మతమనేది వ్యక్తిగత స్థాయిలో ఉన్నంతవరకు ఫరవాలేదు, కానీ ఒక వ్యవస్థగా అయిన దగ్గర్నుంచే చిక్కులు వస్తాయి. దానికి రాజకీయాలకు జోడిస్తే అనర్థాలు కలుగుతాయి. ఆ మిశ్రమానికి హింస కూడా తోడవుతే యిక చెప్పేదేముంది! పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు కావచ్చు, అనేక ఆఫ్రికా దేశాలు కావచ్చు, లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి నియంతలుగా మారిన మిలటరీ పాలకులు సాధారణంగా మతాన్ని అడ్డుపెట్టుకుంటారు. మత ఛాందసులను ప్రోత్సహిస్తూ, మతం పేరుతో తమకు నచ్చనివారిని అణచివేస్తారు. బ్రెజిల్‌లో అలాటి అధ్యాయం యిప్పుడే ప్రారంభమైంది. ఈ జనవరి 1 నుంచి దేశాధ్య్ష పదవిలోకి వచ్చిన జైర్ బోల్సొనరో అవడానికి మిలటరీ వాడే కానీ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై వచ్చాడు. కానీ మతాన్ని ముందుకు తెస్తున్నాడు, దానికి తుపాకీలను జోడిస్తున్నాడు.
బోల్సొనరో అతివాద రైటిస్టు. అది అతని రాజకీయవిధానం. దానికి సంబంధించిన విధాన నిర్ణయాల కంటె మతం గురించే ఎక్కువ మాట్లాడుతున్నాడు. ''అన్నిటికన్నా దేవుడే మిన్న. నేను బ్రెజిల్‌ను జ్యూయిష్-క్రిస్టియన్ సంస్కృతికి మరలిస్తాను.'' అని ప్రకటించాడు. తన కాబినెట్ సహచరులను కూడా అలాటి వాళ్లనే ఎన్నుకున్నాడు. వాళ్లంతా కలిసి 'బ్రెజిల్ జీసస్‌కు చెందుతుంది. దేవుడే బ్రెజిల్ ప్రజల భాగ్యవిధాత' అంటున్నారు. అంతా దేవుడే చూసుకుంటే మరి వీరెందుకో! బ్రెజిల్‌తో ఆగరట, ప్రపంచం మొత్తాన్ని గ్లోబలిస్టు ఐడియాలజీ నుంచి విముక్తి చేస్తారట. ఈ గ్లోబలైజేషన్ క్రైస్తవ వ్యతిరేకమైనదట, మానవత్వానికి విరుద్ధమట, దేవుడికి, మనిషికి మధ్యనున్న అనుబంధాన్ని హరిస్త్తోందట!
1964లో బ్రెజిల్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి పరిపాలనలోకి వచ్చింది. విపరీతంగా అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను విస్తరింపచేసింది. ఆ విధానాలను, సైనిక నియంతృత్వాన్ని ఎదిరించినవాళ్లను నానా హింసలూ పెట్టింది. చివరకు అప్పులు ఎక్కువై పోయి వ్యవస్థ బీటలు వారింది. 1973 నాటి పెట్రోలు సంక్షోభం వలన మరింత అప్పులు చేయవలసి వచ్చింది. చివరకు 1985లో సైన్యం తను తప్పుకుంటే మంచిదనుకుంది. రాజకీయ పార్టీలను చట్టబద్ధం చేసి, కొత్త రాజ్యాంగం రాయించి ఎన్నికలు నిర్వహించింది. అప్పటికి బోల్సొనరోకు 30 ఏళ్లు. 19 వ ఏట మిలటరీలో చేరి కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. మిలటరీ ప్రభుత్వం పడిపోయి, ప్రజాస్వామ్యం వచ్చిన దగ్గర్నుంచి కష్టకాలం వచ్చినట్లుగా ఫీలయ్యాడు.
