సినిమాకు పాట ఎప్పుడూ ప్రాణమే. మూకీ సినిమా టాకీగా మారిన నాటిన దగ్గర నుంచి సినిమాలో సంగీతానికి ప్రాధాన్యత పెరుగుతూనే వస్తోంది. కానీ ఇప్పుడు మరో విధంగా ప్రాధాన్యత పెరుగుతోంది. ఓటిటి మాధ్యమం, డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన తరువాత సినిమాల ఓపెనింగ్ అన్నది చాలా కీలకంగా మారింది. బజ్ తీసుకువచ్చి, మాంచి ఓపెనింగ్ సాధించాలంటే కనీసం ఒక్క పాట అన్నా వైరల్ కావాల్సిందే. అదే కనుక రెండు మూడు పాటలు హిట్ అయితే ఇక వెనుతిరిగి చూడనక్కరలేదు. ఏమాత్రం సినిమా బాగున్నా బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తుంది.
అలవైకుంఠపురములో, పుష్ప, ఉప్పెన, రంగస్థలం, వాల్తేర్ వీరయ్య, ఇలా బ్లాక్ బస్టర్లు ఏవి చూసుకున్నా చార్ట్ బస్టర్ సాంగ్స్ వున్నవే తప్ప మరోటి కాదు. కేవలం ఒక్క పాటతో గీతగోవిందం సినిమా రేంజ్ మారిపోయింది. లేటెస్ట్ ఖుషీ సినిమాకు వస్తున్న బజ్ పాటల వల్లే. సార్ సినిమా ఎవరూ ఊహించని రేంజ్‌కు వెళ్లడం కేవలం ఒక్క పాట తోనే సాధ్యమైంది. డిజె టిల్లు సంగతి వేరుగా చెప్పాలా. ఇలా ఏకరవు పెట్టుకుంటూ పోతే ఎన్ని ఉదాహరణలో.
లేటెస్ట్గా ఈవారం రెండు సినిమాలు వస్తున్నాయి. ఒకటి సూపర్ స్టార్ రజని ‘జైలర్’. రెండోది మెగాస్టార్ ‘భోళాశంకర్’. ఈ రెండింటిలో జైలర్ సినిమాకు బజ్ వస్తోంది. భోళాకు రావడం లేదు. కారణం ఒక్కటే జైలర్ లో ఒక సాంగ్ వైరల్ అయిపోవడం. నువ్ కావాలయ్యా.. ఆ.. ఆ అంటూ తమన్నా చేసిన ఆ సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిపోయింది. దాని ప్రభావం ఓపెనింగ్స్ మీద క్లియర్ గా కనిపిస్తోంది. రజనీ సినిమాలు గత కొన్నేళ్లుగా మన దగ్గర ఆడడం మానేసాయి. అలాంటిది ఇప్పుడు జైలర్‌కు ఓపెనింగ్ తెగుతోంది అంటే కేవలం ఆ పాట వల్లే అనుకోవాలి.
మెగాస్టార్ ఖైదీ 150 కానీ, వాల్తేర్ వీరయ్య కానీ సాంగ్స్ సూపర్ హిట్ లే. వేర్ ఈజ్ ద పార్టీ సాంగ్ తో వాల్తేర్ వీరయ్య రేంజ్ మారిపోయింది. కానీ భోళాశంకర్ కు ఆ రేంజ్ సాంగ్స్ సెట్ కాలేదు. పాటలు క్యాచీగానే వున్నాయి. కానీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చమక్కు లేదు. ఓల్డ్ సాంగ్స్ స్టయిల్ లో వున్నాయి తప్ప, సరైన హుక్ లైన్ లాంటి మెరుపులు లేవు.
పాటే ప్రాణంగా మారుతోంది అన్న సంగతి టాలీవుడ్ నిర్మాతలు గమనించారు. అందుకే సంగీత దర్శకులను తీసుకోవడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. వెదికి వెదికి మరీ పలు భాషల నుంచి తెస్తున్నారు. తెలుగులోకి ఇతర భాషల మ్యూజిక్ డైరక్టర్లు అందరూ వచ్చేసారు. రెహమాన్ లాంటి సీనియర్లు మళ్లీ ఇప్పుడు తెలుగులో బిజీ అవుతున్నారు. ఈ ట్రెండ్ కొన్నాళ్లు ఇలా కొనసాగేలాగే వుంది.