బీజేపీ పాలనపై విమర్శలు చేయడానికి విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎప్పుడూ ముందుంటారు. అనేక సందర్భాల్లో మోదీ పాలనపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియా వేదికగా సెటైర్స్ విసిరిన ఘనత ప్రకాశ్‌రాజ్‌కు దక్కుతుంది. గతంలో ఆగ్రాలో తాజ్‌మహల్‌ను ఎప్పుడు కూలగొడుతారో చెబితే, ముందుగా వెళ్లి చూసి వస్తామని బీజేపీ పాలనపై ఘాటైన సెటైర్ విసరడాన్ని గుర్తు చేసుకోవచ్చు.
తాజాగా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహించతలపెట్టారు. దీంతో బీజేపీ అగ్రనాయకులు మొదలుకుని, జాతీయ నాయకులంతా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై, బీజేపీ నేతలపై ట్విటర్ వేదికగా ప్రకాశ్‌రాజ్ తన మార్క్ పంచ్‌లు విసిరారు.
తెలంగాణలో అద్భుత పాలన నడస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రకాశ్‌రాజ్ తన అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్‌కు వస్తున్నఅత్యుత్తమ నాయకుడికి స్వాగతం అంటూ మోదీని ఆయన వెటకరించారు. పాలన ఎలా ఉండాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా హితవు చెప్పారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటనలను కూడా తెరపైకి తెచ్చి దెప్పి పొడిచారు.
మోదీ పర్యటిస్తున్న సమయంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలు కట్టిన పన్నుల మొత్తంలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి రోడ్లు వేస్తుంటారని పేర్కొన్నారు. కానీ, తెలంగాణలో మాత్రం ప్రజల అభివృద్ధి కోసమే ఖర్చు చేస్తారని ప్రకాశ్‌రాజ్ చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పర్యటనను ఆస్వాదించాలని, దూరదృష్టితో మౌలిక సదుపాయాలు ఎలా అందించాలో చూసి నేర్చుకోవాలని పరోక్షంగా మోదీని ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఆర్ ఫొటోతో పాటుగా కాళేశ్వరం ప్రాజెక్టు, యాదాద్రి, టీ హబ్, ప్రభుత్వ ఆసుపత్రి, గురుకుల పాఠశాల భవనాలతో కూడిన ఫొటోలను ప్రకాశ్ రాజ్ షేర్ చేయడం విశేషం. మోదీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటులో భాగంగా మహారాష్ట్రకు వెళ్లిన కేసీఆర్ బృందానికి ముంబయ్ విమానాశ్రయంలో ప్రకాశ్‌రాజ్ స్వాగతం పలకడం, అలాగే అక్కడి నేతలతో చర్చల్లో ప్రకాశ్‌రాజ్ పాల్గొనడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.
ఒక దశలో తెలంగాణ నుంచి ప్రకాశ్‌రాజ్‌ను రాజ్యసభకు పంపుతారని ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. మోదీని, బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే కేసీఆర్ అంటే ప్రకాశ్‌రాజ్ అభిమానాన్ని పెంచుకున్నారని ఆయన రాజకీయ పంథానే తెలియజేస్తోంది.