ప్రజాప్రభుత్వం మిలటరీకి బజెట్ తగ్గించేసిందని, అందువలన తమ జీతం తగ్గిపోయిందని 1986లో ఓ మ్యాగజైన్‌కు వ్యాసం రాశాడు కూడా. అంతటితో ఆగకుండా ఓ ఏడాది పోయాక ఆ ప్రభుత్వాన్ని ఎలా కూల్చవచ్చో, ఎక్కడెక్కడ బాంబులు పెట్టి దేశాన్ని అతలాకుతలం చేయవచ్చో స్కెచ్‌లతో సహా ఓ ప్లానును ఆ మ్యాగజైన్ ద్వారా వెల్లడించేసరికి, జైలు శిక్ష వేశారు. కానీ 15 రోజులు మిలటరీ జైల్లో ఉన్నాక బతిమాలుకుని బయటపడ్డాడు. కానీ దానివలన అతనికి సైనికుల, సైనిక ప్రభుత్వపు అభిమానుల మద్దతు లభించింది. 1988లో తన స్వస్థలమైన రియో ద జేనియరో సిటీకి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాడు. అప్పణ్నుంచే మతం కూడా రాజకీయాల్లోకి ప్రవేశించింది. కరక్టుగా చెప్పాలంటే ఎవాంజెలిస్టులు ప్రవేశించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లి ప్రచారం చేసి యితర మతస్తులను క్రైస్తవంలోకి మార్చడానికి చూసేవారిని ఎవాంజెలిస్టులంటారు.
క్రైస్తవులందరూ మతబోధకులు, ప్రచారకులు అనుకోకూడదు. క్రైస్తవంలో అన్ని శాఖల వారూ ప్రచారానికి పూనుకోరు. చాలామంది ఆచరణ వరకే పరిమిత మవుతారు. పెంతెకోస్తు మహాసభలు అని మన దగ్గర వాల్‌పోస్టర్లలో తరచుగా కనబడుతూ ఉంటుంది కదా, ఆ పెంతెకోస్తులు ఎవాంజెలిస్టులలో ఓ శాఖ. ఇటీవలే మరణించిన బిల్లీ గ్రాహమ్ ప్రఖ్యాత ఎవాంజెలిస్టు. సైనికపాలన నడిచేటంత కాలం ఎవాంజెలిస్టులు రాజకీయాల జోలికి పోలేదు. 'నిజమైన భక్తులు రాజకీయాలకు దూరంగా ఉంటారు' అనేది వారి నినాదం. కానీ ఎప్పుడైతే ప్రజాస్వామ్యం ఏర్పడిందో ఓటుబ్యాంకు ఎవరికి వుంటే వారిదే విజయం అని బోధపడిందో అప్పణ్నుంచి ఈ ఎవాంజెలిస్టులు రాజకీయంగా కూడా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. 'బ్రదర్ వోట్స్ ఫర్ బ్రదర్' అనే నినాదంతో సాటి ఎవాంజెలిస్టు చర్చి సభ్యుడికే ఓటేయమని ప్రచారం చేస్తున్నారు.
బ్రెజిల్‌లో కాథలిక్కులు యిదివరలో అత్యధిక సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు జనాభాలో 70%కు పడిపోయారు. ఆ మేరకు ప్రొటెస్టెంట్లలో ఎవాంజెలిజాన్ని నమ్మేవారు పెరుగుతున్నారు. ఎందుకంటే 'నువ్వు దేవుణ్ని ఎంత బాగా నమ్ముకుంటే అతడు మీకు అంత ఎక్కువ డబ్బిస్తాడు' అని ఎవాంజెలిస్టులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, ''నీకు దేవుడు డబ్బిస్తున్నాడు కాబట్టి, నీకు వచ్చిన దానిలో పదోవంతు చర్చికి యివ్వాలి.'' అంటూ భారీగా విరాళాలు వసూలు చేస్తున్నారు. ''అసెంబ్లీ ఆఫ్ గాడ్'' అని 1911లో ఏర్పడిన ఎవాంజెలిస్టు సంస్థ చాలా బలమైనది. దేశమంతా వ్యాప్తి చెందింది. 1988లోనే అసెంబ్లీ ఆఫ్ గాడ్ వారి రాజకీయ చాతుర్యం వలన మునిసిపాలిటీ స్థాయిలో చాలామంది ఎవాంజెలికల్ అభ్యర్థులు ఎన్నికయ్యారు. తర్వాతి రోజుల్లో అది పూర్తిగా మతపరమైన పార్టీ ఐన క్రిస్టియన్ సోషల్ పార్టీకి ధారాళంగా విరాళాలు యిచ్చి తన పలుకుబడిని పెంచుకుంది.
