ఉరుము వురిమి మంగళం మీద పడిందన్నట్టు తెలంగాణా ప్రభుత్వం టీచర్లపై పడింది. టీచర్లు ఇల్లు, ప్లాట్, బంగారు ఇలా ఏం కొనాలన్నా, అమ్మాలన్నా ప్రభుత్వానికి తెలియచేసి అనుమతి తీసుకోవాలట.
టీచర్లు అసలు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకుంటూ, వ్యాపారాలు చేస్తూ ఆస్తులు కూడబెడుతున్నారని ప్రభుత్వ ఉద్దేశం ఏమో! నిజానికి చాలా శాఖలతో పోల్చుకుంటే అవినీతికి తక్కువ ఆస్కారమున్న శాఖ విద్యాశాఖ. అందులోనూ టీచర్లకి అవినీతికి పాల్పడాలన్నా అవకాశం లేదు. మరి టీచర్ల మీద హఠాత్తుగా ఈ నిఘా ఎందుకో?
అవినీతికి పాల్పడే శాఖల గురించి అడిగితే ప్రజలే లిస్ట్ చెబుతారు. వాళ్లని ప్రశాంతంగా వదిలేసి టీచర్ల మీద పడడం దేనికని ప్రజలు అనుకుంటున్నారు. అయినా అక్రమంగా సంపాదించేవాళ్లు లెక్కలకి దొరుకుతారా?
అవినీతి గురించి ఫస్ట్ రాజకీయ నాయకుల్నే ప్రశ్నించాలి. ఎన్నికలపుడు వీళ్లు చూపించే ఆస్తుల లెక్కకి, వాస్తవంగా వాళ్లకి వుండే ఆస్తులకి పొంతన వుందా? మరి రాజకీయాల్లోకి వచ్చే ముందు వాళ్ల ఆస్తులెంత? వచ్చిన తర్వాత ఎంత? ఒకాయన రెండెకరాలతో ప్రారంభమై వేల కోట్లకి ఎదిగాడు. ఇంకొకాయన గంజి నుంచి బెంజికి వచ్చాడని జనాన్ని అడిగితే ఎన్ని పేర్లయినా చెబుతారు.
బతకలేక బడి పంతులు పాత మాటే కావచ్చు. పూర్వంలా జీతం చాలక ట్యూషన్లు చెప్పుకునే టీచర్లు ఇపుడు లేకపోవచ్చు. అయితే వాళ్లేదో కోట్లకి పడగలెత్తుతున్నారనే అనుమానం సొసైటీలో లేదు. అసలు సమస్య రాజకీయ నాయకులే. సర్పంచులు కూడా విలాస జీవితం ఏ రకంగా అనుభవిస్తున్నారో విడమరిచి చెబితే బావుంటుంది.
టీచర్లని లెక్కలు అడిగారు బానేవుంది. పిల్లలకి రోజూ పాఠాలు చెప్పేవాళ్లకి దొంగలెక్కలు చెప్పడం తెలియదా! ఇలాంటి రూల్స్ వల్ల ఒరిగిదేమంటే తప్పు చేయని వాళ్లతో కూడా తప్పులు చేయించడమే!
జీఆర్ మహర్షి