తొందరపడి స్పందిస్తే ఏమౌతుందో అనే భయం పవన్ లో ఎప్పుడూ ఉంటుంది. దీనికి తోడు ప్రస్తుతం రాజకీయాల కంటే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు కాబట్టి, ఆటోమేటిగ్గా స్పందించడం లేట్ అవుతుంది. అయితే ప్రధాని ప్రకటనపై కూడా పవన్ లేటుగా స్పందించడం స్థానిక బీజేపీ నేతలకు కోపం తెప్పిస్తోంది.
కరోనాపై మోడీ ప్రకటన నిన్న విడుదలైతే.. పవన్ 12 గంటలు లేటుగా స్పందించారు. నిజానికి పవన్ ఎప్పుడు స్పందించినా ఒకటే. అసలు స్పందించకపోయినా వచ్చిన నష్టమేం లేదు. కాకపోతే ఇప్పుడాయన బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. మిత్రధర్మాన్ని పాటించి వెంటనే రియాక్ట్ అవ్వాలి. అలా అవ్వలేదనే ఏపీ బీజేపీకి కోపం.
మిగతా బీజేపీ నేతలు, మిత్రపక్షాలు మోడీ ఆలోచనను ఆహా ఓహో అని మోసేస్తుంటే పవన్ మాత్రం సైలెంట్ గా ఉన్నారు. కనీసం మిత్ర ధర్మాన్ని కూడా ఆయన పాటించలేదు. అయితే ఆ తర్వాత పైనుంచి అన్ని రాష్ట్రాల శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. మోడీ ప్రకనటకు మద్దతుగా అందరూ స్పందించాలనే సమాచారం పవన్ కు కూడా చేరింది. దీంతో మోడీ స్టేట్ మెంట్ కు మద్దతుగా పవన్ కూడా స్పందించాల్సి వచ్చింది.
నిజానికి మోడీ ప్రకటించిన జనతా కర్ఫ్యూ అంశానికి సంబంధించి పవన్ తో ఓ వీడియో తయారుచేసి రిలీజ్ చేయించాలని ఏపీ బీజేపీ భావించింది. కానీ పవన్ మాత్రం ఎందుకో ఆ ఆలోచనకు నో చెప్పారు. ఎప్పట్లానే మోడీ ప్రతిపాదనను మెచ్చుకుంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. లేట్ అయినా లేటెస్ట్ గా పవన్ స్పందించడంతో ఏపీ బీజేపీ ఊపిరి పీల్చుకుంది.