మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే అధికార, ప్రతిపక్ష పార్టీల్లోని అసమ్మతి బయటపడుతోంది. వర్గ రాజకీయాలు పార్టీలకు తలనొప్పిగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ అధికార పార్టీకి ఇది కాస్త ఎక్కువగానే ఉంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్సీ ఇక్బాల్, అసమ్మతి వర్గీయులు ప్రెస్‌క్లబ్ వద్ద బాహాబాహీకి దిగడం తెలిసిందే.
తాజాగా సీఎం సొంత జిల్లా కడపలో అధికార పార్టీకి వర్గ రాజకీయాలు తలనొప్పిగా మారాయి. ప్రొద్దుటూరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్గీయులుగా ముద్రపడ్డ ముఖ్య నాయకులు శనివారం ప్రొద్దుటూరులో కీలక సమావేశం నిర్వహించారు. సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు, కొత్తపల్లె మేజర్ పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి నేతృత్వంలో పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న ఆయన ఆయిల్ మిల్‌లో జగన్ వర్గీయులు సమావేశమయ్యారు.
ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మున్సిపల్ మాజీ ప్లోర్ లీడర్, కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డి తదితరులు హాజరైనట్టు సమాచారం. ప్రొద్దుటూరులో శుక్రవారం నిర్వహించిన వైసీపీ ప్లీనరీ సమావేశానికి కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ సేఠ్ గురివిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఖాజా, గోపవరం పంచాయతీ నాయకుడు పొట్టు లక్ష్మి రెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వెల్లాల భాస్కర్ తదితరులు డుమ్మా కొట్టారు. ఆ మరుసటి రోజు అసమ్మతి నేతలంతా సమావేశం కావడం ప్రొద్దుటూరులో పెద్ద చర్చనీయాంశమైంది.
గత కొంత కాలంగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు, ఆయన బామ్మర్ది, మున్సిపల్ వైస్ చైర్మన్ బంగారురెడ్డి వ్యవహారశైలిపై పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. మొదట ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, కౌన్సిలర్ మురళీధర్‌రెడ్డిలు మాత్రమే వ్యతిరేక వర్గీయులుగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేను వ్యతిరేకించే వారిలో బలమైన నాయకులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి చేరడం కొత్త ఊపునిచ్చింది. వీరికి సేఠ్ గురివిరెడ్డి తోడు కావడం, మరికొందరు కూడా రానున్న రోజుల్లో అసమ్మతి వర్గీయుల పక్షాన చేరే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డితో ఢీ అంటే ఢీ అని తలపడిన నేతగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని గుర్తిస్తారు. శివచంద్రారెడ్డి అన్న రామచంద్రారెడ్డి ఫ్యాక్షన్ గొడవల్లో ప్రాణాలు కోల్పోయారు. తన అన్న హత్యకు ఎంవీఆర్ కారణమని ఆయనపై శివచంద్రారెడ్డి ఎదురుదాడికి దిగిన ఘటనలున్నాయి. ప్రొద్దుటూరులో ఎంవీఆర్ అంటే భయపడే రోజుల్లో, ఆయనకు ఎదురు తిరిగిన శివచంద్రారెడ్డి అంటే సహజంగానే ప్రజల్లో ఒక రకమైన హీరో ఇమేజ్ ఉంది. పైగా మొదటి నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్ వెంటే రాజకీయంగా నడుస్తున్నారు. కొన్ని నెలల క్రితం పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోనే అతిపెద్ద పంచాయతీ కేంద్రమైన కొత్తపల్లె మేజర్ పంచాయతీలో ఎంవీఆర్ కోడలిపై శివచంద్రారెడ్డి ఘన విజయం సాధించి తానేంటో చాటుకున్నారు.
వైఎస్ జగన్‌తో నేరుగా సంబంధాలున్న శివచంద్రారెడ్డి అసమ్మతి వర్గానికి నాయకత్వం వహిస్తుండడం ఆసక్తికర పరిణామం. ఇతను కొనిరెడ్డి ఫౌండేషన్ పేరుతో ప్రొద్దుటూరులో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వెయ్యి నుంచి 1500 మందికి కేవలం 10 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఇది ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. ఈ నేపథ్యంలో తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడనే కారణమో లేక వైఎస్ జగన్ కుటుంబానికి సన్నిహితుడు కావడం వల్లో తెలియదు, కానీ శివచంద్రారెడ్డి అంటే ఎమ్మెల్యేకు గత కొంత కాలంగా ఏ మాత్రం గిట్టడం లేదు.
ఇటీవల కొత్త పంచాయతీలో తనకు కనీస సమాచారం లేకుండా గడపగడపకూ మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నిర్వహించారని కొనిరెడ్డి శివచంద్రారెడ్డి వాపోతున్నారు. అలాగే శివచంద్రారెడ్డిని దృష్టిలో పెట్టుకుని, కొత్తపల్లె పంచాయతీలో భూకబ్జాలు జరుగుతున్నాయని, రౌడీలు పెరిగిపోయాయనే ఆరోపణలు ఎమ్మెల్యే చేయడం పుండుమీద కారం చల్లినట్టైంది. ఇలా తనకు గిట్టని సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే ఓ పథకం ప్రకారం రాజకీయ, అవసరమైతే భౌతిక దాడులకు దిగుతున్నారని అసమ్మతి వర్గీయులు ఆరోపిస్తున్నారు.
ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే అనుచరులు చించేయడం, అలాగే అడ్డొచ్చిన వారిపై దాడి, కేసులు కూడా పెట్టించిన వైనాన్ని జగన్ వర్గీయులు గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను వ్యతిరేకిస్తున్న వారందరినీ ఏకం చేసి, రానున్న రోజుల్లో బలమైన వాణి వినిపించాలనే ఆలోచనలో భాగంగా ఇవాళ కీలక సమావేశం జరిగినట్టు సమాచారం. వచ్చే నెలలో రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కార్యాచరణ ప్రకటిస్తామని జగన్ వర్గీయులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వీరి వ్యవహారాలు చూస్తుంటే పార్టీ పెద్దల అండదండలున్నాయని రాచమల్లు అనుచరులు అనుమానిస్తున్నారు. వీరి వెనుక అదృశ్య శక్తులు ఉండి నడిపిస్తున్నాయని రాచమల్లు అనుచరులు ఆరోపిస్తున్నారు. మొత్తానికి ప్రొద్దుటూరు రాజకీయం వైసీపీలో వర్గ విభేదాలతో రోజురోజుకూ వేడెక్కుతోంది. అసమ్మతి వర్గీయుల ఎత్తుకు రాచమల్లు వేసే పైఎత్తు ఏంటో మరి!