ప్రజల్లోంచి గెలిచేవాడు ఇలాంటి కామెడీ చేయడు!

కొందరు నాయకులకు ప్రజల మొహం చూసే అలవాటు, అవసరం ఎప్పటికీ రాదు. వారు కేవలం పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ.. వారి ప్రాపకం సంపాదించి, సదరు ప్రాపకంతోనే.. అధికార పదవుల్లోకి కూడా ప్రవేశిస్తుంటారు.…

కొందరు నాయకులకు ప్రజల మొహం చూసే అలవాటు, అవసరం ఎప్పటికీ రాదు. వారు కేవలం పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ.. వారి ప్రాపకం సంపాదించి, సదరు ప్రాపకంతోనే.. అధికార పదవుల్లోకి కూడా ప్రవేశిస్తుంటారు. ప్రజలు ఎలా ఉంటారో, వారి కష్టనష్టాలు, వారి స్పందనలు ఎలా ఉంటాయో.. వారికి ఎప్పటికీ తెలియదు. ప్రత్యేకించి.. ప్రజలతో ఓట్లు వేయించుకునే ఎన్నికల సమయంలో వ్యవహారాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అలాంటి బ్యాక్ డోర్ పాలిటీషియన్స్ కోవలోకి భాజపాకు చెందిన జీవీఎల్ నరసింహారావు కూడా చెందుతారేమోనని ప్రజలు భావిస్తున్నారు.

ఆయన తాజాగా రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును తనదైన శైలిలో విశ్లేషించారు. ఎన్నికల కోడ్ ఎత్తివేయడం కరక్టేనని, ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలను ఈ తీర్పు మరోసారి గుర్తు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తు.. జనసేన-భాజపా పొత్తు రాజకీయాల గురించి కూడా ఆయన మాట్లాడారు. తమ రెండు పార్టీలు కలసి రంగంలో ఉంటాయన్న జీవీఎల్ నరసింహారావు.. మరో సీక్రెట్ బయటపెట్టారు.

ఈ ఎన్నికల సందర్భంగా.. వారి కూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం బహిరంగ సభలు నిర్వహించడం లేదుట! ఎందుకంటే.. దేశవ్యాప్తంగా కరోనా హెచ్చరికల వలన.. బహిరంగసభలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారట.

కామెడీకి కూడా ఒక హద్దుండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే.. మహా అయితే ఒక గ్రామ పంచాయతీ యూనిట్ గా, మహా అయితే ఒక మండలం యూనిట్ గా జరిగే ఎన్నికలు. ఇలాంటి క్షేత్రస్థాయి ఎన్నికలకు బహిరంగ సభల రూపేణా ప్రచారం అనేదే అనూహ్యం. వీలైనంత వరకు ఇంటింటి ప్రచారం ద్వారా మాత్రమే ఈ ఎన్నికలు నడుస్తాయి. జీవీఎల్ నరసింహారావు ఎన్నడూ ప్రజాక్షేత్రంలోంచి పోటీచేసిన వారు కాదు.

భాజపా అనుకూల ప్రెస్ మీట్లతో గుర్తింపు తెచ్చుకుని… ఆ మార్గంలోంచి రాజ్యసభలోకి ప్రవేశించిన సెలబ్రిటీ మాత్రమే. ఇటీవలి కాలంలో మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కూడా పార్టీలు బహిరంగసభలు నిర్వహించడం లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలకు  మినహా తతిమ్మా ఎన్నికల్లో బహిరంగసభలు నిర్వహించడాన్ని చిన్నతనం కింద భావిస్తున్నాయి. నిజానికి అంత అవసరం కూడా ఉండదు. అలాంటిది కరోనా వల్ల తాము సభలు పెట్టట్లేదని ఆయన అంటున్న మాట గమనిస్తే..  కరోనా లేకపోతే.. ఈ పంచాయతీ , స్థానిక ఎన్నికలకోసం మోడీని కూడా పిలిపించి సభలు పెట్టించేవాళ్లం అంటూ డైలాగులు వల్లిస్తారేమో అని జనం నవ్వుకుంటున్నారు.

జ‌‘గ‌న్’ మిస్ ఫైర్ అవుతున్న‌దెక్క‌డ‌?

నగరంలో తాజా పరిస్థితి.. జనం అలర్ట్