1990ల నాటికి బ్రెజిల్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కానీ బోల్సొనరోకి సైనిక పాలనపై వ్యామోహం పోలేదు. తన పరిధిలో ఉన్నంతవరకు మిలటరీవారి జీతాలు, పెన్షన్లు, సౌకర్యాలు పెంచాడు. 1993లో కాంగ్రెసు (చట్టసభ)ను రద్దు చేయాలని పిలుపు నిచ్చాడు. 1999లో అప్పటి దేశాధ్యక్షుణ్ని ఉద్దేశించి 'మిలటరీ పాలన ఉండగా వాళ్లు యితన్ని చంపి పారేసి ఉంటే పీడా పోయేది' అని వ్యాఖ్యానించడంతో అతన్ని కాంగ్రెసు నుంచి బహిష్కరించారు. బ్రెజిల్ ప్రజలు మళ్లీ సైన్యం పాలన కోరుకోకపోవడం చేత బోల్సొనొరో అభిప్రాయాలు ప్రజలకు నచ్చలేదు. అతను రాజకీయంగా ఎదగలేదు. ఈలోగా ఎవాంజెలిస్టు చర్చి మధ్యతరగతిని బాగా ఆకర్షించింది. 2003 నాటికి బాగా విస్తరించింది. దానితో అనేకమంది మతప్రచారకులు మల్టీ బిలియనీర్లయిపోయారు.
ఎదిర్ మాసెడో అనే అలాటి ప్రచారకుడికి సొంతానికి జెట్ విమానం ఉంది. అతని 'యూనివర్సల్ చర్చ్ ఆఫ్ ద కింగ్‌డమ్ ఆఫ్ గాడ్' సంస్థకు బ్రెజిల్ మొత్తంలో 13 వేల ప్రార్థనాస్థలాలున్నాయి, 50 లక్షల మంది అనుయాయులున్నారు, అమెరికాతో సహా అనేక యితర దేశాల్లో కూడా శాఖలున్నాయి. ఈ డబ్బంతా అతను వ్యాపారాల్లో పెట్టాడు. న్యూస్‌పేపర్లు, రేడియో స్టేషన్లు, టెలివిజన్లు యిలా అనేక వాటిల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా మనీ లాండరింగ్ (నల్లధనాన్ని తెలుపు చేయడం) చేసి, పట్టుబడి కొంతకాలం జైల్లో ఉన్నాడు కూడా. ఇదంతా చూసి బోల్సొనరో ఎవాంజెలిస్టులతో చేతులు కలిపితే మంచిదనుకున్నాడు. తను కాథలిక్కునని చెప్పుకుంటూనే గత పదేళ్లగా ఎవాంజెలిస్టుల బాప్టిస్టు చర్చి హాజరవుతున్నాడు. 2016 మేలో అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చి పూజారి, క్రిస్టియన్ సోషల్ పార్టీ అధినేత అయిన ఎవెరాల్డో చేత జోర్డాన్ నదిలో బాప్టయిజ్ చేయించుకున్నాడు.
