వైసీపీపై వ్య‌తిరేక‌త స‌రే…టీడీపీకి ఇదే స‌మ‌స్య‌!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తోంది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేశాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఒంట‌రిగా ఎదుర్కోలేమ‌ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావించారు. దీంతో…

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు గ‌డువు ముంచుకొస్తోంది. దీంతో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు రాజ‌కీయ కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేశాయి. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను ఒంట‌రిగా ఎదుర్కోలేమ‌ని టీడీపీ, జ‌న‌సేన అధినేత‌లు చంద్ర‌బాబునాయుడు, ప‌వ‌న్‌క‌ల్యాణ్ భావించారు. దీంతో ఇద్ద‌రూ క‌లిసి వైఎస్ జ‌గ‌న్‌ను ఢీకొట్ట‌డానికి సిద్ధ‌మ‌య్యారు. పొత్తు కుదుర్చుకున్నారు. ఇంత వ‌ర‌కూ బాగానే వుంది.

వైసీపీపై వ్య‌తిరేక‌త తీవ్రంగా వుంద‌ని టీడీపీ, జ‌న‌సేన న‌మ్ముతున్నాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీలుగా వైసీపీపై ఎలాంటి అభిప్రాయానికైనా వ‌చ్చే స్వేచ్ఛ వుంది. ఆ రెండు పార్టీల నేత‌లు అంచ‌నా వేసిన‌ట్టుగానే వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త వుంద‌ని అనుకుందాం. వైసీపీని ఢీకొట్టే విష‌యానికి వ‌స్తే ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు స‌రైన అభ్య‌ర్థులున్నారా? అనేది ఇప్పుడు ప్ర‌శ్న‌. చంద్ర‌బాబునాయుడు , లోకేశ్ త‌మ‌కు కావాల్సిన వాళ్ల‌కు టికెట్లు ఇచ్చేందుకు ఇప్ప‌టికే డిసైడ్ అయ్యారు. కొంద‌రి విష‌యంలో స‌ర్వే నివేదిక‌ల‌ను ప‌ట్టించుకోలేద‌ని స‌మాచారం.

టీడీపీ వైఖ‌రిపై రాబిన్ శ‌ర్మ స్ట్రాట‌జీ టీం కూడా అసంతృప్తిగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. వైసీపీపై వ్య‌తిరేక‌త ఒక్క‌టే టీడీపీ-జ‌న‌సేన కూట‌మికి అధికారం తెచ్చివ్వ‌దు. స‌రైన అభ్య‌ర్థుల‌తో బ‌రిలో దిగితేనే ఆ కూట‌మికి క‌లిసొస్తుంది. లేదంటే మ‌ళ్లీ వైసీపీ చేతిలోకి అధికారం వెళ్ల‌డం ఖాయ‌మ‌ని రాబిన్ శ‌ర్మ టీం హెచ్చ‌రిస్తున్న‌ట్టు తెలిసింది.

ఉదాహ‌ర‌ణ‌కు నంద్యాల జిల్లా కేంద్ర అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాన్నే తీసుకుందాం. అక్క‌డ ఎన్ఎమ్‌డీ ఫ‌రూక్‌కు టికెట్‌ను టీడీపీ ఖ‌రారు చేసింది. కానీ అక్క‌డ ఏ రకంగా చూసినా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి స‌రైన అభ్య‌ర్థిగా ప‌లు టీడీపీ స‌ర్వేలే చెబుతున్నాయి. అయితే ఏపీలో ఎక్క‌డో ఒక‌చోట మైనార్టీ నేత‌కు టికెట్ ఇవ్వాల‌నే త‌లంపుతో నంద్యాలలో బ‌ల‌హీనమైన అభ్య‌ర్థి ఫ‌రూక్‌ను నిల‌బెట్ట‌డానికి నిర్ణ‌యించారు. టికెట్ ఖ‌రారైన ఫ‌రూక్‌ను నంద్యాల‌లో ప‌ల‌క‌రించే టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో వైసీపీకి అక్క‌డ గెలుపు సునాయాస‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

అలాగే డోన్‌లోనూ ఇదే ప‌రిస్థితి. కొన్ని నెల‌ల క్రిత‌మే సుబ్బారెడ్డిని చంద్ర‌బాబు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. డోన్‌లో మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌రెడ్డిని ఎదుర్కొనే స‌త్తా సుబ్బారెడ్డికి లేద‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. ఆళ్ల‌గ‌డ్డ‌లో వైసీపీ ఎమ్మెల్యే బ‌ల‌హీన‌మైన నాయ‌కుడు. కానీ టీడీపీ ఇన్‌చార్జ్‌, మాజీ మంత్రి అఖిల‌ప్రియ త‌న అరాచ‌కాల‌తో ప్ర‌జ‌ల్ని టెర్ర‌రైజ్ చేస్తున్నారు. దీంతో అఖిల‌ప్రియే అభ్య‌ర్థి అయితే అక్క‌డ టీడీపీ మ‌రోసారి ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌క‌ట్టుకోక త‌ప్ప‌దు.

