‘దగ్గుబాటి’ చెప్పిన లక్ష్మీపార్వతి చరిత్ర

మీడియా మహాత్యంతో గొప్పవారిగా ముద్ర వేయించుకుని, గొప్పవారిగా చలామణీ అయిపోతున్నవారి జీవితాల్లోని చీకటి కోణాలు అందరకీ తెలియకపోవచ్చు. కానీ కొందరయినా ప్రత్యక్ష సాక్షులు వుంటారు. సాక్షి గొప్పవాడు, మహాను భావుడు కానక్కరలేదు. విషయానికి ప్రత్యక్ష…

మీడియా మహాత్యంతో గొప్పవారిగా ముద్ర వేయించుకుని, గొప్పవారిగా చలామణీ అయిపోతున్నవారి జీవితాల్లోని చీకటి కోణాలు అందరకీ తెలియకపోవచ్చు. కానీ కొందరయినా ప్రత్యక్ష సాక్షులు వుంటారు. సాక్షి గొప్పవాడు, మహాను భావుడు కానక్కరలేదు. విషయానికి ప్రత్యక్ష సాక్షి అయితే చాలు. నిజాలు బయటకు ధైర్యంగా చెప్పగలిగినా చాలు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడు, చంద్రబాబుతో ఆది నుంచి అంతగా పొసగని వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఆయన ఎప్పుడో ఓ పుస్తకం రాసేసారు. 

అందులో తెలుగుదేశం పార్టీ వ్యవహారాలు, ఎన్టీఆర్ వెన్నుపోటు, దాని తెర వెనుక వైనాలు అన్నీ ఏకరవు పెట్టారు. చదివిన వారు చదవారు.లేని వారు. లేదు. కానీ ఇన్నాళ్ల తరువాత దగ్గుబాటి మళ్లీ తన పుస్తకంలోని కీలక చాప్టర్లను తీసుకువచ్చి ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ప్రారంభించారు. ఆయన అక్కౌంట్ లింక్ ఇధి

ముందుగా ఎన్టీఆర్ వెన్నుపోటు వెనుక మీడియా టైకూన్ రామోజీ రావు ప్రమేయం ఏమేరకు వుందన్నది ఏకరవు పెట్టారు. ఎన్టీఆర్ పై ఇలా చేయవద్దని తాను రామోజీని ఎలా ప్రాధేయపడిందీ వెల్లడించారు. చంద్రబాబుపై లారీడు చెప్పులు పడితే, దాన్ని రామోజీ తన వార్తల్లో కప్పేసిన వైనాన్ని వివరించారు. 

అయితే కేవలం రామోజీ వ్యవహారం మాత్రం వెల్లడించి వదిలేస్తే సరిపోదని, రెండో రోజు మరో చాప్టర్ ను పోస్ట్ చేసారు. ఈసారి ఆయన లక్ష్మీ పార్వతి ప్రమేయం వివరించారు. అంతే కాదు, ఇంకా తన పుస్తకంలో వున్న పలు చాప్టర్లను, ఎన్టీఆర్ పదవీ చ్యుతి వెనుక వున్న పలువరు వ్యక్తుల ప్రమేయాన్ని వెల్లడిస్తానని చెప్పేసారు. 

ఆ ఫేస్ బుక్ పోస్ట్ యధాతథంగా….

చరిత్ర లో ఎన్టీ రామారావు గారి చివరి ఘట్టం.

నిజా – నిజాలు నిస్పక్షపాత ధోరణిలో. 

నిన్నటి రోజున నేను ఫేస్ బుక్ ద్వారా పెట్టిన పోస్ట్ కు ఎంతో మంది స్పందించి తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో కొందరు అటూ, మరికొందరు ఇటూ గా  తెలిపారు . నాకు రామోజీ రావు గారి మీద గాని, చంద్రబాబు మీద గాని, మరిఎవరి మీద కానీ వ్యక్తిగతంగా కోపం కాని, ద్వేషం కాని లేదు. జీవితంలో మనకు రాసి ఉన్నదే జరుగుతుందని నమ్మిన మనిషిని. అది చంద్రబాబు కావొచ్చు ఇంకొకరి కావొచ్చు. ఈ మధ్యకాలంలో రెండు సార్లు నేను రామోజీరావు గారి  తో కలిశాను. వారు నాతో మంచిగానే ఉంన్నారు.  

