గల్లా అరుణకుమారి… ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బలమైన రాజకీయ నాయకురాలు. చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతే అయినప్పటికీ, ఆయనతో సుదీర్ఘ కాలం రాజకీయ పోరాటం చేసిన నేత. గల్లా అరుణ దెబ్బకు చంద్రబాబు చంద్రగిరి వైపు కన్నెత్తి చూడలేదు. చంద్రగిరి నుంచి ప్రాతినిథ్యం వహించి … దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా పని చేశారు.
తండ్రి రాజగోపాలనాయుడు రాజకీయ వారసురాలిగా ఆమె తెరపైకి వచ్చారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో సుదీర్ఘకాలం పాటు ఆయనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెప్పినట్టు ఇవాళ ఆమె సంచలన ప్రకటన చేశారు. అరుణకుమారి మీడియాతో మాట్లాడుతూ తన భవిష్యత్ రాజకీయంపై తేల్చి చెప్పారు.
ఇక తన రాజకీయ జీవితం ముగిసిందని స్పష్టం చేశారు. తాను చేయని పదవి లేదని, అలాగే చూడని రాజకీయం లేదన్నారు. తన అనుచరులకు స్వేచ్ఛ ఇచ్చినట్టు చెప్పారు. ఏ పార్టీలో భవిష్యత్ వుంటుందని భావిస్తారో, అందులోకి వెళ్లొచ్చన్నారు. అంతే తప్ప తాను ఫలానా పార్టీలో చేరాలని ఒత్తిడి చేయనని పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం గల్లా అరుణ, ఆమె తనయుడు గల్లా జయదేవ్ టీడీపీలో ఉన్నారు. అందుకే ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
టీడీపీకి తాము పెద్ద దిక్కు కాదన్నారు. చంద్రబాబే పార్టీకి పెద్ద దిక్కు అని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగవద్దని అనుకున్నట్టు తెలిపారు. అందుకే ఏవీ పట్టించుకోకుండా సైలెంట్‌గా ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. గల్లా అరుణకుమారి కుమారుడు గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. జయదేవ్ కూడా రాజకీయంగా యాక్టీవ్‌గా లేరు.
అమర్‌రాజా పరిశ్రమ కోసం భూమి తీసుకుని, అందులో ఎలాంటి పనులు చేయకపోవడంపై జగన్ ప్రభుత్వం సీరియస్‌గా వుంది. ఎలాగైనా ఆ భూమిని లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం న్యాయస్థానంలో గల్లా జయదేవ్ పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. తల్లిలా తాను రాజకీయాల్ని పట్టించుకోవడం లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.