గుంటూరు కారం మ్యూజిక్ డైలామా ఇంకా కొనసాగుతూనే వుంది. ఈ సినిమాకు మొదటి నుంచీ మ్యూజిక్ డైరక్టర్ థమన్ విషయం డైలామాలో వుంటూ, వార్తల్లో వినిపిస్తూనే వుంది. అయితే ఇవన్నీ గాలి వార్తలే అని థమన్ కొట్టి పారేసినా, తెర వెనుక జరిగేవి జరుగుతూనే వుంది.
ఇప్పటి వరకు థమన్ ఈ సినిమా కోసం ఇచ్చిన ట్యూన్‌లు ఏవీ హీరో మహేష్ బాబు దగ్గర నుంచి ఆమోదముద్రకు నోచుకోలేదు. ఇలాంటి టైమ్ లో హీరో బర్త్ డే వస్తోంది. ఈ నేపథ్యంలో ఓ పాట వదలాలని నిర్మాతలు తలపెట్టారు. అయితే ఆ న్యూస్ ను నేరుగా ప్రకటించకుండా, మీడియాలోకి లీక్ గా వదిలారు.
అప్పటి నుంచి ఫ్యాన్స్ కు ఒకటే ఉత్కంఠ.. పాట వస్తుందా.. రాదా.. వస్తుందా.. రాదా అని. నిజానికి విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం 9న విడుదల చేయడం కోసం థమన్ ఓ ట్యూన్ ను చేసారు. ముంబాయి వెళ్లి దాన్ని అన్ని విధాలా రికార్డు చేయించుకుని వచ్చారు. దానికి పాట లిరిక్స్ ను కూడా రెడీ చేసి వుంచినట్లు తెలుస్తోంది. ఈ ట్యూన్ ను విదేశాల్లో వున్న హీరో అంగీకారం కోసం పంపించినట్లు తెలుస్తోంది.
నిన్న రాత్రి వరకు అక్కడ నుంచి ఏ విధమైన సమాచారం లేదు. మహేష్ బాబు ఓకె అంటే వెంటనే పాడించేసి రెడీ చేయడం అన్నది పెద్ద సమస్య కాదు. ఇంకా రెండు రోజుల సమయం వుంది కనుక.
కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ ట్యూన్ కూడా ఓకె కాకపోతే పరిస్థితి ఏమిటి అన్నది? ఇక అప్పుడు థమన్ ను మార్చక తప్పకపోవచ్చు. ఇదే అసలు టెన్షన్ త్రివిక్రమ్ కు, థమన్ కు. అంతే తప్ప బర్త్ డే కు పాట ఇవ్వగలమా లేదా అన్నది కాదు.
మరో రెండు రోజులు ఆగితే గుంటూరు కారం మ్యూజిక్ డైరక్టర్ సంగతి ఫుల్ గా క్లారిటీ వస్తుంది. అయితే థమన్ లేదంటే మరొకరు. ఆ మరొకరు అబ్దుల్ వాహిబ్ అయినా ఆశ్చర్యం లేదు.