వాస్తవాలని, చరిత్రను ఎవరు వక్రీకరించకూడదని నా అభిప్రాయం. చరిత్ర లో నేను కూడా ఉన్నాను. పశ్చాత్తాపం కూడా తెలిపాను. అంతో ఇంతో నేను బాధ్యత వహించిన వాడినే. నేను ఆ రోజుల్లో ఉన్న మనిషి కాబట్టి అబద్ధాలు చెప్పటం, వాస్తవాల వక్రీకరణ చేయకూడదని భావిస్తాను. అబద్ధాలు చెప్పటం ఆర్ట్ అయితే, నిజాలు చెప్పటం ధైర్యం అనుకుంటాను. కానీ దీనిలో ఎవరికి కావలసినట్లు వారు అన్వయించుకుంటే నేను చేయగలిగిందేమీ లేదు.

ఇక తరువాయి భాగం…

లక్ష్మీపార్వతి ఉదంతానికి వద్దాం. ఎన్టీఆర్ నిష్క్రమణకు ఏ విధంగా కారణభూతురాలు అయ్యింది.

టిడిపి ప్రచార విభాగం తో లక్ష్మీపార్వతి భార్యాభర్తలు పార్టీ కి చేరువయ్యారు. రామారావు గారు 1989 లో ఓడిపోయిన తర్వాత ఎక్కువ సమయం ఖాళీగా ఉండేవారు. ఆ సమయంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, చలమేశ్వరరావు గారు మొదలైన వారు సమయం దొరికినప్పుడల్లా రామారావు గారితో సాహిత్య, చారిత్రక విషయాలపై చర్చలు జరుపుతూ ఉండేవారు. లక్ష్మీపార్వతి కి కూడా సాహిత్య రంగ ప్రవేశం ఉండటం వల్ల మెల్లమెల్లగా రామారావు గారి ఖాళీ సమయాన్ని ఆక్రమించడం మొదలుపెట్టింది. 

ఆత్మ కథ వ్రాస్థానంటూ మొదలైన ఈ పరిచయం… తన మొదటి భర్త వీరగంథం వెంకట సుబ్బారావు తనను వేదించాడనీ లేని పోని కథనాలు చెబుతూ.. మేటర్ పెళ్లి దాకా తీసుకువెళ్ళింది. కానీ ఇది అంతటితో ఆగలేదు. రాజకీయంగా కూడా తాను ఎదగాలని ఆలోచన మొదలయ్యింది. కుటుంబ సభ్యులకు లక్ష్మీ పార్వతి తమ తల్లి స్థానం ఆక్రమించడం సహజంగానే జీర్ణించుకోలేకపోయారు. వ్యతిరేకత మొదలైంది. 

లక్ష్మీపార్వతి కి రామారావు గారి మీద ప్రేమ, అభిమానం, ఆరాధనలమీద భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఇందుకు నిదర్శనం రామారావు గారు తన చేతులతో తాను భోజనం చేయలేరని ప్రజలను నమ్మించడానికి పడరాని పాట్లు పడేది. నిజంగా రామారావు గారి మీద ప్రేమ ఆరాధన ఉన్నట్లయితే రామారావు గారు నిజంగా తిన లేకపోతే పదిమందిలో తను వచ్చి తినిపించకూడదు. అదీ కాక ఇంటి వద్ద నాకు తెలుసు…. రామారావు గారు మొదట్లో తినడానికి కొంత ఇబ్బంది కలిగినా తరువాత తన చేతులతో తాను తినగలిగే స్థితిలో ఉండేవారు.

ఆ రోజుల్లోనే రామారావు గారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తరువాత 1994 లో తెలుగుగంగ ప్రాజెక్ట్ విషయం గురించి మాట్లాడేందుకు ఒకసారి జయలలిత ముఖ్యమంత్రి గా రామారావు గారి వద్దకు వచ్చినప్పుడు బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 13 ఇంటి వద్ద పైన భోజనాలు ఏర్పాటు చేశారు. నేను వెళ్లి జయలలిత ను ఎయిర్ పోర్ట్ నుండి తీసుకు వచ్చాను . లక్ష్మీపార్వతి ఎందుకో అలిగి కూర్చుంది. రామారావు గారు ఎంత పిలిచినా రాలేదు. రామారావు గారికి కోపం వచ్చింది. ఆమె ను పిలవకుండానే భోజనం దగ్గర కూర్చున్నారు. అందరూ కలిసి భోజనం చేయడం మొదలుపెట్టారు. ఒక చేత్తో ఫోర్క్, ఒక చేత్తో స్పూన్ పట్టుకొని రామారావు గారు అందరి ముందు భోజనం చేయటం మొదలుపెట్టారు. వెంటనే ఎవరో ఈ ఉదంతాన్ని లక్ష్మీపార్వతి కి చేరవేశారు . ఇంకేముంది…లక్ష్మీపార్వతి పరిగెత్తుకుంటూ వచ్చి రామారావు గారికి అందరి ముందు భోజనం తినిపించడం మొదలుపెట్టింది.

