చంద్రబాబుని కరోనా వైరస్ తో పోలుస్తూ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సెటైర్ వేశారు. కరోనా వైరస్ లాగే బాబు కూడా ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతుంటారని, అలా మ్యుటేట్ అయి ఇప్పుడు కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందారని అన్నారు. ఇలా రూపాంతరం చెందిన కొత్త వేరియంట్ ప్రజల్ని మరింత ఇబ్బంది పెడుతోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు అధికారంలోకి వస్తానంటూ పగటి కలలు కంటున్నారని, ఇప్పటి వరకూ వ్యవస్థల్ని మేనేజ్ చేసి పనులు కానిచ్చారని, అయితే అధికారం రావాలంటే వ్యవస్థలు, రోజుకి కోటి ఫీజు తీసుకునే లాయర్ల సాయం సరిపోదని, ప్రజలు కోరుకోవాలని అన్నారు. బాబు కావాలనే ఈ వాస్తవాన్ని మరచిపోయినట్టు నటిస్తున్నారని చెప్పారు విజయసాయిరెడ్డి.
“బాబూ నీది మీటర్ గేజ్ పై తిరిగే రైలు, ఈ రెండేళ్లలో రాష్ట్రమంతా గేజి మార్పిడి జరిగి, బ్రాడ్ గేజ్ అందుబాటులోకి వచ్చింది. అయినా ఈ పట్టాలమీదే తిప్పుతానంటే రైలు అక్కడే కూరుకుపోతుంది. దానిని అలా వదిలేస్తే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు ప్రజలు. వ్యర్థ తాపత్రయాలు మానుకో.” అంటూ ట్విట్టర్ లో చంద్రబాబుకి హితవు పలికారు విజయసాయిరెడ్డి.
చంద్రబాబుకి ఇప్పుడు కావాల్సింది అధికారం కాదని, ఆస్తుల్ని కాపాడుకోవడం, అరెస్ట్ ల నుంచి తప్పించుకోవడమేనని అన్నారు విజయసాయిరెడ్డి. అందుకే చంద్రబాబు బీజేపీ చెలిమి కోరుకుంటున్నారని చెప్పారు.
చంద్రబాబుని బీజేపీ చేరదీసినా వచ్చే ఎన్నికల నాటికి బీజేపీతోనే ఉంటారనే నమ్మకం లేదని, బీజేపీతో తాత్కాలిక స్నేహం మాత్రమే కోరుకుంటున్నారని, ఎన్నికల నాటికి ఆయన రంగులు మార్చే ఊసరవెల్లి రూపంలోకి వచ్చేస్తారని దెప్పిపొడిచారు విజయసాయి.