ఆత్మకూరులో బీజేపీ జీరో అని తేలిపోయింది. టీడీపీ లోపాయికారీగా కలిస్తేనే 20వేల ఓట్లు పడ్డాయి. అదే జనసేన మద్దతిస్తే స్కోర్ ఇంకాస్త పెరిగేదేమో. ఇతర పార్టీలు పోటీలో ఉన్నా, బీజేపీ సింగిల్ గా ఉన్నా.. ఆ పార్టీకి అంతకంటే సీన్ లేదని తేలిపోయింది. ఆమాత్రం దానికి బీజేపీ వెంట పడటం పవన్ కి అవసరమా..? వేరు కుంపటిపై ఇంతకంటే మంచి మహూర్తం, సందర్భం పవన్ కి దొరకదు.
ఇప్పటికే బీజేపీ, జనసేన మధ్య దూరం పెరిగింది. కలసి ఏనాడూ కార్యక్రమాలు చేసిన పాపాన పోలేదు. కనీసం కలసి పోటీ చేశారా అంటే అదీ లేదు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలతోనే ఆ ముచ్చట తీరిపోయింది. ప్రస్తుతం ఇటు-అటు పిలుపులు లేవు, చర్చలు లేవు, స్నేహపూర్వక వాతావరణం కూడా లేదు.
బీజేపీ వాళ్లు లేస్తే.. మోదీ అది ఇది అంటారు, మోదీ అభివృద్ధిని చూసి ఓటు వేయండని చెబుతారు. కేంద్ర పథకాల నిధులతోనే ఏపీలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెబుతారు. కానీ ఏపీ ప్రజలు బీజేపీ నుంచి అంతకు మించి(హోదా) ఆశిస్తున్నారు. కానీ అది సాధ్యం కాదు, అలాంటప్పుడు బీజేపీకి ఓట్లు పడవు, ఓట్లు లేని బీజేపీతో అంటకాగడం జనసేనకు అంత మంచిది కాదు.
సైలెన్స్ ఎందుకు..?
పొత్తుపై పవన్ మూడు ఆప్షన్లు ఇచ్చారు, చివరకు ఒక్క ఛాన్స్ అంటున్నారు. పోనీ దానిపై అయినా కుదురుగా ఉంటారా అంటే అదీ లేదు. ఒక్క ఛాన్స్ అంటున్న పవన్, ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే బీజేపీని తన్ని తరిమేయొచ్చు కదా. కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత (పెట్రోల్, గ్యాస్ రేట్లు.. ఇతరత్రా..) తన ఒంటికి కూడా పూసుకోవడం ఎందుకు..? ఆ పాప భారమంతా తాను మోస్తూ, చివరకు ప్రశ్నించలేదు అనిపించుకోవడం ఎందుకు..? అసలు బీజేపీతో జనసేనకు పొత్తు ఎందుకు..?
రాజకీయం కూడా ఓ వ్యాపారమే, ఆ వ్యాపారంలో అందరూ లాభాలే కోరుకుంటారు. అంటే ఓట్లు, సీట్లు. దానికోసం పెట్టుబడి కూడా పెడతారు. అంటే ప్రచారం, ఓటుకు నోటు లాంటివన్నమాట. మరి పవన్ కల్యాణ్ ఎందుకు బీజేపీతో కలసి నష్టానికి వ్యాపారం చేయాలనుకుంటున్నారు.
బీజేపీని భాగస్వామిని చేసుకుంటే కచ్చితంగా ఏపీలో నష్టపోతాం అనుకున్నప్పుడు పవన్ అంత సాహసం చేయడం వృథా. తాను ఇబ్బంది పడటంతో పాటు.. భావి రాజకీయ నాయకులుగా ఎదగాలనుకుంటున్న తన పార్టీ జనాల్ని కూడా పవన్ తప్పుదోవ పట్టిస్తున్నట్టే లెక్క.
ఇప్పటి వరకూ ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క.. ఎన్నికలకు రెండేళ్లే టైమ్ ఉంది. ఇప్పటి వరకూ బీజేపీ వల్ల జనసేన లాభపడింది లేనే లేదు. జనసేనను అడ్డు పెట్టుకుని బీజేపీ కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకోవడం మాత్రం జరిగింది. కనీసం ఇకనైనా పవన్ పొరుగువారికి సాయపడటం మాని తన సంగతి, తన పార్టీ సంగతి, తనని నమ్ముకున్నవాళ్ల సంగతి పట్టించుకోవాలి. ఆత్మకూరు ఫలితాలతో అయినా పవన్ కళ్లు తెరవాలి. బీజేపీతో లాభం లేదని గుర్తించాలి.