ఒకప్పటి భారతీయ జనతా పార్టీ కాదు ఇది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడా ఉండగా, ఆ ఒక్క ఓటు కోసం ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా, మభ్య పుచ్చడానికి ప్రయత్నించకుండా హుందాగా దేశాన్ని పరిపాలించే అధికార పీఠం నుంచి దిగిపోయిన చరిత్ర ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇది కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పును పరిహసిస్తూ…. ఇతర రాజకీయ పార్టీలను అస్థిరపరచి, చీల్చి… ఎలాగైనా సరే తాము గద్దె ఎక్కి తీరాలని కుట్రలు పన్ని భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం చెలరేగుతోంది. ఈ నయా బీజేపీ కుట్ర రాజకీయాల్లో సరికొత్త అంకం శుక్రవారం నాడు చేరనుంది.
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోవడానికి ముహూర్తం దగ్గర పడింది. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీం ధర్మాసనం… శుక్రవారం సాయంత్రం అయిదు గంటల లోగా అసెంబ్లీలో ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాలని ఆదేశించింది. అసలే ఇతరుల మద్దతుతో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, ఇప్పటికే అంత్య కాలం సమీపించిన లెక్క.
కాంగ్రెస్ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఆల్రెడీ రాజీనామా లేఖను సమర్పించారు. వీరందరూ జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన వారు. వీరిలో ఆరుగురి రాజీనామాలను మాత్రం స్పీకర్ ఆమోదించారు. మిగిలిన వారు సాంకేతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్లే లెక్క. అయితే వీరిని మీ ఇష్టానికి వ్యతిరేకంగా నిర్బంధించారంటూ కాంగ్రెస్ క్లెయిమ్ చేస్తుంది. వీరందరికీ సారధి అయిన జ్యోతిరాదిత్య… ఇప్పటికే భాజపాలో చేరడం, ఆ పార్టీ తరఫున అదే రాష్ట్రం నుంచి రాజ్యసభ నామినేషన్ వేయడం కూడా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం జరుగనుంది. నిర్బంధంలో ఉన్నారనే ఎమ్మెల్యేలందరూ స్వేచ్ఛగా అసెంబ్లీకి వచ్చి ఓటు వేసే వాతావరణం కల్పించాలని పోలీస్ అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నా… భారతీయ జనతా పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అధికార కాంక్ష, ప్రజల తీర్పును పరిహసించాలనే ధోరణి.. ఇతర ప్రభుత్వాలను కుట్రపూరితంగా కూల్చి, తాము హస్తగతం చేసుకోవాలని దుర్బుద్ధి మితిమీరుతున్నాయనడానికి ఈ పరిణామాలు ఒక సాక్ష్యం గా నిలుస్తాయనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తం అవుతోంది.