ఎవాంజెలిస్టులు అబార్షన్ పనికి రాదని, స్వలింగవివాహాలను అనుమతించరాదని చట్టసభల్లో ఒత్తిడి తెస్తున్నారు. బోల్సొనరోకి వారికి అండగా నిలిచారు. 'మా అబ్బాయి ఇంకో మగాణ్ని పెళ్లి చేసుకునే పరిస్థితే వస్తే అంతకంటె వాడు చచ్చిపోవడం మేలనుకుంటాను' అని స్టేటుమెంటు యిచ్చాడు. అతని భార్య, కొడుకు ఎవాంజెలిస్టు చర్చికి మారిపోయారు. అతనికి ఎవాంజెలిస్టులు రాజకీయంగా మద్దతు యిచ్చారు. ఇటీవల కాలంలో పాలించిన లెఫ్టిస్టు, సెంట్రిస్టు రాజకీయనాయకుల అసమర్థత, అవినీతిల కారణంగా వారి యిమేజి చెడిపోయింది. వర్కర్స్ పార్టీ నాయకుడు లూలా ద సిల్వా 2003 నుంచి 2011 నుంచి పాలించాడు. అతని పాలనలో కొంత మంచి జరిగినా, అవినీతి బాగా ప్రబలింది. అతని వారసురాలిగా వచ్చిన దిల్మా రౌసెఫ్ 2014 ఎన్నికలలో 51.6% ఓట్లతో అధ్యక్షురాలైంది.
కానీ ఆమెపై బ్రెజిలియన్ డెమోక్రాటిక్ మూవ్‌మెంట్ పార్టీ నాయకుడు రాజ్యాంగ కుట్ర లాటిది జరిపి, ఆమెను అభిశంసించి, పదవి నుంచి దింపేసి, వర్కర్స్ పార్టీ విధానాలన్నీ తిరగదోడాడు. దాంతో నిరుద్యోగం ప్రబలి, ప్రజల్లో అశాంతి రగిలింది. హింస రగిలింది. అది బోల్సొనరోకి కలిసి వచ్చింది. దేశంలో శాంతిభద్రతలు ఉండాలంటే చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాళ్లను మానవహక్కుల గురించి పట్టించుకోకుండా కఠినంగా శిక్షించాలని, మరణదండన విధించాలని వాదించాడు. అడ్డగోలుగా మాట్లాడడంలో అతన్ని మించినవారు లేరు. ఒకసారి కాంగ్రెసులో డిప్యూటీగా ఉన్న ఒక మహిళ నుద్దేశించి ''నేను ఆమెను రేప్ చేయను, ఎందుకంటే ఆమె అందుకు తగదు'' అన్నాడు. ''మిలటరీపాలనలో చాలామందిని చంపేశారని గగ్గోలు పెడుతున్నారు. నన్నడిగితే యింకా చాలామందిని చంపి ఉండాల్సింది'' అన్నాడు.
కాంగ్రెసులో తన తోటి సభ్యుణ్ని చంపుతానని బెదిరించాడు కూడా. ఈ ప్రజాస్వామ్యం, ఎన్నికల విధానం ద్వారా ఏమీ మార్చలేం. సైనిక పాలన తిరిగి రావాల్సిందే అన్నాడు. చిత్రమేమిటంటే ఇలాటి మనిషి బ్రెజిల్ ప్రజలకు నచ్చాడు. దాన్ని బట్టి దేశపరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో ఊహించవచ్చు. అతనికి ఓటేయమని ఎవాంజెలిస్టులు ప్రచారం చేశారు. ఎందుకని అడిగితే అతను అవినీతికి లొంగడు, అందుకని అంటున్నారు. ప్రమాణస్వీకారం తర్వాత మన జూడో క్రిస్టియన్ వారసత్వాన్ని, మన దేశపు సంస్కృతిని కాపాడతాను అన్నాడు. నేరస్తులను చంపేస్తే పోలీసులపై కేసు లేకుండా