పంజాబ్‌లో మూడు నెలల క్రితం ఆప్ అఖండ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మూడేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఘన విజయంతో అధికారాన్ని దక్కించుకుంది. తాజాగా రెండు రాష్ట్రాలు ఉప ఎన్నికలను ఎదుర్కొన్నాయి. పంజాబ్‌లో ఆప్ ఓడిపోగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం అధికార పార్టీ తిరుగులేని విజయాన్ని దక్కించుకోవడం చర్చనీయాంశమైంది.
మూడు నెలల క్రితం పంజాబ్‌లోని మొత్తం 117 సీట్లకుగానూ ఆప్ 92 సీట్లలో విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. అంత వరకూ ఆయన నంగ్రూర్ లోక్‌సభ నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఈ నెల 23న దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో భాగంగా నంగ్రూర్ లోక్‌సభ స్థానానికి కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికలో శిరోమణి అకాళిదళ్ అభ్యర్థి సిమ్రన్ జిత్మాన్ 8 వేల ఓట్ల మెజార్టీతో ఆప్ అభ్యర్థి గుల్మైర్‌పై గెలుపొంది ఆశ్చర్యపరి చారు. ఈ పరిణామాల్ని ఆప్ ఊహించలేదు.
కేవలం మూడు నెలల క్రితం పంజాబ్‌లో మిగిలిన పార్టీలన్నింటిని ఊడ్చేసిన ఆప్… ఉప ఎన్నికలో ఓడిపోతామని కలలో కూడా ఊహించి వుండదు. శిరోమణి అకాళిదళ్ గెలుపుతో ఆప్‌పై తీవ్ర వ్యతిరేకత ఉందని అర్థం చేసుకోవాలా? బహుశా అభ్యర్థి గుణగణాలేమైనా అక్కడ ప్రభావం చూపి వుంటాయనే చర్చకు తెరలేచింది.
ఇక ఏపీ విషయానికి వస్తే మూడేళ్ల క్రితం 151 అసెంబ్లీ, 22 లోక్‌సభ స్థానాలను గెలుచుకుని తిరుగులేని పార్టీగా వైసీపీ అవతరించింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మృతితో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. గౌతమ్‌రెడ్డి తమ్ముడు విక్రమ్‌రెడ్డిని వైసీపీ బరిలో నిలిపింది. తాజా ఉప ఎన్నికలో ఆయన 82, 888 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆత్మకూరులో 53.22 శాతం ఓట్లు దక్కించుకున్న వైసీపీ, తాజా ఉప ఎన్నికలో 74.47 శాతం దక్కించుకోవడం విశేషం.
ఈ ఉప ఎన్నికకు ప్రధాన ప్రతిపక్షాలు టీడీపీ, జనసేన దూరంగా ఉండడం గమనార్హం. ఏది ఏమైనా మూడు నెలల్లో ఆప్‌కు పంజాబ్‌లో వ్యతిరేక ఫలితం, మూడేళ్లైనా వైసీపీకి సానుకూల వాతావరణం ఉండడం రాజకీయంగా చర్చించదగ్గ అంశాలే. ముఖ్యంగా ఏపీ ప్రతిపక్షాలు ఈ విషయంపై లోతుగా అధ్యయనం జరపాలి. ఆత్మకూరులో వైసీపీ విజయాన్ని లైట్ తీసుకుంటే నష్టపోయేది ప్రతిపక్షాలే.