గద్దర్ మృతికి వివిధ రంగాల ప్రముఖల నుంచి నివాళులు వెల్లువెత్తుతున్నాయి. గద్దర్ లేని తెలంగాణ సమాజాన్ని, జానపదాన్ని ఊహించుకోవడం మనసుకు కష్టంగా వుంది. పిల్లి ఎలుకల్లా తలపడిన వారు సైతం గద్దర్ మృతికి నివాళి అర్పించడం ఆయన సమాజంపై వేసిన బలమైన ముద్రకు నిదర్శనం. గద్దర్ భావజాలాన్ని వ్యతిరేకించిన వాళ్లు ఎందరో. కానీ సమాజంపై ఆర్తి, పేద ప్రజానీకం పక్షాన నిలిచి గళమెత్తిన గద్దర్ నిబద్ధతకు ముచ్చట పడని మనసు ఉండదు. తాజాగా గద్దర్‌కు ఒక ఐపీఎస్ అధికారి సుదీర్ఘ నివాళిని చూస్తే, ఈ విషయం అర్థమవుతుంది.
తమ భావజాలానికి విరుద్ధమైన పంథాలో గద్దర్ ఎక్కువ కాలం జీవించినప్పటికీ, ఆయనలోని ప్రజా హక్కుల నాయకుడిని చూశానంటూ ఐపీఎస్ అధికారి సజ్జనార్ ట్విటర్ వేదికగా తెలిపారు. కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి అంటూ రాసుకొచ్చిన సజ్జనార్ ట్వీట్లోని ప్రధాన అంశాల గురించి తెలుసుకుందాం.
“గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.
పాట అంటే చెవులతో కాదు వినేది… పాటంటే గుండెలతో విని మెదడులో ఆలోచనలు రేపేది అని పరమార్థాన్ని చెప్పేది.. పాటంటే మాటలతో తూటాలను ఎక్కుబెట్టి … అన్యాయపు మర్మాన్ని రట్టు చేసేది అని అర్ధం చెప్పిన వారు గద్దర్.
ఎన్నో ప్రజా పోరాటాలను ముందుండి నడిపించి, అన్ని పక్షాల ప్రజలను కలుపుకుని సమ సమాజ నిర్మాణానికి అలుపెరగని పోరాటం చేసి, మృత్యువుతో పోరాడి ఓడినా.. ప్రజల నాలుకలపై పాటవై చిరంజీవిగా నిలిచిన గద్దర్ గారికి TSRTC యాజమాన్యం పక్షాన మరియు TSRTC ఉద్యోగుల పక్షాన నివాళులు అర్పిస్తున్నాం.
గద్దర్ గారితో నాకు సుమారు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. ప్రజా ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర గురించి ఎన్నో సందర్భాలలో నాతో పాలు పంచుకున్నారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు చెప్పేవారు.
ఒకానొక సందర్భంలో తను రాసిన పాట “మల్లె తీగకు పందిరి వోలె… మసక చీకటిలా వెన్నెలవోలె నీ పాదం మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మా తొడ బుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా'' అనే పాటకు ప్రభుత్వం నంది అవార్డు ప్రకటించినా తను దానిని తిరస్కరించినట్లు చెప్పి పాట పై తనకున్న గౌరవాన్ని చాటి, పాటంటే వ్యాపారం కాదని, పాటంటే ప్రజల నాడి అని చెప్పారు.
ఎంత పెద్ద అధికారి అయినా రాజకీయ నాయకులనైనా, వయసులో తనకంటే చిన్న వారిని కూడా నోరార “అన్నా” అని పిలిచేవారు. ఆసువుగా పాట పాడటంలో గద్దర్ గారిని మించిన కవి, గాయకుడు లేరని చెప్పవచ్చు. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బతికే ఉంటారు. ఉద్యమ కారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని ఆయన ట్వీట్ చేశారు.
రాజకీయ నాయకులు గద్దర్‌కు నివాళి అర్పించడం పెద్ద విషయం కాదు. సిద్ధాంతపరంగా పోలీస్, మావోయిస్టులు పరస్పరం శత్రువుగా చూసుకోవడం తెలిసిందే.