సామెతలు ఊరికే పుట్టవని రామోజీరావు, వేమూరి రాధాకృష్ణలకు సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాతలను చూసిన తర్వాత ఎవరికైనా అర్థమవుతోంది. ‘ఎద్దు ఈనిందంటే దూడను గాటిన కట్టేయమన్న’ సామెత బహుశా రామోజీ, ఆర్కేలాంటి వాళ్ల చేష్టల నుంచే పుట్టి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎద్దు ఈనిందంటే వాళ్లిద్దరూ కలిసి దూడను గాటిన కట్టేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా తీవ్ర దుమారం రేపుతోంది. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. సుప్రీంకోర్టులో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి, అటు ప్రభుత్వానికి…ఊరటనిచ్చే తీర్పు లభించింది.
అయితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లెటర్ హెడ్‌పై కేంద్ర హోం కార్యదర్శికి రాసిన లేఖ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ ఐదు పేజీల లేఖలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి.
ఈ లేఖకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ‘కేంద్రమే కాపాడాలి!’ శీర్షికతో బ్యానర్‌గా ఇచ్చారు. ఐదు పేజీల్లోని సారాంశాన్ని అక్షరం కూడా మిస్ కాకుండా ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
స్థానిక ఎన్నికల వాయిదాపై ప్రకటన చేసినప్పటి నుంచి తనకు నిరంతరాయంగా బెదిరింపులు, హెచ్చరికలు వస్తున్నాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పేర్కొన్నారని, ఈ పరిణామాలను తన కుటుంబం తట్టుకోలేక పోతోందని ఆందోళన వ్యక్తం చేశారంటూ కథనాన్ని స్టార్ట్ చేశారు.
‘స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ నిర్ణయం ప్రకటించిన తర్వాత… స్వయంగా ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో నాకు అనేక దురుద్దేశాలను ఆపాదిస్తూ తీవ్రమైన పదజాలంతో, అన్యాయమైన విమర్శలు చేశారు. స్పీకర్‌తోపాటు కేబినెట్ మంత్రులు కూడా సీఎం దారిలోనే పరుషమైన పదజాలంతో నన్ను దూషిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కింది స్థాయి పార్టీ నాయకులు కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. వారి సొంత ఆకాంక్షలకు అనుగుణంగా తిరిగి ఎన్నికలు జరిపించేలా, నా స్థైర్యం దెబ్బతీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు’ అని లేఖలో పేర్కొన్నారు.
‘ఎన్నికలు వాయిదా పడటంతో నాకు, నా కుటుంబానికి భద్రత కరువైంది. నాకు ఉన్న ముప్పు దృష్ట్యా… రాష్ట్ర ప్రభుత్వ బలగాలు కల్పించే భద్రత సరిపోదని పాలన, భద్రతా వ్యవహారాల్లో అనుభవం ఉన్న తోటి అధికారులు, శ్రేయోభిలాషులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పెద్దల అసహనాన్ని చూస్తే… నాపైనా, నా కుటుంబ సభ్యులపైనా భౌతిక దాడులు జరిగే అవకాశాలున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్యాక్షన్‌తో కూడిన నేపథ్యం, కక్ష సాధింపు ధోరణలను దృష్టిలో ఉంచుకుని… హైదరాబాద్‌లో నివసించడమే క్షేమమనే బాధాకరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది’ అని లేఖలో వివరించారు.
ఇలా ఒకటి కాదు ఈ లేఖలో అనేక వివాదాస్పద అంశాలున్నాయి. రాష్ట్రంలో ఏకగ్రీవ లెక్కలు, జగన్ సర్కార్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్, చాలాచాలా విషయాలే ఉన్నాయి. అసలే ఆంధ్రజ్యోతి, అందులోనూ జగన్‌కు వ్యతిరేకంగా రాసిన లేఖ…కోతికి కొబ్బరి చిప్ప దొరికట్టు, ఆంధ్రజ్యోతికి ఎస్ఈసీ లేఖ దొరికింది. ఆంధ్రజ్యోతి మరింత ముందుకెళ్లి, కేంద్రహోంమంత్రిత్వశాఖ వెంటనే స్పందించిందని కూడా రాసిపడేశారు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కల్పించిన భద్రతను రెట్టింపు చేయాలని డీజీపీని కేంద్రం ఆదేశించినట్టు ఢిల్లీలోని బీజేపీ వర్గాలు తెలిపాయని అచ్చోశారు.
అలాంటి ఆదేశాలేవైనా పంపితే…కేంద్ర హోంశాఖ లేదా ఏపీ డిజీపీ కార్యాలయ అధికారులు చెప్పాలి. ఈ రెండూ కాకుండా ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పడం ఏంటో అర్థం కావడం లేదు. అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా అనేదే ప్రశ్న.
