ఏపీలో సకాలంలో ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు కూడా సానుకూలంగా స్పందించలేదు. ఎన్నికల నిర్వహణ వాయిదా వల్ల కేంద్రం నుంచి రావాల్సిన వేల కోట్ల రూపాయల ఫండ్స్ మురిగిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ విషయంలో ఈసీ బాధ్యత వహించదు, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించదు, నష్టం మాత్రం రాష్ట్రానికే!
తన హయాంలోనే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సిన చంద్రబాబు నాయుడు అప్పుడు నిర్వహించలేదు. ఆ తర్వాతేమో స్థానిక ఎన్నికలపై కోర్టుల్లో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేశారు. ఆఖరి గడువుల్లో జగన్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహిస్తూ ఉంటే.. ఇప్పుడూ తమదైన రీతిలో తెలుగుదేశం కోటరీ మోకాలు అడ్డడం గమనార్హం.
దేశంలో ఎక్కడా ఏ వ్యవహారాన్నీ ఆరు వారాల పాటు వాయిదా వేయలేదు. ఆంధ్రప్రదేశ్ కే కాదు, మిగతా దేశానికి కూడా కరోనా భయాలున్నాయి. ఏపీతో పోలిస్తే వేరే రాష్ట్రాల్లో ఎక్కువ కరోనా కేసులను గుర్తించారు. అక్కడ కూడా ఆరు వారాల గడువేదీ లేదు. కేవలం ఏపీలో మాత్రమే ఆరు వారాల గడువు వచ్చింది!
ఇలా ఈసీ తన విచక్షణ అధికారాన్ని విచక్షణా రాహిత్యంగా ఉపయోగించింది. ఈ విషయంలో ఏం చేయలేక వైఎస్ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే ఈసీ హక్కులను సుప్రీం అడ్డుకోలేదు. రాష్ట్ర ప్రయోజనాలతో సుప్రీం కోర్టుకు అవసరం ఏముంది? ఏపీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల నష్టం ఏపీ ప్రజలకు కానీ, సుప్రీం కోర్టుకు కాదు, ఈసీకి కాదు!
జగన్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి నిధుల కొరత పడితే అది తెలుగుదేశం పార్టీకి ఆనందం కావొచ్చు. తమను అధికారం నుంచి దించిన ఏపీ ప్రజలపై టీడీపీ గ్యాంగ్ ఇలా కసి తీర్చుకుంటున్నట్టుగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయిప్పుడు.