చేస్తానన్నాడు. అంటే యికపై పోలీసులు తమకు నచ్చని ఎవర్ని కాల్చేసినా దిక్కూదివాణం ఉండదు. వ్యవసాయాధారిత వ్యాపారం చేసే వర్గాలు మైనింగ్ ద్వారా, రక్షిత ప్రాంతాల్లో వాణిజ్య పంటలు వేయడం ద్వారా గిరిజన జీవితాలను, పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని వారిపై గత ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
అనేక స్వచ్ఛంద సంస్థలు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాయి. ఆ వ్యాపారవర్గాలు తనకు మద్దతుగా నిలవడంతో యిప్పుడితను 'ఇకపై ఆ రంగం అధికారుల జులుం సాగదు, అతి మరింత సామర్థ్యంతో పని చేయడానికి ప్రభుత్వం చేయూత నిస్తుంది' అని ప్రకటించాడు. పదవి చేపట్టగానే రక్షిత ప్రాంతాలను గుర్తించే అధికారం న్యాయశాఖ కింద పని చేసే స్వతంత్ర సంస్థ ''నేషనల్ ఇండియన్ ఫౌండేషన్'' (ఫునాయ్) చేతుల్లోంచి తీసేసుకుని తన ప్రభుత్వంలోని కొత్త శాఖకు అప్పగించాడు. ఒక ఎవాంజెలిస్టు మతగురువు ఆధ్వర్యంలో అది నడుస్తుంది. పర్యావరణ రక్షణ అనే సిద్ధాంతం అతనికి నచ్చదు. ''పాశ్చాత్య దేశాలపై ఆంక్షలు విధించి చైనా ఎదగడానికి దోహదపడే అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న ప్రచారం యిది. వీళ్లని కల్చరల్ మార్క్సిస్టులు అనవచ్చు.'' అని అతను, అతని అనుయాయులు వాదిస్తారు. ఇతనికి సహజంగా ట్రంప్ నుంచి అభినందనలు, ఆశీస్సులు లభించాయి.
దీనికితోడు మాజీ సైనికాధికారులు సభ్యులుగా ఉన్న ఆయుధవ్యాపారుల లాబీ కూడా అతనికి అండగా నిలిచింది. వారికి ఆయుధాల తయారీ కంపెనీలు విరాళాలిస్తున్నాయి. వారి మద్దతు కోసం బోల్సొనరో బైబిల్‌కు బుల్లెట్లు జోడించాడు. మతానికి ఆయుధాలకు ముడిపెట్టాడు. ''మంచి పౌరులకు తమను తాము రక్షించుకునే హక్కు ఉంది'' అంటూ దానికోసం పౌరులకు తుపాకీలు అందుబాటులోకి తేవాలంటూ పార్లమెంటులో అతను చేసిన తొలి ప్రసంగానికి అభినందనలు తెలుపుతూ అతని అనుచరులు తుపాకీ ఆకారంలో తమ వేళ్లెత్తి చూపారు. 22 మంది ఉన్న తన కాబినెట్‌లో ఏడుగురు మాజీ సైన్యాధికారులే. తన ఉపాధ్యక్షుడిగా మాజీ జనరల్‌ను ఎంచుకున్నాడు. నిజానికి బ్రెజిల్‌కు పది దేశాలతో సరిహద్దులు ఉన్నా, ఎవరితోనూ తగాదాలు లేవు, బయటి దేశాల నుంచి ముప్పు ఏమీ లేదు. బ్రెజిల్ సైన్యం యుద్ధం చేసేది దేశపౌరులతోనే. ఇప్పుడితను వాళ్లకు మరిన్ని అధికారాలు, ఆయుధాలు సమకూర్చబోతున్నాడు. మరింత ఉత్సాహంగా ప్రజలను చంపడానికి జీతాలు పెంచబోతున్నాడు.
