ప్రాణాంతక వైరస్ కరోనా కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఇటలీలో మన తెలుగు విద్యార్థి చిక్కుకుపోయాడు. అసలే మైనారిటీ తీరని ఆ విద్యార్థి తనను కరోనా నుంచి కాపాడమని, ఇటలీ నుంచి తల్లిదండ్రులకు దగ్గరకు చేర్చమని వేడుకుంటున్న తీరు హఈదయ విదారకంగా ఉందని చెప్పాలి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న తమ కుమారుడిని కాపాడమని హైదరాబాద్ లో ఉంటున్న అతడి తల్లిదండ్రులు ప్రభుత్వ పెద్దలకు చేస్తున్న వినతులను ఇప్పటిదాకా పట్టించుకున్న నాథుడే లేరట. ఆదివారం రాత్రి పొద్దుపోయాక వెలుగులోకి వచ్చిన ఈ ఉదంతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని కూకట్ పల్లి పరిధి ప్రగతి నగర్ లో నివాసం ఉండే మురళీ కృష్ణ సజ్జా తన కుమారుడు అన్షుమన్ సజ్జాను ఇంజినీరింగ్ విద్య కోసం ఇటలీ పంపారు. ప్రస్తుతం అన్షుమన్ ఇటలీలోని లాజియో డిస్ట్రిక్ట్ కు చెందిన రీతిలో నివాసం ఉంటూ అక్కడి ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అంతా బాగుంటుందనుంటున్న సమయంలో చైనాలో ఎంట్రీ ఇచ్చిన కరోనా మహమ్మారి ఇటలీని కమ్మేసింది. కరోనా కారణంగా ప్రస్తుతం ఇటలీలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వేలాది మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోగా… గంటగంటకూ మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితులను చూసిన అన్షుమన్ తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. వెంటనే అక్కడి మన భారత రాయబార కార్యాలయానికి తన వివరాలను తెలుపుతూ… తనను కరోనా బారి నుంచి కాపాడాలని, తనను తన తల్లిదండ్రుల వద్దకు చేర్చాలని సమాచారం పంపాడు.
ఇదిలా ఉంటే… తన కుమారుడి పరిస్థితి తెలుసుకుని హైదరాబాద్ లో ఉంటున్న మురళీ కృష్ణ సజ్జా కుటుంబం తీవ్ర ఆందోళనలో కూరుకుపోయింది. ముక్కుపచ్చలారని తన కుమారుడిని కరోనా బారి నుంచి రక్షించి తమ వద్దకు చేర్చాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో పాటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్న హైాదరాబాద్ కు చెందిన బీజేపీ నేత జి. కిషన్ రెడ్డి, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులకు ఆ కుటుంబం సందేశాలు పంపిందట. అయితే ఇప్పటిదాకా ఏ ఒక్కరి నుంచి కూడా స్పందన రాకపోవడంతో ఏ క్షణంలో తన కుమారుడికి ఏం జరుగుతుందోనని మురళీ కృష్ణ కుటుంబం క్షణక్షణం భయంభయంగా గడుపుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ విషయాన్ని గుర్తించి.. కరోనా బారి నుంచి మన అన్షుమన్ ను క్షేమంగా హైదరాబాద్ తీసుకొస్తారని ఆశిద్దాం.