యాంటీ టీడీపీ పాలిటిక్స్.. పవన్ కు లాభమా..నష్టమా?

ఇప్పటి వరకూ పవన్ యాంటీ వైసీపీ పాలిటిక్స్ మాత్రమే చేశారు. అంటే జగన్ అంటే ద్వేషం ఉన్నవారిని తనవైపు లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఏపీలో జగన్ ని దాదాపు 80శాతం మంది సమర్థిస్తున్నారు. అంటే మిగతా…

ఇప్పటి వరకూ పవన్ యాంటీ వైసీపీ పాలిటిక్స్ మాత్రమే చేశారు. అంటే జగన్ అంటే ద్వేషం ఉన్నవారిని తనవైపు లాక్కోవాలనుకుంటున్నారు. కానీ ఏపీలో జగన్ ని దాదాపు 80శాతం మంది సమర్థిస్తున్నారు. అంటే మిగతా 20శాతంలో టీడీపీ, బీజేపీ, ఇతర పార్టీల వాటా పోగా జనసేనకు కూడా ఓట్లలో వాటా ఉండాలి. ఆ కాసిన్ని ఓట్లు జనసేనకు ఏమేరకు లాభం చేకూరుస్తాయి. 

నోటాని మించిపోయామని చంకలు గుద్దుకోవడమే కానీ, అభ్యర్థులు గెలవలేని పరిస్థితి. సో.. యాంటీ వైసీపీ పాలిటిక్స్ వల్ల ఉపయోగం లేదని, ముఖ్యంగా పవన్ కల్యాణ్ కి కానీ, జనసేనకు కానీ ఉపయోగం లేదని తేలిపోయింది.

పవన్ యాంటీ టీడీపీ పాలిటిక్స్ చేస్తే ఎలా ఉంటుంది? టీడీపీ అంటే ద్వేషం ఉండేవారిని తనవైపు తిప్పుకోవాలని చూస్తే నూటికి 80 మందిలో నుంచి ఎంతోకొంతమందిని జనసేన వైపు రావొచ్చు. ఈ ప్లాన్ ప్రకారం వెళ్తే జనసేనకు మంచి రోజులొచ్చే అవకాశముందని విశ్లేషకుల అభిప్రాయం.

జగన్ ని తిట్టడం కాస్త తగ్గించి.. చంద్రబాబుని, కేంద్రంలోని బీజేపీని ఎడాపెడా వాయించేస్తే.. జనసేనకు మంచిరోజులొస్తాయేమో. 2019లో దాదాపుగా ఇదే జరిగినా పవన్ ని ఎవరూ నమ్మలేదు. ఎందుకంటే ఆయన టికెట్ల కేటాయింపు అలా జరిగింది. టీడీపీకి లాభం వచ్చేలా, టీడీపీ అభ్యర్థులు గెలిచేందుకే చాలా చోట్ల డమ్మీలను పెట్టారు, మరికొన్ని చోట్ల పోటీయే ఆపేశారు పవన్. ఆ అపవాదు తొలగించుకుని చూస్తే పవన్ కి మంచిరోజులొస్తాయేమో..

నిజంగానే పవన్ కి అధికారం దక్కాలంటే, జనసేన బాగుపడాలంటే.. కచ్చితంగా ఆయన యాంటీ టీపీపీ, బీజేపీ పాలిటిక్స్ అమలు చేయాల్సిందే. అంటే వైసీపీతో పాటు.. మిగతా పార్టీలను కూడా శత్రువులుగానే భావించాలి. అప్పుడే తన సత్తా ఏంటో చూపించొచ్చు, టీడీపీ అంటే ఇష్టం లేక, అదే సమయంలో వైసీపీకి ఓట్లు వేయలేని పరిస్థితుల్లో ఉన్న తటస్థులను తనవైపు తిప్పుకోవచ్చు. ఏపీలో వైసీపీకి తనే బలమైన ప్రత్యామ్నాయం అని నిరూపించుకోవచ్చు.

ఇదే సరైన సమయం..

ఏపీలో బీజేపీ పరిస్థితి మెరుగయ్యే ఛాన్స్ లేదు, టీడీపీ నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఈ వయసులో చంద్రబాబు రాజకీయాలు చేయలేరు, లోకేష్ నాయకత్వంపై ఎవరికీ నమ్మకం లేదు. టీడీపీలోకి నందమూరి వారసులు వచ్చే అవకాశమూ లేదు. సో.. ఈ రాజకీయ శూన్యతను వాడుకోవడం పవన్ కి బాగా అవసరం. ముందు బలమైన ప్రతిపక్షంగా ఎదిగితే ఆ తర్వాత అధికారానికి బాటలు వేసుకోవచ్చు.

ఆలూ లేదు, చూలు లేదూ.. అన్నట్టుగా ముందే అధికారం, సీఎం కుర్చీ అంటూ కలలు కంటున్నారు పవన్. అందులోనూ బీజేపీ, టీడీపీని తిట్టకుండా తనకు ఓట్లు వేయాలని ఆశిస్తున్నారు. అది జరిగే పని కాదు. కనీసం పవన్ కల్యాణ్ బీజేపీ, టీడీపీకి పూర్తిగా వ్యతిరేకంగా మారి, మారాననే విషయాన్ని జనానికి నమ్మకంగా చెప్పగలిగిన రోజే జనసేన పరిస్థితి ఏపీలో మెరుగవుతుంది.