ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పీడ్ పెంచారు. సర్వేలను వేగవంతం చేశారు. గడపగడపకూ మీ ప్రభుత్వం పేరుతో ఏకధాటిగా 8 నెలల పాటు ప్రజల మధ్యే ఉండాలని తన పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. మరోవైపు ప్రజాబలం ఉన్న నేతలను తన వైపు లాక్కోడానికి టీంను నేతల దగ్గరికి పంపారు, పంపుతున్నారు.
తమ పార్టీలోకి వస్తే ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్లు ఇస్తామని, ఎన్నికల ఖర్చు కూడా తామే భరిస్తామని ఆర్థికంగా కాస్త వెనుకబడిన, ప్రజాదరణ ఉన్న నేతలకు ఆఫర్ ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇంటెలిజెన్స్, ప్రశాంత్ కిషోర్ టీంతో పాటు మరో ప్రధాన సర్వే సంస్థ నివేదికల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా కొందరు ముఖ్యమైన నేతలను పార్టీలోకి తీసుకోడానికి జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు గుర్తించిన ఆ నేతలతో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. కోస్తాలో ఓ బలమైన నాయకుడు ప్రస్తుతం టీడీపీ, వైసీపీ కాకుండా మరో ప్రతిపక్ష పార్టీలో ఉన్నారు. సదరు నేతపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం వున్నట్టు జగన్‌కు నివేదిక అందింది.
ఆ నాయకుడు టీడీపీలో చేరడం మొదటి ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. అయితే ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున మాజీ మంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆ మాజీ మంత్రికి అంత సీన్ లేదని టీడీపీ అధిష్టానానికి తెలిసినా, పక్కన ఎలా పెట్టాలో అర్థం కావడం లేదు.
చంద్రబాబు ఇలా ఆలోచించే లోపే జగన్ తరపున అతనితో ఇప్పటికే మూడుసార్లు ముఖ్యనేతలు చర్చలు జరిపారు. టికెట్‌తో పాటు ఎన్నికల ఖర్చు కూడా పెడతామని అధికార పార్టీ ఆఫర్ ఇవ్వడంతో సజ్జల రామకృష్ణారెడ్డితో ఆ నాయకుడు భేటీకి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఇలా ఉత్తరాంధ్రలో కూడా బలమైన నేతలకు అధికార పార్టీ గాలం వేస్తున్నట్టు సమాచారం. పార్టీలో చేరేందుకు వైసీపీ ఆగస్టు వరకు గడువు ఇస్తున్నట్టు తెలిసింది. డిసెంబర్ నాటికి అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కసరత్తు చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే ….వచ్చే ఏడాది మార్చి తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి.
టీడీపీ, జనసేన పార్టీలకు ఏ మాత్రం సమయం ఇవ్వకుండా చావు దెబ్బతీసి, మరోసారి అధికారంలోకి వచ్చేందుకు జగన్ పక్కా వ్యూహం రచిస్తున్నారని తెలిసింది. మరోవైపు చంద్రబాబు వారానికో, రెండు వారాలకో మీటింగ్, అలాగే జనసేనాని పవన్‌కల్యాణ్ దసరా, సంక్రాంతి, ఉగాది అంటూ కాలం గడుపుతున్నారు. కానీ జగన్ మాత్రం ఎన్నికలు తప్ప మరో ఆలోచనే లేకుండా సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంటున్నారు.
జగన్ ఎత్తుకు ప్రతిపక్షాల నేతలు పైఎత్తులేస్తారా? లేక చిత్తు అవుతారా? అనేది కాలమే తేల్చాల్సి వుంది.