మోడీ కొత్త సంగతి చెప్పలేదు. కానీ.. ప్రజలందరిలో ఆలోచన రేకెత్తే రకంగా చెప్పారు. మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. ఇది ప్రజల కోసం ప్రజల ద్వారా ప్రజలే విధించుకునే కర్ఫ్యూ అని ఆయన అభివర్ణించారు. తద్వారా ఎంతో అత్యవసరం అయితే తప్ప.. ఎవ్వరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండాలనే స్ఫూర్తి.. ఆలోచన అందరి దృష్టికి వచ్చేలా ఆయన వివరించారు.
కరోనా మహమ్మారి ముప్పు భారత్కు పెద్దగా లేదని ఎవరైనా అంటే గనుక.. అది చాలా పెద్ద పొరబాటు అని నరేంద్రమోడీ అభివర్ణించారు. ప్రపంచ మానవాళి అతిపెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని మోడీ చెప్పారు. మొదటి రెండో ప్రపంచ యుద్ధ సమయాల్లో కూడా ప్రపంచం ఇంత పెద్ద సవాలును చూసి ఎరదగదని పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు నిరంతరం పరిశ్రమిస్తున్నారని, ఇప్పటిదాకా ఈ మహమ్మారికి మందు కనుగొనలేకపోయారని మోడీ వివరించారు.
గురువారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించిన నరేంద్రమోడీ కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, సమాజంలో ఒకరికొకరు సహాయంగా నిలుస్తూ ఈ క్లిష్ట సమయంలో ఆదుకోవాల్సిన తీరు గురించి వివరించారు. ఇది ఏ ఒక్కరితోనో పరిష్కారం అయ్యే సమస్య కాదని, అందరూ కలసి సమష్టి ప్రయత్నంతో మహమ్మారి వ్యాపించకుండా చూడాలని పిలుపు ఇచ్చారు. ఏకాంతంగా ఉండడం ఒక్కటే దీని నియంత్రణకు ఉపకరిస్తుందని చెప్పారు.
కరోనా వ్యాపించకుండా దేశం మొత్తం చాలా విధాలుగా అప్రమత్తం అయింది. ప్రభుత్వ ఆఫీసులకు కూడా సెలవులు ప్రకటిస్తున్నారు. వర్క్ ఫ్రం హోం అవకాశం ఇస్తున్నారు. తెలంగాణలో స్కూళ్లకు సెలవులు ప్రకటించి, టీచర్లను మాత్రం హాజరు కమ్మన్నారు. ఏపీలో పూర్తిగా సెలవులు ఇచ్చేశారు. ఏపీలో సినిమా హాళ్లు, కాలేజీలు, విద్యాసంస్థలు, మాల్స్, ఎమ్యూజమెంట్ పార్కులు సమస్తం మూసివేస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఆలయాలు అన్నీ కూడా మూత పడుతున్నాయి. కేదార్ నాధ్, షిరిడి ఆలయాలు ముందే మూతపడగా.. శుక్రవారం మధ్యాహ్నం నుంచి తిరుమల వేంకటేశ్వరుని ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. గురువారం మధ్యాహ్నమే.. తిరుమలకు చేరుకునే (ఎక్కే ) ఘాట్ రోడ్డును మూసేశారు.