విభేదాల‌ను ర‌చ్చ‌కీడ్చిన య‌శ్వంత్ సిన్హా ప‌ర్య‌ట‌న‌

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఇందుకు కార‌ణ‌మైంది. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తెలంగాణ వెళ్లారు. ఆయ‌న‌కు…

తెలంగాణ కాంగ్రెస్‌లో విభేదాలు మ‌రోసారి బ‌య‌ట‌ప‌డ్డాయి. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న ఇందుకు కార‌ణ‌మైంది. విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా ప్ర‌చారంలో భాగంగా ఆయ‌న తెలంగాణ వెళ్లారు. ఆయ‌న‌కు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ఘ‌న స్వాగ‌తం ప‌లికింది.

బేగంపేట ఎయిర్‌పోర్టుకు శనివారం ఉదయం చేరుకున్న యశ్వంత్‌సిన్హాకు ఘన స్వాగతం లభించింది. స్వ‌యంగా సీఎం కేసీఆర్‌, మం‍త్రులు స్వాగతం పలక‌డం విశేషం. బేగంపేట నుంచి జలవిహార్‌ వరకు జరిగిన‌ ర్యాలీలో సిన్హాతో కలిసి తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన‌డం ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. ఇదిలా వుండ‌గా య‌శ్వంత్ సిన్హాను టీపీసీసీ త‌ర‌పున ఆహ్వానించి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయాలు వ్య‌క్తమ‌వుతున్నాయి.

య‌శ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ అధిష్టానం సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. యశ్వంత్ నామినేష‌న్‌కు కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్‌గాంధీ కూడా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో మాత్రం అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కేసీఆర్‌ను క‌లిసిన త‌ర్వాత తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ య‌శ్వంత్ సిన్హాను క‌లిసే ప్ర‌శ్నే లేద‌ని రాహుల్‌కు తేల్చి చెప్పిన‌ట్టు టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

య‌శ్వంత్ సిన్హాను తాము క‌ల‌వ‌డం ద్వారా తెలంగాణ‌లో నెగెటివ్ సంకేతాలు వెళ్తాయ‌ని రేవంత్ మాట‌ల్లో భ‌యం క‌నిపించింది. కానీ య‌శ్వంత్ సిన్హాను క‌లిసి వుంటే బాగుండేద‌ని జ‌గ్గారెడ్డి త‌దిత‌ర నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో కేసీఆర్‌, మంత్రుల‌తో పాటు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు వీహెచ్ హ‌నుమంత‌రావు క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఒక‌వైపు య‌శ్వంత్ సిన్హాకు మ‌ద్ద‌తు ఇస్తూ, రాష్ట్రానికి వ‌స్తే క‌నీసం ప‌ల‌క‌రించ‌క‌పోవ‌డం ఏంట‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నిస్తున్నారు.

యశ్వంత్ సిన్హా అపాయింట్‌మెంట్ అడిగాన‌ని, అవ‌కాశం ఉంటే త‌ప్ప‌క క‌లుస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించ‌డం ద్వారా రేవంత్‌రెడ్డి అభిప్రాయాన్ని లెక్క‌చేయ‌న‌ట్టైంది. అవ‌కాశం వ‌స్తే చాలు త‌మ‌లోని విభేదాల‌ను ఏ మాత్రం ర‌చ్చ‌కీడ్చ‌డానికి టీపీసీసీ నేత‌లు వెనుకాడ‌డం లేద‌ని య‌శ్వంత్ సిన్హా ప‌ర్య‌ట‌న సాక్షిగా నిరూపిత‌మైంది.