నిమ్మగడ్డ రమేష్ కుమార్.. బాధ్యతగల ఉన్నతాధికారి.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సీజను గనుక.. రాష్ట్రమంతా ఆయన వైపు చూస్తున్నది. ఇలాంటి సమయంలో ఆయన తనచుట్టూ వివాదాలకు, తన కారణంగాన కొత్త సందేహాలకు తావు ఇవ్వకూడదు. కానీ, ఆయన వ్యవహారసరళి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కేవలం సైలెన్స్ పాటించడం ద్వారా మరిన్ని కొత్త వివాదాలు పుట్టడానికి, సందేహాలు రేకెత్తడానికి ఆయన కారణం అవుతున్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖకు మెయిలుద్వారా ఒక లేఖ వెళ్లింది. ఇది అయిదు పేజీల లేఖ. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలున్నాయి. సాధారణంగా ఏ ప్రభుత్వాధికారి కూడా ప్రభుత్వం మీద ఆ స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేయడం అనేది ఇదివరకు ఎన్నడూ ఎరగని సంగతి. ఇంతకూ ఆ లేఖ స్వయంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాశారా? లేదా? అనేసంగతి మాత్రం ధ్రువపడలేదు. విలేకర్లు ఆయనను ఆ ప్రశ్న అడగడానికి ప్రయత్నించినప్పుడు.. ఆయన ధ్రువీకరించలేదు.
అసలే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య పరిపాలన పరంగా ఒక ప్రతిష్టంభన నెలకొన్న సమయంలో.. కొత్త సందేహాలకు తావిచ్చేలా ఆయన ప్రవర్తన ఉండడం విశేషం. ఆ లేఖలో పేర్కొన్న విషయాల్లో.. ఆయన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం బేఖాతరు చేసిందనే సంగతి దగ్గరినుంచి… తన ప్రాణాలకు ముప్పు ఉన్నదనే వరకు తీవ్రమైన ఆరోపణలు రాశారు. ఆయన అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీతో లాలూచీ పడి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపణలు రేగుతున్న వేళ.. ఇలాటి భయాలు కూడా సహజమే.
అయితే ప్రభుత్వంలో ఉన్న పార్టీని ఫ్యాక్షన్ చరిత్ర ఉన్న పార్టీ అని, వారి వల్లనే తన కుటుంబానికి కూడా ముప్పు ఉన్నదని వ్యాఖ్యానించడం ఇదంతా చూస్తే.. అధికారిగా ఉన్న వ్యక్తి అలాంటి కామెంట్లతో లేఖ రాస్తారని అనిపించదు. అయితే కేంద్ర హోంశాఖకు అందిన ఆ లేఖ మీడియాకు లీక్ కావడం… టీవీ ఛానెళ్లు మొత్తం హోరెత్తించిన నేపథ్యంలో… దాని గురించి ప్రజల సందేహాలు తీర్చాల్సిన బాధ్య రమేష్ కుమార్ కు ఉంటుంది. ఆయన మౌనం పాటించినంత కాలం సందేహాలు పెరుగుతాయి. అది ఆయన హోదాకు సబబు కాదు.