తర్వాతి పాట పాడడానికి రాజకీయ ప్రత్యర్థులు భయపడేలాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమాంతం పాట పెంచేశారు. వృద్ధులు, బీడీ కార్మికులు, వితంతువులు తదితర వర్గాలకు ఇస్తున్న సంక్షేమ పెన్షన్ ను 5000 చేస్తామని ఆయన శాసనసభలో వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయం పొందుపరుస్తామని చెప్పారు. ప్రజలను ఆకట్టుకోవడానికి తమ వద్ద ఇలాంటి అస్త్రాలు ఇంకా చాలా ఉన్నాయని వాటిని ఒక్కొక్కటిగా బయటకు తీస్తామని కెసిఆర్ అంటున్నారు.
ప్రజలను ఆకట్టుకోవడానికి, ఓటు బ్యాంకులను పటిష్టంగా నిర్మించుకోవడానికి పెన్షన్లు ఒక రాజమార్గం లాగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. వితంతు, వృద్ధాప్య, వికలాంగ పెన్షన్లు ఇవ్వడంలో ఉదారంగా ఉంటే లబ్ధిదారుల కుటుంబాలన్నీ కూడా తమకు రుణపడి ఉంటాయనే ఆలోచనతో పార్టీలు వ్యూహరచనలు చేసుకుంటున్నాయి. అందుకే ఒకప్పట్లో వంద రూపాయలు ఉన్న వృద్ధాప్య పెన్షన్ అనేది 30 రెట్లు పెరిగి ఇవాళ మూడు వేల రూపాయల వరకు చేరుకుంది. ప్రతి ఐదు ఏళ్లకు ఒకసారి ఈ పెన్షన్లు పెరుగుతూ పోయే అవకాశం కూడా కనిపిస్తుంది.
గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా పెన్షన్ల ప్రభావం ఎక్కువగానే కనిపించింది. ఎలక్షన్ల ముందు వరకు వెయ్యి రూపాయలు మాత్రమే పెన్షన్ గా ఇస్తుండిన చంద్రబాబు, పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి 2000 ఇస్తాననడంతో ఆ హామీ ద్వారా తనకు జరగగల నష్టాన్ని ఊహించుకుని, తానే పెన్షన్ 2000 చేసేసారు. ఆ తర్వాత పెన్షనును తాను 3000 చేస్తానంటూ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మారు. చంద్రబాబు పెన్షన్ పెంచడం కూడా జగన్ పుణ్యమే అని ప్రజల విశ్వసించారు. ఫలితంగా ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఆ మాట ఆయన నిలబెట్టుకున్నారు కూడా.
ఇప్పుడు తెలంగాణలో ఇలాంటి పెన్షన్ రాజకీయమే నడుస్తోంది. 3000 రూపాయల పెన్షన్లు ప్రస్తుతం అందుతుండగా తమ ప్రభుత్వం వస్తే వాటిని 4000 చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇలాంటి హామీ ప్రజలను ప్రభావితం చేస్తుందనే సంగతి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు బాగా తెలుసు. అయినా ఆయన చంద్రబాబు లాగా కంగారుపడి తన అధికారంలో ఉన్నాను గనుక ఇప్పుడే పెన్షన్ 4000 చేసేద్దాం అని అనుకోవడం లేదు. తాను ఐదు వేలు చేస్తానంటూ పాట పెంచారు. కాకపోతే ఆ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తాం అన్నారు. దాని అర్థం ఎన్నికల తర్వాత మళ్లీ నెగ్గితే మాత్రమే పెన్షన్ పెంచుతానని చెబుతున్నట్టుగా తెలుసుకోవాలి.
ఇంకా ఎన్నికల నగారా మోగక ముందే కేసీఆర్ పాట పెంచి 5000 ప్రకటిస్తున్నారు గనుక, కాంగ్రెస్ పార్టీ కూడా 5000 ప్రకటిస్తుందో.. లేదా, ఎన్నికల సమయానికి పాట పెంచుతుందో వేచి చూడాలి. తమాషా ఏంటంటే కాంగ్రెస్ భారాస రెండు కూడా జాతీయ పార్టీలైన నేపథ్యంలో ఇక్కడ అధికారంలోకి రావడానికి ఎలాంటి అతిశయమైన హామీలను ప్రకటిస్తారో అవే హామీలను వారు దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ప్రకటించాల్సి ఉంటుంది. ఆ రకంగా చూస్తే కాంగ్రెస్ ఇరకాటంలో పడుతుంది.
ఇక్కడ ఇచ్చే హామీని ప్రస్తుతం వారు అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలలో అమలు చేసి చూపించమని ప్రజలు అడిగితే అది వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టే.