ఇక ఆర్కే పెద్దన్న, చంద్రబాబు రాజగురువు రామోజీరావు తన పత్రిక ఈనాడులో ఏం రాశారో చూద్దాం. లేఖలోని సారాంశం మాత్రం యథాతథంగా ప్రచురించారు. ఈనాడులో కూడా ఈ లేఖకు ప్రాధాన్యం ఇస్తూ ‘నా ప్రాణాలకు ముప్పు’ అనే శీర్షికతో మొదటి పేజీలో క్యారీ చేశారు. ఈ వార్తకు సంబంధించి ఉప శీర్షికల్లో చివరిగా ‘లేఖ తనదేనని ధ్రువీకరించని రమేశ్‌కుమార్’ అని ఇచ్చారు. కథనంలో కూడా చివర్లో ‘ధ్రువీకరించని కమిషనర్’ అని సబ్ హెడ్డింగ్ కింద ఈ లేఖ మీరు రాసిందేనా అని ఎన్నికల కమిషనర్‌ను ఈనాడు-ఈటీవీ ప్రతినిధి ప్రశ్నించగా ఆయన ధ్రువీకరించలేదు అని రాసుకొచ్చారు.
అంటే ఆ లేఖను తాను రాశానని ఎస్ఈసీ ధ్రువీకరించలేదని రాస్తూనే…ఆ తప్పుడు లేఖను సమగ్రంగా ప్రచురించడంలో రామోజీ ఉద్దేశం ఏంటి? ఇవేనా జర్నలిజం నైతిక విలువలు? పొద్దున లేచి నప్పటి నుంచి లోకానికి నీతులు చెప్పే రామోజీకి…ఇలాంటి ఫేక్ వార్తను ప్రచురించడం తప్పే కాదు, నేరమని తెలియదా? అన్నీ తెలిసే జగన్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా ఈనాడు తనస్థాయిని తానే దిగజార్చుకొంది.
సహజంగా ఈనాడు సర్క్యులేషన్‌ను చేరుకోవాలని పోటీ పత్రికలు ప్రయత్నిస్తుంటాయి. అదేంటో కానీ, ఇటీవల కాలంలో రామోజీ తన స్థాయిని ఆర్కే స్థాయికి దిగజార్చుకునేందుకు పోటీ పడుతున్నట్టుగా కనిపిస్తోంది. అసలే విలువల పతనంలో ఆర్కే పాతాళాన్ని కూడా దాటుకుని…ఎవరూ చేరుకోలేని స్థలంలో దిగంబరంగా , ఆనందంతో గంతులేస్తున్నాడు. ఇప్పుడు నైతిక విలువల పతనానికి పాతాళం అని కాకుండా ఆర్కే పేరు ఖరారైంది. ఆర్కేతో పోటీ అంటే…ఇద్దరినీ కలిపి పాతాళం అని పిలవాలా?
ఇదే సర్క్యులేషన్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల కంటే ఎంతో తక్కువైన ‘ప్రజాశక్తి’ ని చూడండి. ఎస్ఈసీ రమేశ్‌కుమార్ వార్తను మెయిన్ పేపర్ చివరి పేజీలో ‘రక్షణ కల్పించండి’ శీర్షికతో క్యారీ చేశారు. ఈ కథనానికి ఉప శీర్షికలుగా… రమేశ్‌కుమార్ లేఖ సోషల్ మీడియాలో…, ఖండించిన ఎస్ఈసీ అని నీట్‌గా ఇచ్చారు. ఇక కథనం విషయానికి వస్తే…
‘రమేశ్‌కుమార్ లెటర్‌హెడ్‌పై ఆయన సంతకంతో ఉన్న ఐదు పేజీల లేఖ మీడియా ప్రతినిధులకు అందింది. దీనిలో అనేక వివాదాస్పద అంశాలుండడం కలకలం రేపింది. అయితే, ఈ ప్రచారాన్ని రమేశ్‌కుమార్ ఖండించారు. బుధవారం సాయంత్రం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఆ లేఖను తాను రాయలేదని చెప్పారు’ అని కుండబద్దలు కొట్టినట్టు ప్రజాశక్తి వాస్తవాన్ని లోకానికి చాటి చెప్పింది.
పత్రికలకు కావాల్సింది సర్క్యులేషన్ కాదు…క్రెడిబిలిటీ. అదే మీడియా క్యారెక్టర్. క్యారెక్టర్ లేకుండా ఎన్ని రాతలు రాస్తే మాత్రం ఏం ప్రయోజనం. ఎంతో ప్రధానమైన వార్తను ప్రచురించేటప్పుడు ఆంధ్రజ్యోతి కనీస బాధ్యతగా ఎస్ఈసీ రమేశ్‌కుమార్ వివరణ ఎందుకు అడగలేదు? ఎందుకంటే అది ‘న్యూస్’ పేపర్ కాదు కాబట్టి . ఆంధ్రజ్యోతి అనేది బాబు ‘వ్యూస్’ పేపర్. అందువల్లే జర్నలిజంలో పాటించాల్సిన ఏ ఒక్క నైతిక విలువలు దానికి లేవు.
అసలు ఎద్దు ఈనుతుందా అనే స్పృహ లేకుండా గాటిన కట్టేయమన్నట్టు రామోజీ, ఆర్కే తమ కుట్రబుద్ధిని ఈ కథనంతో మరోసారి బయటపెట్టుకున్నారు. నిజంగా నిజాలు రాసినా జనం నమ్మలేని స్థాయికి తమ విశ్వసనీయతను బాబు పాదాల చెంత పెట్టడంపై ఇప్పటికైనా కనీసం రామోజీ లాంటి వారు ఆలోచిస్తే మంచిది.