మనం చిన్నప్పుడు హిస్టరీ పరీక్షలో బిట్ పేపర్‌లో తరచూ అడిగే ప్రశ్న ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆ యుద్ధం 1757, జూన్ 23 జరిగింది. అంటే సరిగ్గా 265 ఏళ్ల క్రితం బెంగాల్‌లో పలాసి ప్రాంతంలో జరిగింది. ఇంగ్లీష్ వాళ్లకి నోరు తిరక్క ప్లాసీగా మారి మన పుస్తకాల్లో వచ్చింది.
యుద్ధం అంటేనే కుట్ర, నమ్మక ద్రోహం. ఈ యుద్ధంలో నవాబ్ సిరాజ్ ఉద్దౌలాకి మీర్‌జాఫర్ మోసం చేశాడు. దాంతో బ్రిటీష్ వాళ్లకంటే ఎక్కువ సైన్యం వుండి కూడా సిరాజ్ ఓడిపోయాడు. ఈ గెలుపుతో బ్రిటీష్ అధికారం ఇండియాలో స్థిరపడిపోయింది.
దేశోద్ధారకులు సినిమాలో ఒక డైలాగ్ వుంటుంది. విదేశీయుడి మారువేషంలో ఉన్న ఎన్టీఆర్‌తో నాగభూషణం “మమ్మల్ని మేము మోసం చేసుకుంటాం కానీ, తెల్లవాళ్లని ఎన్నటికీ మోసం చేయం” అంటాడు. మీర్‌జాఫర్ కూడా నవాబ్‌ని నమ్మించి మోసం చేశాడు. ఈ కుట్రతో యుద్ధం కేవలం ఒక్కరోజులోనే ముగిసింది.
అయితే బ్రిటీష్ వాళ్లు తెలివైన వాళ్లు. నవాబ్‌కి ద్రోహం చేసిన వాడు, మనల్ని మాత్రం వదులుతాడా అని జాగ్రత్తగా వున్నారు. మీర్ జాఫర్‌ని బెంగాల్ నవాబ్ చేశారు కానీ, పగ్గాలు తమ చేతిలోనే పెట్టుకున్నారు. సమయం చూసి జాఫర్ అల్లుడు మీర్ ఖాసింని నవాబ్ చేశారు. అతన్ని కూడా ఎక్కువ కాలం ఉంచకుండా మళ్లీ మీర్ జాఫర్‌కే పదవిని ఇచ్చారు. నవాబ్‌గానే మీర్ జాఫర్ 1765లో చనిపోయాడు.
ఈ యుద్ధం చేసింది రాబర్ట్ క్లయివ్. ఇండియా నుంచి బంగారం, వజ్రాలు ఇంగ్లండ్‌కి తరలించింది ఈయన హయాంలోనే. బెంగాల్‌ని సర్వనాశనం చేసిన క్లయివ్, బ్రిటీష్ పార్లమెంట్‌కి కూడా ఎన్నికయ్యాడు. ఇండియాలో చేసిన అవినీతిపై పార్లమెంట్ కమిటీ విచారించి నేరస్తుడని నిర్ధారించింది. అయితే ఆయన చేసిన సేవల్ని గుర్తించి శిక్ష రద్దు చేశాడు. 1774లో ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ నోట్ దొరకలేదు.
రచయిత శామ్యూల్ జాన్సన్ ఏమంటాడంటే “చేసిన నేరాలు, పాపాల్ని భరించలేక క్లయివ్ గొంతు కోసుకున్నాడు”
ద్రోహానికి గురైన సిరాజ్ ఉద్దౌలా కోపిష్టి, మూర్ఖుడు. మీర్ జాఫర్ కుట్ర చేస్తాడని అతనికి తెలుసు. ద్రోహం చేయనని మాట కూడా తీసుకున్నాడు. అయినా ద్రోహం చేసేవాడు మాట మీద నిలబడతాడా? తాత అలివర్దీఖాన్ నుంచి ఈయన సింహాసనం ఎక్కాడు. 22 ఏళ్ల వయసు. లోకం తెలియదు. అతనికి పదవి రావడం మేనత్తకి ఇష్టం లేదు. ఇది తెలిసి ఆమెని జైళ్లో వేశాడు.
