ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్, మనుషుల్ని ఎంత భయభ్రాతులకు గురిచేస్తోంది తెలియజేసే ఘటన ఇది. తనకు వైరస్ వచ్చిందేమో అనే అనుమానంతో, ఓ వ్యక్తి ఏకంగా ఆత్మహత్య చేసుకొని తన ప్రాణాలు తీసుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో జరిగింది ఈ ఘటన.
ఉడిపి జిల్లా బ్రహ్మవర తాలూకులో నివశిస్తుంటాడు గోపాలకృష్ణ. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న ఇతడి వయసు 56 సంవత్సరాలు. కరోనాపై నిత్యం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు, అప్ డేట్స్ చూసి భయపడేవాడు గోపాలకృష్ణ. సరిగ్గా ఇలా భయపడుతున్న టైమ్ లోనే అతడికి జ్వరం, జలుబు వచ్చింది.
దీంతో తనకు కూడా కరోనా వచ్చిందేమోనని భ్రమపడ్డాడు గోపాలకృష్ణ. తన నుంచి తన కుటుంబ సభ్యులకు ఎక్కడ కరోనా వ్యాపిస్తుందో అనే అనుమానంతో తన ఇంటికి దగ్గర్లో ఉన్న చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
నిజానికి గోపాలకృష్ణకు కరోనా లక్షణాల్లేవు. అతడు సైనస్ సమస్యతో బాధపడుతున్నాడు. నిరంతరం సోషల్ మీడియాలో వస్తున్న కరోనా కథనాలు చూసి, తనకు సైనస్ ఉందనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు కరోనా సోకిందని, తన కుటుంబం క్షేమంగా ఉండాలని తను తనువు చావిస్తున్నట్టు ఉత్తరం రాసి మరి చనిపోయాడు గోపాలకృష్ణ.