ఫలానా ఆఫీస్ లో ఒకరికి కరోనా రావడంతో దాన్ని మూసేశారు. ఫలానా షాపులో పనిచేసే వ్యక్తికి కరోనా సోకడంతో ఆ ఏరియాని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించారు, ఫలానా ఇంటి చుట్టూ కంచె వేశారు.. ఇలాంటి మాటలన్నీ పాతబడిపోయాయి. అన్ లాక్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న వేళ.. మరోసారి కంటైన్మెంట్ జోన్, లాక్ డౌన్ అంటే తట్టుకోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కానీ ఏపీలో అదే జరగబోతోంది. ఇప్పటికే కరోనాతో ఓ ప్రైవేట్ క్ స్కూల్ కి తాళం పడింది.
8 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రుల్ని హోమ్ క్వారంటైన్ కి పంపించేశారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని ప్రైవేట్ స్కూల్ విద్యార్థులతో పాటు మరో ముగ్గురికి కరోనా సోకడంతో.. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు పొన్నూరు రావడానికే భయపడుతున్నారు. పట్టణంలో నిర్మానుష్య వాతావరణం కనిపిస్తోంది. ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
ఏపీ స్కూల్స్ పై ప్రభావం ఎంత..?
కరోనా కేసుల సంఖ్య ఎక్కువగానే ఉన్నా.. మరణాల సంఖ్య జాతీయ సగటుతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉండటం ఆంధ్రప్రదేశ్ కి అనుకూలించిన విషయం. అందుకే ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో స్కూల్స్ తిరిగి ప్రారంభించారు. తెలంగాణలో మాత్రం ప్రైమరీ సెక్షన్ విషయంలో ఇంకా ముందూ వెనకా ఆడుతున్నారు కూడా. ఈ దశలో ఏపీలోని స్కూల్స్ లో తిరిగి కరోనా కేసులు వెలుగులోకి రావడం నిజంగానే ఆందోళన కలిగించే విషయం.
సెకండ్ వేవ్ విషయంలో మహారాష్ట్ర ముందుగానే మేల్కొన్నా పరిస్థితి అదుపులోకి రావడంలేదు. ఈ దశలో ఏపీ ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. మాస్క్ మస్ట్ అనడంతో పాటు, సామాజిక దూరంగా కూడా గుర్తు చేసుకోవాల్సిందే.
ఏపీలోని అన్ని జిల్లాల్లో రోజువారీ సగటు కేసుల సంఖ్య సింగిల్ డిజిట్ దాటని పరిస్థితుల్లో గుంటూరులో ఒక్కరోజే 48 కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగించే అంశం. మిగతా జిల్లాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఈ పరిస్థితి చేయి దాటక ముందే స్వీయనియంత్రణలు పాటించడం అందరికీ మంచిది.