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తికి వెళితే… బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అత్యంత బ‌ల‌హీన‌మైన అభ్య‌ర్థిగా క‌నిపిస్తున్నారు. వైసీపీ అభ్య‌ర్థిగా మ‌రోసారి బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి బ‌రిలో నిల‌వ‌నున్నారు. మ‌ధుపై తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లున్నాయి. అయిన‌ప్ప‌టికీ వైసీపీపై వ్య‌తిరేక‌త‌ను సొమ్ము చేసుకునే ప‌రిస్థితిలో సుధీర్ లేర‌ని అంటున్నారు. పైగా సొంత పార్టీ వాళ్ల‌ను క‌లుపుకోలేని నిస్స‌హాయ స్థితిలో ఆయ‌న ఉన్నారు. అలాగే చిత్తూరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఇంత వ‌ర‌కూ టీడీపీకి ఇన్‌చార్జ్ లేరు. పూత‌ల‌ప‌ట్టు అభ్య‌ర్థిగా ముర‌ళీమోహ‌న్ అనే జ‌ర్న‌లిస్ట్‌ను నియ‌మించారు. ఈ ద‌ఫా ముర‌ళీని గెలిపించాల‌ని చాలా రోజుల క్రితం చంద్ర‌బాబు అక్క‌డ జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో విన్న‌వించారు. ఇత‌ని అభ్య‌ర్థిత్వంపై టీడీపీ శ్రేణులే పెద‌వి విరుస్తున్నాయి.

అలాగే క‌డ‌ప జిల్లాకు వెళితే… ప్రొద్దుటూరులో వైసీపీ ఎమ్మెల్యే రాచ‌మ‌ల్లు శివ‌ప్ర‌సాద్‌రెడ్డిపై వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ, దాన్ని క్యాష్ చేసుకునే ప‌రిస్థితిలో టీడీపీ లేదు. ప్రొద్దుటూరు నుంచి జి.ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి బ‌రిలో వుంటార‌ని పాద‌యాత్ర‌లో లోకేశ్ ప‌రోక్షంగా సంకేతాలు ఇచ్చి వెళ్లారు. దీంతో ఆ సీటును కూడా వ‌దులుకున్న‌ట్టే అనే చ‌ర్చ జ‌రుగుతోంది. అదే జిల్లాలో క‌మ‌లాపురం టికెట్‌ను నాలుగు సార్లు ఓడిపోయిన పుత్తా న‌ర‌సింహారెడ్డికే ఇవ్వాల‌ని అనుకోవ‌డాన్ని చూస్తే టీడీపీ ఎంత బ‌ల‌హీనంగా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. నెల్లూరుకు వెళితే… ఐదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి త‌ప్ప‌, మ‌రో నాయ‌కుడు స‌ర్వేప‌ల్లి నుంచి పోటీ చేయ‌డానికి టీడీపీకి దొర‌క‌డం లేదు.

విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట టికెట్‌ను అనిత‌కే ఇస్తార‌ని అంటున్నారు. అనిత‌పై క్షేత్ర‌స్థాయిలో తీవ్ర‌మైన వ్య‌తిరేక ఉంద‌ని తెలిసి కూడా, మ‌రో గ‌త్యంత‌రం లేకపోవ‌డం టీడీపీ దుస్థితిని తెలియ‌జేస్తోంది. గ‌తంలో అనిత‌ను ఇత‌ర జిల్లాల‌కు త‌రిమేసిన సంగ‌తి తెలిసిందే. అలాగే మాజీ మంత్రులు న‌క్కా ఆనంద్‌బాబు, జ‌వ‌హ‌ర్ త‌దిత‌ర నేత‌ల‌పై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో సానుకూల‌త లేదు. వీరికంటే టీడీపీకి మ‌రో గ‌త్యంత‌రం లేదు. ఇక జ‌న‌సేన‌తో పొత్తు వ‌ల్ల కూడా టీడీపీ చేజేతులా కొన్ని సీట్ల‌ను వైసీపీకి అప్ప‌నంగా అప్ప‌గించాల్సి వ‌స్తుంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

ఉదాహ‌ర‌ణ‌కు తెనాలి టికెట్‌ను జ‌నసేన‌కు ఇస్తే నాదెండ్ల మ‌నోహ‌ర్ పోటీ చేస్తారు. ప‌దేళ్లుగా అస‌లు ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌తో సంబంధాలే లేవు. ఇటీవ‌ల ఆయ‌న తెనాలిలో పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారంటే నాదెండ్ల ప‌రిస్థితిని అర్థం చేసుకోవ‌చ్చు. జ‌న‌సేన‌కు టికెట్లు ఇస్తే, అక్క‌డ టీడీపీ నాయ‌కులే వారికి వ్య‌తిరేకంగా చేసే ప‌రిస్థితి వుంది. గ్రౌండ్ లెవెల్‌లో ప‌రిస్థితుల‌ను ప‌రిశీలిస్తే టీడీపీకి ఏమంత సులువుగా లేద‌న్న వాస్త‌వం అర్థ‌మ‌వుతుంది. వీట‌న్నింటిని టీడీపీ అధిగ‌మించడం పెద్ద టాస్కే.