మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని చంద్రబాబు-లోకేష్ కు చాకిరేవు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్ట్ లోకి పవన్ కల్యాణ్ ను కూడా చేర్చారు. పవన్ పై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కలిస్తే, బట్టలు ఊడతీసి రోడ్డుపై నిలబెడతాం అన్నారు.
“రాజకీయాల్లోకి రా. 24 గంటలు ప్రజల మధ్య తిరుగు. జగన్ ఏమైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించు. మాకేం అభ్యంతరం లేదు. అయితే టీడీపీకి చెందిన 420 బ్యాచ్ తో కలిసి మామీద దాడి చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చంద్రబాబు లాంటి 420లను పవన్ కల్యాణ్ పక్కనపెట్టాలి. టీడీపీతో కలిసి రాజకీయాలు చేస్తే మాత్రం చంద్రబాబును ఎలా చూస్తున్నామో, పవన్ కల్యాణ్ ను కూడా అలానే ట్రీట్ చేస్తాం. పవన్ తనకుతానుగా సొంతంగా వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అంతే తప్ప, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, మాపై దాడి చేస్తే మాత్రం ఊరుకోం. చంద్రబాబుకు సపోర్ట్ చేసే ప్రతి వ్యక్తిని కూడా చంద్రబాబు కంటే దారుణంగా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం.”
ఇలా పవన్ కల్యాణ్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఓ సలహా కూడా ఇచ్చారు. చంద్రబాబు చేతిలో వెన్నుపోటు పొడిపించుకోవడానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉంటే మంచిదని సూచించారు.
“పవన్ కల్యాణ్ కు నేను చెప్పేది ఒక్కటే. నువ్వు వెన్నుపోటు పొడిపించుకోవడానికి సిద్ధంగా ఉండు. చంద్రబాబు ఎవరినైనా అవసరానికి వాడుకుంటారు, తర్వాత తీసి పక్కనపెడతారు. చంద్రబాబు రక్తంలోని ప్రతి అణువులో ఇది ఉంది. ఎన్టీ రామారావు కంటే పవన్ కల్యాణ్ గొప్పోడు కాదు కదా. ఆయన్నే వెన్నుపోటు పొడిచాడు. ఇలాంటి చంద్రబాబుతో కలిస్తే, పవన్ కల్యాణ్ కు కూడా ఇదే ఖర్మ పడుతుంది. ఎన్టీఆర్ కు పట్టిన గతే పవన్ కు కూడా పడుతుంది. దానికి పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉంటే మంచిది.”
కొత్త రాజకీయం చూపిస్తానంటూ సోలోగా పవన్ కల్యాణ్ వస్తే తమకేం అభ్యంతరం లేదంటున్నారు నాని. తమపై, ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేసినా తాము స్వీకరిస్తామన్నారు. అయితే చంద్రబాబుతో పవన్ కలిసున్నాడా లేదా అనే విషయంపై క్లారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే విమర్శలు చేయాలని సూచించారు.