‘మన బలం గ్రామ వాలంటీర్లే.. 50 ఇళ్ళకు ఓ గ్రామ వాలంటీర్‌ని నియమించాం.. ఇది కాక గ్రామ సచివాలయాలున్నాయి.. ప్రజలకు అత్యంత వేగంగా సమాచారం అందించగలం. స్థానికంగా వున్న పరిస్థితుల గురించీ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకోగలం..’ ఇదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగంతో కరోనా వైరస్‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చేసిన వ్యాఖ్యల సారాంశం.
కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి. అయితే, ఈ వైరస్ సోకిన అందరికీ ప్రాణాంతకమైన సమస్యలు ఎదురుకావనీ, కొందరు సాధారణ క్వారంటీన్తోనే వైరస్ నుంచి బయటపడ్తారనీ ఇప్పటికే వెలుగు చూసిన చాలా నివేదికలు చెబుతున్నాయి. వృద్ధులు, చిన్నారులకు మాత్రం ఈ వైరస్ ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. ఆంధ్రప్రదేశ్ కరోనా వైరస్ విషయంలో ఆలస్యంగా స్పందించిందనే విపక్షాల విమర్శల సంగతెలా వున్నా, ఈ వైరస్ పట్ల పూర్తి అప్రమత్తంగా వున్నామని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది.
ఇదిలా వుంటే, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు ఇప్పటికే ‘కరోనా వైరస్’ పట్ల అవగాహన కల్పించే కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. వారి చేతుల్లో వున్న స్మార్ట్ మొబైల్ ఫోన్ల ద్వారా, ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిక్షణం ఉన్నతాధికారులకు అందుతోంది.
‘ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదు.. లక్షణాలు కన్పిస్తే గ్రామ వాలంటీర్లకు సమాచారం ఇవ్వండి.. హెల్ప్ లైన్ నెంబర్లకు కాల్ చేయండి.. వెంటనే మీకు సహాయం అందుతుంది..’ అని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చిన విషయం విదితమే. కింది స్థాయిలో.. అంటే గ్రామ స్థాయిలో కరోనా వైరస్ జాడ కన్పించినా, వెంటనే అప్రమత్తమయ్యేందుకు గ్రామ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడనుంది. ఇదే ఆంధ్రప్రదేశ్‌కి ప్రస్తుతం శ్రీరామరక్షగా మారుతోంది.
నిజానికి గ్రామ వాలంటీర్ వ్యవస్థపై చాలా చాలా విమర్శలు వెల్లువెత్తాయి విపక్షాల నుంచి. కానీ, ఇప్పుడు ఆ విపక్షాలే ఆశ్చర్యపోయేలా గ్రామ వాలంటీర్లు, కరోనా వైరస్ నేపథ్యంలో సేవలందిస్తుండడం గమనార్హం.