మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ తో సినిమా అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. తన దివాణంలో వున్న శశి అనే దర్శకుడు తయారుచేసిన స్క్రిప్ట్ ను ఓకె చేసారు. కానీ తీరా సినిమా స్టార్ట్ చేసిన తరువాత తెలిసింది అశోక్ దగ్గర హీరో మెటీరియల్ అంతలేదన్న సంగతి. వాస్తవానికి ఓ సూపర్ స్టార్ మేనల్లుడు, ఓ ఎంపీ తనయుడు అంటే మొహమాటం కోసమైనా ముందుకు వెళ్తారు ఎవరైనా. కానీ దిల్ రాజు స్మూత్ గా ఆ ప్రాజెక్టు ఆపేసారు.
సైలెంట్ గా ఆ ప్రాజెక్టుకు ఇప్పుడు నాగచైతన్యను ఫిక్స్ చేసేసారు. వాస్తవానికి చైతూను ఫిక్స్ చేస్తారని ముందే వార్తలు వినిపించాయి. అయితే నిన్ననో, మొన్ననో అగ్రిమెంట్ అయిపోయింది. ప్రస్తుతం చేస్తున్న మజిలీ, వెంకీ మామ పూర్తికాగానే చైతూ ఈ సినిమా మీదకు వస్తాడు.
అంటే ఈ ఏడాది చైతూ మూడు సినిమాలు విడుదల చేసే మూడ్ లో, ఊపులో వున్నాడన్నమాట. ఈ ఏడాది ఆరేడు సినిమాలు చేయాలనే ఆలోచనలో వున్నారు దిల్ రాజు. అందుకే శశి స్క్రిప్ట్ రెడీగా వుందని, చైతూను ఒప్పించేసారు.