ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో మాట్లాడాలనే కోరిక మూడేళ్లకు సొంత నియోజకవర్గ నాయకులకు తీరింది. ఈ నెల 7,8 తేదీల్లో జగన్ సొంత జిల్లాలో పర్యటన నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. ఇవాళ పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు మండలాల వారీగా ప్రజలు, ప్రజాప్రతినిధులతో మాట్లాడేందుకు సీఎం సమయం కేటాయించారు.
ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వారికి జగన్‌తో మాట్లాడే అవకాశం కల్పించారు. తొండూరు, సింహాద్రిపురం, పులివెందుల, లింగాల, చక్రాయపేట, వేంపల్లి మండలాల్లోని ప్రజాప్రతినిధులు ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. విడతల వారీగా జగన్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పించారు.
ముఖ్యమంత్రి అయిన మొదలుకుని ఇప్పటి వరకూ సొంత నియోజకవర్గంలోని గ్రామస్థాయి నాయకులెవరికీ జగన్‌ను కలిసే అవకాశం లేకపోయింది. తాడేపల్లిలో కూడా పులివెందుల వాసులకు నో ఎంట్రీ.
ఇటీవల పులివెందుల ప్రజానీకంలో కూడా కొంత మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా హార్టికల్చర్ పంటలకు పులివెందుల నియోజకవర్గం ప్రసిద్ధి. తమ ఇష్ట నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్రిప్ సౌకర్యానికి మంగళం పాడారనే ఆవేదన రైతాంగంలో వుంది.
అంతేకాదు పంటలకు ప్రభుత్వమే బీమా చెల్లిస్తామని చెప్పినప్పటి నుంచి, ఎప్పుడూ ఇన్స్యూరెన్స్ సొమ్ము దక్కలేదనే ఆగ్రహం కూడా పులివెందుల రైతాంగంలో ఉంది. ఇటీవల పులివెందుల ప్లీనరీలో మండలస్థాయి నాయకులు ప్రభుత్వంపై వ్యతిరేకత గురించి బహిరంగంగానే హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో వారితో జగన్ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కారణాలేవైనా తమతో జగన్ మాట్లాడారన్న ఆనందం గ్రామస్థాయి నాయకుల్లో కనిపించింది.