అసలే రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయి. అందులోనూ రాజకీయ నేతల మాటలు వింటుంటే…ఇలాంటి వాళ్లా మన నాయకులు అనే జనం అసహ్యించుకుంటున్నారు. ఇక్కడ, అక్కడ అనే మినహాయింపుల్లేకుండా….దేశ వ్యాప్తంగా రాజకీయ వ్యవస్థ చక్కదిద్దడానికి వీల్లేనంతగా పతనమవుతోంది.
కర్నాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఇబ్రహీరం మండలి వేదికగా సభ్య సమాజం తల దించుకునే కామెంట్స్ చేశాడు. కనీసం తానొక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానన్న స్పృహ కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత, ఏది పడితే దాన్ని ఆయన మాట్లాడి తీవ్ర విమర్శల పాలయ్యాడు.
“ఉద్యోగం ఇచ్చేటపుడు ఏమి అనుభవం ఉందని అడిగేవారు. అదే పెళ్లిచూపుల్లో అబ్బాయికి ఏమి అనుభవం ఉందని ఎందుకు అడగరు?” అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ సీఎం ఇబ్రహీం అన్నాడు. కర్నాటక విధాన పరిషత్ గురువారం ఇలాంటి అసభ్య, అమర్యాదకర వ్యాఖ్యానాలకు వేదికైంది. బీజేపీ ఎమ్మెల్సీ తేజస్వినిగౌడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ, ఇబ్రహీం కామెంట్స్‌కు నిరసనగా మండలి నుంచి ఆమె వాకౌట్ చేశారు.
మిగిలిన కాషాయ సభ్యులు నారాయణస్వామి, రవికుమార్, అరుణ్ శహాపుర, సుబ్రమణి తదితరులు కూడా లేచి నిలబడి ఆమెకు మద్దతు పలికారు. ఇబ్రహీం ఆడ పిల్లలకు పెళ్లి చేసేటప్పుడు పిల్లాడికి అనుభవాన్ని అడిగారా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకొంది. ఇబ్రహీం క్షమాపణ చెప్పాలని బీజేపీ సభ్యులంతా పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది.
విపక్షనేత ఎస్.ఆర్.పాటిల్, జేడీఎస్ సభ్యుడు బసవరాజ హొరట్టి తదితర సభ్యులు ఇబ్రహీం అభ్యంతకర వ్యాఖ్యలపై సమాలోచన జరిపారు. ఇబ్రహీం ఆ మాటను మాట్లాడకుండా ఉండాల్సిందని బసవరాజ హొరట్టి అన్నాడు. బసవరాజ హొరట్టి సూచన మేరకు ఇబ్రహీం తన మాటలను ఉపసంహరించుకున్నాడు. దీంతో సభ సజావుగా సాగింది. ఏది ఏమైతేనేం మర్యాదస్తులు మాట్లాడలేని, మాట్లాడకూడని మాటలను చట్ట సభల్లో గౌరవ సభ్యులు మాట్లాడుతుండటం విషాదం.