నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కులం పిచ్చి ఉన్నదా, లేదా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్నదా అనేది వేరే సంగతి. కానీ ఆయనకు బలవంతంగా తాటాకులు కట్టేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఆరోపణలు ఒక ఎత్తు. అయితే ఇప్పుడు వైకాపా వ్యతిరేకులందరూ కలసి… నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అడగకముందే ఆయనకు వత్తాసు పలకడం ద్వారా.. ఆయనకు మద్దతిస్తున్నట్లుగా మాట్లాడడం ద్వారా… ఆయన ప్రాణాలకు వైకాపా ముప్పు తలపెట్టింది అంటూ.. అనవసరపు యాగీ చేయడం ద్వారా.. ఆయన మీద పూర్తిగా రాజకీయ రంగు పులిమేస్తున్నారు.
ఒకవేళ ఆయన నిష్పాక్షికమైన బుద్ధితోనే… రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రాజ్యాంగబద్ధమైన పెద్ద పదవిలో ఉండవచ్చు గాక. కానీ.. విపక్ష నాయకులు ఆయనను అలా ఉండనిచ్చేలా లేరు. నిన్న మొన్నటి వరకూ కూడా.. వైకాపా నాయకులంతా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై పెద్దస్థాయిలోనే ధ్వజమెత్తుతూ వచ్చారు. ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్క్రిప్టు ప్రకారం పనిచేస్తున్నారని అన్నారు. తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చడానికే నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆరోపించారు. వాటిని నిమ్మగడ్డ మాత్రం పట్టించుకోలేదు. పట్టించుకోకపోవడం కూడా సబబే కావొచ్చు. తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నప్పుడు.. ఎవరి విమర్శలనూ పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది ఆయన ధోరణి అయి ఉండొచ్చు.
ఒకవేళ ఆయన నిష్కళంకుడే అయిఉండవచ్చునేమో గానీ.. వైకాపాయేతర విపక్ష నాయకులు ఆయనను అలా ఉండనిచ్చేలా లేరు. బలవతంగా యాంటీ-వైకాపా రంగు పులుముతున్నారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నదని అంటున్నారు. నిమ్మగడ్డ పేరిట కేంద్ర హోంశాఖకు రాసిన ఉత్తరంగా ఒకటి లీకయింది. అది తాను రాసినట్లు ఆయన చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచేలా కుట్ర పూరితంగా ఉన్నదనే ఉద్దేశంతో.. ఆ లేఖ ఎక్కడినుంచి వచ్చిందో.. దానికి కర్త ఎవరో నిగ్గు తేల్చాల్సిందిగా వైకాపా నాయకులు డీజీపీకి ఫిర్యాదు చేశారు కూడా.
అసలు నిమ్మగడ్డ ఆ లేఖ గురించి స్పందించ లేదు.. తాను రాశానని చెప్పలేదు గానీ… తెదేపా నాయకులు మాత్రం… ఆయన లేఖ రాస్తే వైకాపా కు బాధ ఎందుకు అంటూ ధృవీకరించేస్తున్నారు. ఒకవేళ ఆలేఖ ఆయన రాసినదే అయితే గనుక.. తాను స్వయంగా తన పదవికి ఎషరు పెట్టుకున్నట్లు లెక్క. రాష్ట్రంలో తాను ఉండలేని పరిస్థితులు ఉన్నాయని ఆయన ఆరోపించడం అంటే.. ఈ రాష్ట్ర పరిధిలోని సర్వీసునుంచి తరలిపోవాలని అనుకుంటున్నట్టు అర్థం వస్తుంది. మరి తెదేపా నాయకులు ఆయనకు మేలే చేస్తున్నారో.. చేటు చేస్తున్నారో సమీక్షించుకోవాలి.