పాపం రజనీకాంత్. మంచి చెప్పబోయి…కాస్తా అడ్వాన్స్ కావడంతో కరోనా రివర్స్ అటాక్ చేసింది. తమిళ సూపర్‌స్టార్ ఏం చేసినా సంచలనమే. ఆయన చెప్పిందాన్ని లక్షల మంది ఫాలో అవుతారంటే అతిశయోక్తి కాదు. అందుకే కరోనాపై అప్రమత్తం చేసే క్రమంలో తన వంతు బాధ్యతగా ఆయన ముందుకొచ్చాడు.
ప్రధాని మోడీ జనతా కర్ఫ్యూనకు పిలుపునివ్వడాన్ని స్ఫూర్తిగా తీసుకున్న రజనీకాంత్ ట్విటర్ వేదికగా స్పందించాడు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మూడో దశకు చేరకుండా నిరోధించడానికి జనతా కర్ప్యూ ఎంతో లాభిస్తుందంటూ ట్విటర్‌లో ఓ వీడియోను షేర్ చేశాడు. అయితే ఈ వీడియో తీవ్ర దుమారం రేపింది.
మూడో దశకు చేరుకోకుండా అని రజినీకాంత్ చెప్పడాన్ని నెటిజన్లు తీవ్రంగా తప్పు పట్టారు. ఈ వీడియోలో తప్పుడు సమాచారం ఉందని, దీని వల్ల ప్రజలకు నష్టం కలుగుతుందని నెటిజన్లు మండిపడ్డారు. దేశంలో ఇంకా మూడో స్టేజి రాలేదని, అలాంటప్పుడు దీన్ని జనతా కర్ఫ్యూతో నిరోధించగలమని రజనీ చెప్పడాన్ని కొందరు తప్పుబట్టారు.
దీంతో స్పందించిన ట్విటర్ యాజమాన్యం.. వెంటనే రజనీకాంత్ పోస్ట్ చేసిన వీడియోను డిలీట్ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు రజనీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పోస్ట్ చేసిన వీడియో వెనుక దురుద్దేశం ఏమీ లేదని, ప్రజలకు మంచి చేయాలనే జనతాకర్ఫ్యూను విజయవంతం చేయాలని రజనీ చెప్పారని వారంటున్నారు.
అయితే రజనీకాంత్ చెప్పిందానికి కొందరు కావాలనే వక్రంభాష్యం చెప్పి, తమ హీరోపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ట్విటర్ తీసుకున్న నిర్ణయంపై రజనీకాంత్ ఎలా స్పందిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.