ఎట్టకేలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని పార్లమెంటు పునరుద్ధరించింది. మోదీ ఇంటిపేరుపై రాహుల్ వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడటంతో లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు ఈ కేసులో రాహుల్ గాంధీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో పార్లమెంటు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో రాహుల్ గాంధీ మళ్లీ ఎంపీగా మారారు. దీంతో రాహుల్‌కు పార్లమెంట్ సమావేశాల్లో హాజరవడానికి అవకాశం దక్కింది.
కాగా 2019లో కర్ణాటకలో జరిగిన ఓ ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. మోడీ అనే పేరును ఉద్దేశించి దొంగలకందరికీ ఎందుకా ఇంటి పేరుంటుంది కామెంట్స్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో తీవ్రమైన నేరముందని సూరత్ కోర్టు భావించింది కొన్ని నెలల క్రితం. ఆ తరహా వ్యాఖ్యలకు అత్యంత తీవ్రమైన శిక్ష అయిన రెండేళ్ల జైలు శిక్షను రాహుల్ కు విధించింది సూరత్ కోర్టు!
కోర్టు నిర్ణయం వెళ్లడించిన కొంత సేపటిలోనే లోక్ సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. రెండేళ్ల జైలు శిక్షను ఎదుర్కునే ఏ ప్రజాప్రతినిధీ చట్ట సభల్లోకి ప్రవేశానికి అనర్హుడనే నియమాన్ని అనుసరించి రాహుల్ ఎంపీ పదవికి అనర్హత ను ప్రకటించింది. రాహుల్ ను ఎంపీ హోదా నుంచి డిస్మిస్ చేసింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ సీటుకు ఖాళీని కూడా అనౌన్స్ చేసింది. మరి ఎందుకో ఎన్నికల కమిషన్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఇవ్వలేదంతే!
ఈ నేపథ్యంలో రాహుల్‌గాంధీ కింది కోర్టుల ఆదేశాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించాలన్న రాహుల్‌గాంధీ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. స్టే విధిస్తూ సుప్రీం కీలక ఆదేశాలు వెల్లడించింది. గరిష్ఠ శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించి ఉండాల్సిందని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. కింది కోర్టులు పత్రాల సంఖ్య చూశాయే తప్ప, పరువు నష్టం కేసులో సరైన కారణాలు చూపలేదని ఘాటు వ్యాఖ్య చేసింది.