టాప్ హీరోలు అందరిదీ ఒకటే బాట. రెమ్యూనిరేషన్ తో పాటు లాభాల్లో వాటా తీసుకోవడం. అందుకోసం ఓ స్వంత బ్యానర్ తోడు చేసుకోవడం. ఆ బ్యానర్ పెట్టుబడి పెట్టదు. లాభాలు మాత్రం తీసుకుంటుంది. ఇంట్లో హీరో వుంటే చాలు రూపాయి పెట్టుబడి పెట్టకుండా లాభాలు షేర్ చేసుకోవచ్చు. డిమాండ్ అలాంటిది మరి. కొణిదెల ప్రొడక్షన్ అంటూ బ్యానర్ పెట్టి, తొలిసినిమా సైరా ను భారీగా తీసి, అంతకన్నా భారీగా నష్టాలు చవిచూసిన రామ్ చరణ్, ఆయన తండ్రి మెగాస్టార్ కూడా ఇప్పుడు రూటు మార్చి ఇదే బాటకు వచ్చేసినట్లు తెలుస్తోంది.
కొణిదెల బ్యానర్ మీద రెండో సినిమా కొరటాల శివ డైరక్షన్ లో స్టార్ట్ చేసారు. ఇది రెండో సినిమా. కానీ ఇండస్ట్రీ వర్గాల బోగట్టా ఏమిటంటే, ఈ సినిమాకు రామ్ చరణ్ బ్యానర్ మాత్రమే ఇస్తున్నారట. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సినిమాను నిర్మిస్తుంది. అంటే అల వైకుంఠపురములో సినిమాకు హారిక హాసిని నిర్మించి, గీతా సంస్థ పేరు జోడించినట్లు అన్నమాట.
మెగాస్టార్ రెమ్యూనిరేషన్ ఆయనకు వస్తుంది. లాభాల్లో వాటా వుంటుదట. ఇదిలా వుంటే ఇప్పుడు అదనపు లాభం ఏమిటంటే, ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు బదులు సూపర్ స్టార్ మహేష్ ను తీసుకుని, రోజుకు కోటి వంతున ఇవ్వాలనుకున్నారన్న వార్తలు వినిపించాయి. ఇప్పుడు అదే డీల్ రామ్ చరణ్ తో అని వినిపిస్తోంది.
అంటే ఆచార్య సినిమా నుంచి మూడు విధాలుగా మెగా ఫ్యామిలీకి ఆదాయం వస్తుందన్నమాట. అలా రాకపోతే, సైరా నష్టాలు పూడ్చాలి కదా?