రెండవసారి…. ఢిల్లీలో నేషనల్ ఫ్రంట్ మీటింగ్ కోసం రామారావు గారు తోటి మేమందరము కలిసి వెళ్ళడం జరిగింది. ఒక రకంగా అది చాలా రోజుల తర్వాత నేషనల్ ఫ్రంట్ ని పునరుద్ధరించే సమావేశం . ఆ సమావేశానికి రామకృష్ణ హెగ్డే, బిజు పట్నాయక్, కరుణానిధి, దేవీలాల్, వి.పి.సింగ్, ములాయం సింగ్ యాదవ్ లాంటి ప్రముఖులు అందరు కూడా వచ్చారు. రాత్రి కి విందు, కొత్తగా ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ ఇంటి వద్ద ఏర్పాటు అయింది. జనం విపరీతంగా వచ్చారు. అంత మంది లో లాన్స్ మధ్య ఏర్పాటైన ఒక కుర్చీ మీద రామారావు గారిని కూర్చోబెట్టి లక్ష్మీపార్వతి రామారావు గారికి భోజనం తినిపించటం మొదలుపెట్టింది. 

సహజంగా రామారావుగారు అంత మంది మధ్యలో భోజనం చేయరు. జస్ట్ కనపడి ఇంటికి వెళ్లి భోజనం చేస్తారు. ఇంకేముంది నేషనల్ ప్రెస్ అంతా అక్కడే ఉంది. వెంటనే అందరూ ఫోటోలు తీశారు. రెండవ రోజు అన్ని జాతీయ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో రామారావు గారు పక్షవాతం వచ్చినవారు లాగా చేతులు వ్రేలాడవేసి లక్ష్మీపార్వతి అన్నం తినిపిస్తున్న ఫోటోలు ప్రచురించబడింది. మేమేమో నేషనల్ ఫ్రంట్ ప్రముఖులతోటి రామారావు గారు ఉన్న ఫోటోలు ప్రత్రికల్లో ఫ్రంట్ పేజీలో వస్తుందని ఎదురు చూసినవారం…. చాలా నిరాశకు గురయ్యాము…… 

ఇంకా పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలలు లో రాబోతున్న సమయం అది… రామారావు గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలో ఉన్న సమయం అది …. ఈ విధమైన ఫోటోలు కోసమా మేమూ, రామారావు గారు ఢిల్లీ వెళ్ళింది….? నేషనల్ ఫ్రంట్ సమావేశం ఏర్పాటు చేసింది… ? నిజంగా రామారావు గారిని అభిమానించే వారు అయితే, రామారావు గారు తినలేక పోయినా దానిని expose కాకుండా ప్రయత్నం చేస్తాం…. కానీ ఇదేమిటి ఈమె ఇలా చేస్తుంది ? అంటే చెప్పనవసరం లేదు.

తర్వాత రోజుల్లో ఎమ్మెల్యేలతో పరిచయాలు పెరిగాయి. ముద్దు కృష్ణమనాయుడు, ఇంద్రారెడ్డి, నరసింహులు లాంటి వారిని దగ్గరకు తీయడం జరిగింది. చివరకు సెంట్రల్ బ్యాంక్ జిల్లా అధ్యక్షులు ఎన్నికల సమయంలో ఇది పరాకాష్ట కు వెళ్ళింది. జిల్లాల్లో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల తర్వాత జిల్లా అధ్యక్షులు ఎన్నిక కావాలి. ఈ ఎన్నికలప్పుడు సీల్డ్ కవర్లో అధ్యక్షుల పేర్లను రాసి పంపే అలవాటు ప్రకారం రామారావు గారు ప్రతి జిల్లాకు పేర్లు రాసి పంపించడం జరిగింది. ఈ అధ్యక్షులు పేర్లు ప్రతిపాదనల్లో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువయింది . ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో శ్రీనివాసరావు అనే బి.సి వర్గం వ్యక్తి పేరు రాయడం జరిగింది. అయితే అక్కడ వెలమలు ఎక్కువ… అందుచేత వెలమ అభ్యర్థి వెంకటేశ్వరరావును అందరు కలిసి ఎన్నుకోవడం జరిగింది. 

