రియల్ లైఫ్‌లో పది మందికి మంచి చేయడం, పేదల కోసం పరితపించిన వాళ్లను దైవంతో సమానంగా భావిస్తారు. సినిమా నటులు రీల్ లైఫ్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో ఏ మాత్రం మానవత్వం ప్రదర్శించినా…రియల్ హీరో అని కొనియాడుతారు. హీరో రాజశేఖర్‌ను కొందరు పేద కళాకారులు అలా ప్రశంసిస్తున్నారు. హీరో రాజశేఖర్ రీల్ లైఫ్‌లోనే కాకుండా రియల్ లైఫ్‌లో కూడా హీరోలా మంచితనాన్ని చాటుకున్నాడు.
కరోనా దెబ్బకు ఈ రంగం , ఆ రంగం అనే తారతమ్యం లేకుండా ప్రతిదీ కుదేలవుతోంది. దీంతో ఆయా రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల పరిస్థితి క్రమంగా దీనస్థితికి మారే ప్రమాదం పొంచి ఉంది. రోజువారీ వేతనంపై బతికే కష్ట జీవుల కష్టాలు వర్ణణాతీతం.
దీనికి సినీ పరిశ్రమ అతీతంగా ఏమీ లేదు. సినిమా థియేటర్స్ మూతపడటం…ఆ పరిశ్రమపై భారీ ఎఫెక్ట్ చూపుతోంది. దీని వల్ల సినిమా షూటింగ్‌లు నిలిచిపోయాయి. మనిషి ప్రాణాలు కాపాడుకునే క్రమంలో ఇతరత్రా కష్టాలను పరిగణలోకి తీసుకోలేని దుస్థితి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ను తరిమి కొట్టేందుకు ప్రధాని మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూనకు పిలుపునిచ్చారు. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజలంతా స్వచ్ఛంద బంద్‌ను పాటించారు. ఇళ్లలో నుంచి ఎవరూ తొంగి చూడలేదు.
అయితే పేద సినీ కళాకారులు, కార్మికుల ఆకలి సమస్య హీరో రాజశేఖర్‌ను కదిలించింది. కళామతల్లిని నమ్ముకున్న పేద సినీ కళాకారులకు, పది రోజులకు సరిపోయేలా నిత్యావసర వస్తువులను రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందించారు. దీని ద్వారా రాజశేఖర్ తన మానవత్వాన్ని చాటుకున్నట్టైంది.