్చర్యం వేస్తోందని సాక్షి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే తన భర్తపై ఇలాంటి వార్తలు రాయడానికి సిగ్గు అనిపించడం లేదూ అని ఆమె ప్రశ్నించారు. అంతే తప్ప తన భర్త ఎంత విరాళం ఇచ్చారనే విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించకపోవడం గమనార్హం.