రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు నిర్ణయాల పుణ్యమాని గతంలో ఎన్నడూ లేనంత అపకీర్తిని మూటగట్టుకుంది. రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలతో.. వారి పనితీరు మీద మచ్చ పడింది. రాష్ట్రంలో పరిపాలన అసలు సాగనిచ్చే ఉద్దేశం లేదా అన్నట్లుగా.. సుప్రీం కోర్టు అక్షింతలు వేయడం కూడా జరిగింది. ఇంత జరిగినప్పటికీ.. తన పరిధితో నిమిత్తం లేని మరో రకం ఆదేశాలతో ఎస్ఈసీ మరోసారి వార్తల్లో నిలుస్తున్నారు.
ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేసి.. అప్పటిదాకా ఎలాంటి సంక్షేమ పథకాల అమలు కూడా సాధ్యం కాకుండా ఉండేలా… కోడ్ ను సజీవంగా ఉంచిన ఈసీకి మొట్టికాయ పడింది. దాంతో ఎన్నికల కోడ్ ను ఎత్తివేశారు. అయితే కరోనా అనే బూచిని కారణంగా చూపించి ఆరు వారాల పాటు ఎన్నికలను వాయిదా వేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్… తదుపరి ఎన్నికల షెడ్యూలును ప్రకటించే వరకు ఎవరూ ఎన్నికల ప్రచారం నిర్వహించకూడదంటూ ఆదేశిస్తున్నారు. ఇదెక్కడి పితలాటకమో తెలియడం లేదు. ఎన్నికల ప్రచారం నిర్వహించడం వలన కరోనా వ్యాపించే అవకాశం ఉన్నదంటూ సెలవిస్తున్నారు.
చూడబోతే ఇప్పుడు ప్రతివాడూ తాము చేయదలచుకన్న ప్రతిపనికీ కరోనా ముసుగు తగిలించుకోవడం అనేది రివాజుగా మారినట్లున్నది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలంటే ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లంత పెద్దవి కాదు. ఏదో గ్రామం యూనిట్ చిన్ని చిన్న ప్రాంతాల్లో మాత్రమే జరిగేవి. ఈ ఎన్నికల ప్రచారం జరిగినా సరే.. అందులో బహిరంగ సభలుండవు, భారీ ర్యాలీలు ఉండవు. ఏదో పల్లెలో, వార్డుల్లో పోటీచేస్తున్నవారు ఇంటింటికీ తిరిగి ఓట్లు అడగడం మాత్రమే ఉంటుంది. ఇంత చిన్న ఎన్నికలకు కూడా ప్రచార నిషేధం ఏంటో అర్థం కాని సంగతి.
ఈసీకి అధికారం అప్పజెబితే గనుక.. కరోనా సోకుతుందనే భయంతో… నలుగురూ కలవకూడదు గనుక.. కేబినెట్ మీటింగులు కూడా పెట్టకూడదని, గ్రామాల్లో రచ్చబండ వద్ద కూడా జనం జమకూడరాదని, గుడులూ స్కూళ్లూ మాత్రమే కాదు… హోటళ్లూ, టీకొట్టులూ కూడా మూసివేయాలని… బస్సులు, రైళ్లు కూడా సమస్తం ఆపివేయాలని.. ఇంకా ఎన్నెన్ని అరాచక నిర్ణయాలు చూపించవచ్చునో అన్ని రకాలుగా చిన్నెలు చూపించేలా ఉన్నారు. అయినా ప్రజలకు ఒక డౌటు.. అధికార్లను బదిలీచేయమన్న ఉత్తర్వులనే ప్రభుత్వం పట్టించుకోకపోగా.. ప్రచారం వద్దనే ఆదేశాలకు పల్లెల్లో ఖాతరు ఏమాత్రం ఉంటుందో?