జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌త‌నే న‌మ్ముకుంటే…!

తెలుగుదేశం పార్టీ త‌ప్పుడు మార్గంలో ప‌య‌నిస్తోందా? కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తీసుకొస్తుంద‌ని న‌మ్మ‌కోడం ఎంత వ‌ర‌కు సమంజ‌సం? చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరుగుతోందా?… ఈ కోణంలో పెద్ద ఎత్తున చ‌ర్చ…

తెలుగుదేశం పార్టీ త‌ప్పుడు మార్గంలో ప‌య‌నిస్తోందా? కేవ‌లం వైఎస్ జ‌గ‌న్‌పై వ్య‌తిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తీసుకొస్తుంద‌ని న‌మ్మ‌కోడం ఎంత వ‌ర‌కు సమంజ‌సం? చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో విశ్వాసం పెరుగుతోందా?… ఈ కోణంలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. వైఎస్ జ‌గ‌న్ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్తార‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి త‌ర్వాత జ‌గ‌న్ ఎప్పుడైనా ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం లేక‌పోలేద‌ని వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా న‌మ్ముతున్నారు.

ముంద‌స్తుకు వెళ్లినా వెళ్ల‌క‌పోయినా… త‌న ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను మాత్రం జ‌గ‌న్ రెండేళ్ల ముందుగానే జ‌నంలోకి పంపారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం పేరుతో నిత్యం జ‌నంలో ఉంటూ, గ‌త మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు, అలాగే స్థానిక స‌మ‌స్య‌ల‌ను అడిగి తెలుసుకుని వాటి ప‌రిష్కారానికి చొర‌వ చూపాల‌ని సీఎం ఆదేశించారు. ప్ర‌స్తుతం ఈ ప‌నులన్నీ చురుగ్గా సాగుతున్నాయి.

మ‌హానాడు విజ‌య‌వంతం అయ్యింద‌నే సంబ‌రం ఆ పార్టీ శ్రేణుల్లో మూణ్నాళ్ల ముచ్చ‌టే అయ్యింది. జిల్లాల్లో మినీ మ‌హానాడు నిర్వ‌హిస్తూ… మొక్కుబ‌డిగా పార్టీ శ్రేణుల‌తో ముఖ్య నాయ‌కులు మ‌మేకం అవుతున్నారు. ఎక్కువ‌గా ఆన్‌లైన్ కాన్ఫ‌రెన్స్‌లోనే నాయ‌కులు గ‌డుపుతున్నారు. చంద్ర‌బాబు, లోకేశ్‌తో పాటు మిగిలిన టీడీపీ నాయ‌కుల మాట‌లు వింటే… వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌తే త‌మ‌ను అధికారంలోకి తీసుకొస్తుంద‌నే అతి విశ్వాసం క‌నిపిస్తోంది.

అంతే త‌ప్ప‌, మ‌ళ్లీ చంద్ర‌బాబు సీఎం కావాల‌ని జ‌నం కోరుకుంటున్నార‌నే ధీమా వారి నుంచి రావ‌డం లేదు. ఎన్నిక‌ల హామీల‌ను అమ‌లు చేస్తున్న త‌మ‌ను కాద‌ని టీడీపీ రావాల‌ని ప్ర‌జ‌లు ఎలా కోరుకుంటార‌ని వైసీపీ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ వాద‌న‌ను కొట్టి పారేయ‌లేం. మంచోచెడో వైసీపీ నేత‌లు నిత్యం ప్ర‌జ‌ల్లో వుంటున్నారు. కొన్ని చోట్ల స‌మ‌స్య‌ల‌పై నిల‌దీత‌కు గురి అవుతున్నారు. క్షేత్ర‌స్థాయిలో టీడీపీ నేత‌లు అప్పుడ‌ప్పుడు త‌ప్ప ఎక్క‌డ క‌నిపిస్తున్నారు? ఈ ప్ర‌శ్న‌కు వారు నిజాయ‌తీగా స‌మాధానం చెప్పాల్సి వుంటుంది.

అక్టోబర్ 2 నుంచి లోకేశ్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అప్ప‌టి నుంచి ఎన్నిక‌ల వ‌ర‌కూ పూర్తిస్థాయిలో లోకేశ్ ప్ర‌జ‌ల మ‌ధ్యే గ‌డుపుతార‌ని టీడీపీ నాయ‌కులు అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న నాయ‌క‌త్వాన్ని లోకేశ్ ఏ మాత్రం నిరూపించుకున్నారో అంద‌రికీ తెలుసు.

రానున్న రోజుల్లో పాద‌యాత్ర ఆయ‌న‌కు, పార్టీకి ఉప‌యోగ‌ప‌డితే మంచిదే. కానీ జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త ఒక్క‌టే త‌మ‌కు అనుకూలిస్తుంద‌ని టీడీపీ భ్ర‌మ‌ల్లో వుంటే న‌ష్ట‌పోవ‌డం గ్యారెంటీ. త‌మ‌కు అనుకూల వాతావ‌ర‌ణాన్ని క్రియేట్ చేసుకోవాలంటే ప్ర‌జ‌ల మ‌ధ్య గ‌డ‌పాలి. ఆ ప‌ని మానేసి మీడియా, జూమ్ మీటింగ్‌ల‌కే ప‌రిమితం అయితే మాత్రం టీడీపీ భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌దు.