సమస్య పరిష్కారం కోసం అమీతుమీకి సిద్ధమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హెచ్చరించారు. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఆందోళన చేసిన సమస్య, అధికారంలోకి వచ్చినా పరిష్కారం కాకపోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఉమ్మారెడ్డిగుంటలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టకపోవడమే ఆయన నిరసనకు కారణమైంది.
ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ 21వ డివిజన్ ఉమ్మారెడ్డిగుంటలో వందలాది కుటుంబాలు మురుగు సమస్యతో బాధపడుతున్నాయన్నారు. వర్షం వస్తే ఇళ్లలోకి మురుగునీళ్లు వచ్చే పరిస్థితి వుందన్నారు. పైనుంచి వచ్చే మురుగు నీళ్లతో కాలనీవాసులు నరకం అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఈ సమస్యపై ప్రశ్నించినట్టు గుర్తు చేశారు.
సమస్యను పరిష్కరించకుండా కార్పొరేషన్, రైల్వే అధికారులు పరస్పరం ఒకరిపై మరొకరు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అయిన తర్వాత మూడేళ్లుగా రైల్వే, కార్పొరేషన్ అధికారులకు పదేపదే చెప్పినట్టు శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అయినా సమస్య పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవాళ రైల్వే మూడో లైన్ పనులు జరుగుతుండడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం అధికారులతో కలిసి ఇక్కడికి వచ్చినపుడు …ప్రతిపక్ష ఎమ్మెల్యేగా బ్రిడ్జి సాధన కోసం మురుగుగుంటలో దిగావని, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా దానిపై మీ ఆలోచన, వైఖరి ఏంటని స్థానిక ప్రజలు నిలదీశారన్నారు.
ఎవరి పాటికి వారు రావడం, తెల్లచొక్కా, తెల్ల ప్యాంటు వేసుకొచ్చి, మీడియాను వెంటబెట్టుకొచ్చి ఫొటోలు తీసుకెళ్తారని, తమకేం వస్తుందని స్థానిక ప్రజలు ప్రశ్నించినట్టు కోటంరెడ్డి తెలిపారు. ఈ రైల్వే అధికారుల నిరంకుశ విధానాలను, నెల్లూరు కార్పొరేషన్ అధికారుల నత్తనడకని ప్రశ్నిస్తూ, ప్రజల పక్షాన బ్రిడ్జి సాధన కోసం అమీతుమీ తేల్చుకునేందుకు మురుగుగుంటలో దిగుతున్నట్టు ఆయన అన్నంత పని చేశారు.
సమస్య పరిష్కారం అయ్యే వరకూ నిరసన చేపడతానని హెచ్చరించారు. తనకు అంతకంటే మార్గం కనిపించలేదని ఆయన అన్నారు. అధికారులతో ఎన్ని సార్లు మాట్లాడాలి? ఎన్నిసార్లు సమీక్షలు జరపాలని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఈ నెల 15వ తేదీలోపు వంతెన నిర్మాణ పనులు ప్రారంభిస్తామని, వచ్చే నెల 15లోపు ప్రారంభిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో కోటంరెడ్డి నిరసన విరమించారు. ఇదిలా వుండగా కొంత కాలంగా కోటంరెడ్డి వైఖరి అధికార పార్టీకి ఇబ్బందికరంగా మారింది.