ఈ విధంగా అదిలాబాద్, నల్గొండ, వరంగల్లో ఇంకొక రెండు జిల్లాల్లో రామారావు గారు పంపినటువంటి అభ్యర్థులు కాకుండా వేరే వారిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు కూడా ఓటర్లు కాబట్టి కొంత మంది ఎమ్మెల్యేలు కూడా అక్కడ గెలిచిన అభ్యర్థులకు మద్దతు తెలిపినటువంటి విధానం ఉన్నది. ..అయితే లక్ష్మీ పార్వతి తాను సెలెక్ట్ చేసిన వారిని కాదని వేరే వారు ఎంపికవడం తో అగ్గిమీద గుగ్గిలం అయింది. 

మొత్తం మీద ఇలా మద్దతు తెలిపిన వారిలో మంత్రి మాధవ రెడ్డి, కడియం శ్రీహరి , ఆదిలాబాద్ మంత్రి గణేష్ లాంటి వారు కూడా ఉన్నారు. . సహజంగా రామారావు గారికి కోపం వచ్చింది …. 260కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు కాబట్టి, పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించడాన్ని ఆయన సహించలేదు. ఇది గమనించి నేను రామారావు గారి వద్దకు వెళ్లి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవద్దని, ఇది మంచిది కాదని చెప్పి ఢిల్లీ వెళ్లడం జరిగింది. రెండవ రోజు ఎనిమిది మంది శాసనసభ్యులను సస్పెండ్ చేసి పేపర్ ద్వారా బహిరంగ పరచడం జరిగింది…. ఇందులో నలుగురు కరీంనగర్ వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం లక్ష్మీపార్వతే. 

అంతటితో దీనికి పుల్ స్టాప్ పెడితే బాగానే ఉండేది. ఇది జరిగిన రెండు రోజులకు తూర్పుగోదావరి జిల్లా నుండి ఈనాడు పేపర్లో తాటికాయంత అక్షరాలతో 35 మంది శాసనసభ్యులపై వేటు పడబోతున్నదని ఆనాటి క్రమశిక్షణా సంఘం సభ్యులు గా ఉన్న మొగిలి వెంకటేశ్వరరావు ప్రకటన వచ్చింది…. 

ఇతను లక్ష్మీపార్వతి తో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి . ఇంకేముంది ఎమ్మెల్యేల లో అలజడి మొదలైంది. ఈ అలజడి ని చంద్రబాబు ఉపయోగించుకున్నాడు. ఈనాడు వత్తాసు పలికింది.

ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్నటువంటి బంగారు బాతు గుడ్డు కథ గుర్తుకొస్తుంది. హాయిగా ముఖ్యమంత్రి భార్యగా లక్షణంగా ఎంజాయ్ చేయవలసిన లక్ష్మీపార్వతి బంగారు గుడ్డు కోసం బాతునే చంపేసిన వైనం గోచరిస్తుంది. 

ఎనిమిది మంది శాసనసభ్యులను సస్పెండ్ చేయడం కూడా ఎలా జరిగిందంటే.. లక్ష్మీపార్వతి రామారావు గారి వద్ద అన్న మాటలు ….వారు చేసిన పార్టీ వ్యతిరేక పనిని ఆక్షేపిస్తూ రామారావుగారితో ఈ విధంగా ఏడుస్తూ ఈ విధంగా చెప్పింది. తను ఏడ్చేటప్పుడు తన కళ్లలో వచ్చే నీరు , నీరు కాదు రక్తం ధార అని. అంతగా తాను క్షోభిస్తున్నందువలన వెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అప్పుడు గానీ తన క్షోభకు శాంతి చేకూరదని చెప్పి వ్యాఖ్యానించింది. ఇది యదార్థంగా ఆమె అన్న మాటలు. ఇందుకు సాక్ష్యం ఆనాడు అక్కడ ఉన్నటువంటి గన్ మెన్ శ్రీనివాసరావు తర్వాత రోజుల్లో నా దగ్గర పనిచేశాడు. తాను ప్రత్యక్షంగా చూసినటువంటి ఈ ఉదంతాన్ని తాను తర్వాత రోజుల్లో నాకు చెప్పగా తెలిసింది…. 

ఇదండీ లక్మీ పార్వతి ఉదంతం…

–. డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ( 29 – 5 – 2021 )

మిగతా వివరాలు తర్వాత భాగం లో….  (నాతో పాటు చంద్రబాబు, లక్మీ ప్రసాద్, బాలక్రిష్ణ, హరికృష్ణ ఏవిధంగా కారకులో)