1756, జూన్ 20 రాత్రి చరిత్రలోనే అతి ఘోరాన్ని సిరాజ్ చేశాడు. కలకత్తా పోర్టు విలియంలో ఆరుగురు మాత్రమే పట్టే జైలు గది వుంది. దాంట్లో 146 మందిని కుక్కారు. తెల్లారేసరికి వాళ్లలో 23 మంది మాత్రమే బతికారు. బ్లాక్ హోల్ ట్రాజెడీగా ఇది చరిత్రలో మిగిలింది. చనిపోయిన వాళ్లలో బ్రిటీష్ వాళ్లు కూడా ఉన్నారు. దీనికి ప్రతీకారమే ప్లాసీ యుద్ధం.
బతికిన వాళ్లలో హోల్వెల్ అనే వ్యక్తి ఏం రాశాడంటే “ఆ రాత్రంతా అరిచారు, ఏడ్చారు. గుక్కెడు నీళ్ల కోసం వేడుకున్నారు. కొందరికి మతి చలించింది. ఒక్కొక్కరు చనిపోయారు. 123 మంది”.
ప్లాసీ యుద్ధం తర్వాత మారువేషంలో తప్పించుకుంటున్న సిరాజ్‌ని పట్టుకుని ఉరి తీశారు. అపుడు అతని వయసు 23 ఏళ్లు.
ఈ యుద్ధంలో ఇంకో ఆసక్తికరమైన వ్యక్తి వున్నాడు. అతని పేరు ఉమిచాంద్. అతను సిరాజ్‌కి నమ్మకస్తుడు. అంతకు ముందు నవాబ్‌పైన జరిగిన కుట్రను చెప్పి ఆయన విశ్వాసాన్ని పొందిన వాడు.
నవాబ్‌పైన క్లయివ్, మీర్ జాఫర్ చేస్తున్న కుట్ర బయటికి రాకుండా వుండాలంటే కొల్లగొట్టిన ఖజానాలో ఐదు శాతం కావాలన్నాడు ఉమిచాంద్. ఆ మేరకు ఒప్పందం రాసుకోవాలని అనుకున్నారు. అయితే చివరి నిమిషంలో 30 లక్షలు డబ్బు కూడా డిమాండ్ చేశాడు. బ్రిటీష్ వాళ్లు చేసేది లేక ఒక డూప్లికేట్ ఒప్పందం రాసి ఉమిచాంద్‌కి చూపించారు. అడ్మిరల్ వాట్సన్ సంతకం పెట్టకపోతే క్లయివ్ దాన్ని ఫోర్జరీ చేశాడు.
మే 10, 1773 బ్రిటీష్ పార్లమెంట్ ఎదుట క్లయివ్ చెప్పిన మాటలు ఇవి కుట్ర ముగిశాక, బ్రిటీష్ వాళ్లు మోసం చేశారని తెలిసి ఉమిచాంద్ పిచ్చివాడయ్యాడు. డబ్బు కోసం కలవరిస్తూ పదేళ్లు బతికాడు.
ఇంతకీ ప్లాసీ యుద్ధంలో మీర్ జాఫర్ ఏం చేశాడో తెలుసా? బ్రిటీష్ వాళ్లు యుద్ధంలో ముందుకు వచ్చినపుడ, సేనాధిపతిగా సేనల్ని యుద్ధం చేయకుండా క్లయివ్‌కి పచ్చ జెండా ఊపాడు.
ఆ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు జోరు వాన వచ్చింది. తమ మందుగుండు సామగ్రికి బ్రిటీష్ వాళ్లు టార్పాలిన్ కప్పారు. నవాబ్ సైన్యంలో అది జరగలేదు. మందుగుండు తడిసి పేలలేదు. ఇది కూడా కుట్రలో భాగమేనని చరిత్రకారుల అనుమానం.
జీఆర్ మహర్షి