తెలంగాణలో ఎన్నికల రాజకీయం జోరందుకుంది. ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రెండు ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించిన బీజేపీ, ఆ ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కలలు కంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్ని నిర్వహించనుండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తెలంగాణలో అధికారంలోకి రావడంపై బీజేపీ ఎంతగా దృష్టి పెట్టిందో ఆ పార్టీ జాతీయ సమావేశాల నిర్వహణే నిదర్శనం. ఈ సమావేశాల నిమిత్తం తమిళనాడు బీజేపీ నాయకురాలు, ప్రముఖ నటి ఖుష్బూ హైదరాబాద్ వచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.
దేశంలో వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. వాటికి తమ పార్టీ వ్యతిరేకమన్నారు. తెలంగాణలో కూడా వారసత్వ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు.
తెలంగాణ ప్రజలు వాటికి వ్యతిరేకంగా వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారని ఖుష్బూ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల గురించి ప్రజలకు వివరించి వారి మనసులను గెలుచుకుంటామన్నారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా? రాదా? అనే విషయాన్ని కాసేపు పక్కన పెడదాం.
కానీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని తక్కువ చేసి చూడలేం. తమకు అనుకూలంగా తెలంగాణ సమాజాన్ని మార్చుకునేందుకు బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోందన్నది వాస్తవం.