రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి లేనప్పుడు.. ఆ సాకు చూపించి స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి తీసుకున్న ఈసీ నిర్ణయం చట్టవిరుద్దం అని చీఫ్ సెక్రటరీ రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖకు ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జవాబు కూడా ఇచ్చారు.
కేంద్రం నుంచి విడుదల అయ్యే నిధుల కోసం మాత్రమే , రాష్ట్ర ప్రభుత్వం ఆరాట పడుతున్నట్లుగా.. ఆయన రాసిన లేఖ చదివిన వారికి అభిప్రాయం ఏర్పడుతుంది. నిజానికి ఆ లేఖ.. ప్రభుత్వానికి మరింత పరువునష్టం కలిగించే విధంగా ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. నిధుల విషయంలో, నిమ్మగడ్డ చెబుతున్న అభిప్రాయాలు నిజమే అయితే గనుక… ఆయన సదరు లేఖ రాయవలసింది చీఫ్ సెక్రటరీకి కాదని, కేంద్ర ప్రభుత్వానికి అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని కి ఒక ప్రత్యుత్తరం రాసారు. రాష్ట్ర ప్రభుత్వంతో గాని, రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులతో గాని చర్చించకుండా, వారి నుంచి నివేదికలు తీసుకోకుండా.. రాష్ట్రంలో కరోనా ప్రభావంపై ఒక అంచనాకు వచ్చే ప్రయత్నమే చేయకుండా.. ఎన్నికలు వాయిదా వేయడానికి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని, నీలం సాహ్ని తన లేఖలో తప్పు పట్టారు.
ఇందుకు సమాధానం ఇస్తూ.. తాను కేంద్ర ఆరోగ్య శాఖతో మాట్లాడి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు రమేష్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసుకోవడానికి… ఎక్కడో ఢిల్లీలో ఉండే అధికారులతో మాట్లాడి నిర్ణయానికి రావడం ఎంతవరకు సబబు అనిపించుకుంటుందో.. ఆయన విజ్ఞతకే తెలియాలి.
14వ ఆర్ధిక సంఘంతో ముడిపడిన సుమారు 4100 కోట్ల నిధులు ఈ మార్చి నెలాఖరులోగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తయితే తప్ప.. రాష్ట్రానికి రావు. అసలే ఇపుడు రాష్ట్ర ఖజానా ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో ఈ నిధులు కూడా రాకపోతే… తీవ్ర ఇబ్బందులు తప్పవని సర్కారు ఆందోళన చెందుతోంది.
ఈ విషయాన్ని కూడా సీఎస్ తన లేఖలో ప్రస్తావించారు. దీనికి జవాబుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కంటితుడుపు కబుర్లు చెప్పడం గమనార్హం. ఎన్నికలు వాయిదా పడినప్పటికీ నిధులు విడుదల అయిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయని, ఈ సందర్భంలో కూడా… ఎదో ఒక విధంగా నిధులు తెచుకోవచ్చునని నిమ్మగడ్డ పేర్కొన్నారు. ఈ సమర్థింపు మరీ బాధ్యతారాహిత్యంగా ఉంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు అంత చిత్త శుద్ధి ఉంటే గనుక… కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు, ప్రత్యేక పరిస్థితుల్లో తీసుకుంటున్న నిర్ణయం గనుక… ఈ వాయిదాకు నిధులకు ముడిపట్టకుండా కేంద్రం సహకరించాలని ఆయన ముందుగానే కేంద్రానికి లేఖ రాసి ఉండాల్సింది. అలాంటి ప్రయత్నం చేయకుండా… ఏకపక్షంగా నిర్ణయం తీసేసుకుని, ఇప్పుడు బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. బాధ్యత గల రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న అధికారి ఇలాంటి వైఖరితో ఉంటే.. రాష్ట్ర ప్రయోజనాలను నష్టం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.