16వ శతాబ్దంలో బ్రెజిల్‌తో బాటు అనేక లాటిన్ అమెరికా దేశాలను తమ పాలనలోకి తెచ్చుకోవడానికి శతాబ్దాల కితం పోర్చుగల్, స్పెయిన్ మతానికి ఆయుధాన్ని జోడించి 'స్వోర్డ్ అండ్ క్రాస్' (కత్తీ, శిలువా) అనే నినాదంతో లక్షలాది మూలవాసులను హతమార్చి, మిగిలిన వారి సంస్కృతిని నాశనం చేసి వారిని కాథలిక్కులుగా మార్చారు. ఇప్పుడు బోల్సొనరో 'గాడ్ అండ్ ద గన్' అంటున్నాడు. ఇతనికి అండగా ఎవాంజెలిస్టులు, ధనిక భూస్వాములు, మాంసం వ్యాపారులు, ఆయుధ వ్యాపారులు, సైన్యం, పోలీసు అధికారులు నిలిచారు. బ్రెజిల్‌లోని మూలవాసులకు, గిరిజనులకు అందిస్తున్న ఆరోగ్యసౌకర్యాలను తగ్గించివేయాలని కొత్త ఆరోగ్యమంత్రి ప్రతిపాదించారు. వారిని బలహీనపరిస్తే, పర్యావరణం గురించి వారు చేసే ఆందోళనకు అడ్డుకట్ట వేయవచ్చనే ఆలోచన కాబోలు.
బోల్సొనరో రేసిస్టు దృక్పథం, సోషలిజానికి వ్యతిరేక పంథా నల్లవారికి ఆందోళన కలిగిస్తోంది. బ్రెజిల్ జనాభా 20 కోట్లు అయితే వారి జనాభా 8 కోట్లు. బోల్సొనరోకు ముందు ఉన్న సోషలిస్టు లూలా డి సెల్వా సంక్షేమ పథకాల కారణంగా 4 కోట్ల మంది నల్లవారు దారిద్య్రం నుంచి బయటపడ్డారు. (కానీ తన అవినీతి కారణంగా లూలా ప్రస్తుతం జైల్లో మగ్గుతున్నాడు) సంక్షేమ పథకాల వలన పేదవారు బద్ధకస్తులవుతారనే ఆలోచనా విధానం బోల్సొనరోది. కార్మిక రంగమన్నా, కార్మిక హక్కులన్నా బోల్సొనరోకి మహా మంట. దేశంలోని అన్ని రకాల రుగ్మతలకు కారణం యీ కార్మిక నాయకులే. వాళ్ల వలననే దేశం భ్రష్టు పట్టింది అంటాడతను. తను అధికారంలోకి రాగానే కార్మిక శాఖను ముక్కలుముక్కలు చేసి న్యాయశాఖకు, ఆర్థిక శాఖకు మధ్య పంచేశాడు. అతని ఆర్థికమంత్రి పౌలో గ్యూడెస్‌ను నియోలిబరల్‌గా వర్ణించవచ్చు. అంటే పెట్టుబడిదారులకు అనుకూల విధానాలే అవలంబించే రకం. ఇప్పటికే బ్రెజిల్‌లో ధనికులకు, పేదలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది. అది మరింత పెరగబోతోంది.
వర్కర్స్ పార్టీ అవినీతితో విసుగెత్తిన బ్రెజిల్ పౌరులు బోల్సొనరోను భారీ మెజారిటీతో గెలిపించారు. కానీ అతని విధానాలు అవకతకవకగా తోస్తున్నాయి. తన పాలనను విమర్శించే వాళ్లను అతను దైవద్రోహులుగా వర్ణించి, చర్చి, సైన్యం, పోలీసుల సహాయంతో వారిని అణచివేయవచ్చనే భయం కానవస్తోంది. మతం, రాజకీయం విడివిడిగానే ప్రమాదకరమైనవి. రెండూ కలిపితే ఏం జరుగుతుందో అనేక దేశాల్లో చూశాం. బ్రెజిల్‌లో ఆ ప్రమాదం పొంచి ఉంది. బోల్సొనరో మరో సైనిక నియంతగా అవతరించకపోతే అదే పదివేలు.
(ఫోటో – ప్రమాణస్వీకారానికై కారులో వెళుతున్న బోల్సొనరో, అతని భార్య మిషెల్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2019)