ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పించడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ముందు వరుసలో వుంటారు. తాజాగా గృహ వినియోగదారులు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌పై రూ.50 పెంచుతూ చమురు కంపెనీలు ఓ ప్రకటన చేశాయి. దీనిపై కేటీఆర్ ట్విటర్ వేదికగా కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
“అచ్చేదిన్ ఆ గయే. బధాయి హో” ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.50 పెరిగింది. భారతీయ కుటుంబాలకు మోదీ జీ బహుమతి ఇదే అంటూ కేటీఆర్ తన మార్క్ సెటైర్లు విసరడం విశేషం.
బీజేపీతో టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అని తలపడుతోంది. చిన్న విషయం దొరికినా పరస్పరం విమర్శలు చేసుకోవడంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని, మరో ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంటామని కేంద్ర అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో బీజేపీని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి టీఆర్ఎస్ దీటుగా కౌంటర్లు వేస్తోంది.
ఇందులో భాగంగానే తాజాగా సిలిండర్ ధరల పెరుగుదలపై కేటీఆర్ సెటైర్‌ను చూడాల్సి వుంటుంది. రానున్న రోజుల్లో ఇలాంటివి మరిన్ని చూడాల్సి వుంటుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడేకొద్ది తెలంగాణలో రాజకీయ వేడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 2023 ఎన్నికలు రసవత్తరం కానున్నాయి.