దేశ రాజధానిలో అత్యంత కిరాకతంగా నిర్భయను అత్యాచారం చేసి, ఆమెను అతి దారుణంగా చంపిన కిరాతకులు తమకు పడ్డ శిక్షను తప్పించుకోవడానికి వివిధ రకాల ఎత్తుగడలను వేస్తూనే ఉన్నారు. మూడు నెలలుగా వీరికి ఉరిశిక్షను అమలు చేయడానికి కోర్టు పలు సార్లు తేదీలను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రతి సారీ ఏదో ఒక సాకుతో వీరు శిక్ష అమలును తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో మార్చి 20వ తేదీన వీరికి ఉరి శిక్ష అమలు చేయాలని ఇటీవల కోర్టు తీహార్ జైలు అధికారులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు మరో ఎత్తుగడను రెడీ చేసుకున్నారు.
ఒకటి కాదు.. ఈ సారి రెండు రకాల ఎత్తుగడలను వాడుకుంటూ ఉన్నారట. అందులో ఒకటి.. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ను ఆశ్రయించడం. తమకు పడ్డ శిక్షను అమలు చేయకుండా ఆపాలని వీరు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరుతున్నారట!
ఇక రెండో ఎత్తుగడ.. వీరి కుటుంబ సభ్యులది. వీరికి శిక్షను అమలు చేస్తే, తమను కూడా చంపాలంటూ వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారట. ఈ మేరకు రాష్ట్రపతికి మెర్సీకిల్లింగ్ పిటిషన్ ను పెడుతున్నారట. తమ వాళ్లకు మరణశిక్షను అమలు చేస్తే.. తమను కూడా చంపాలని, వీరి కుటుంబ సభ్యులు కొందరు మెర్సీ కిల్లింగ్ రిక్వెస్ట్ ను రాష్ట్రపతి ముందు పెట్టనున్నారట. ఇలా బ్లాక్ మెయిలింగ్ ద్వారా ఈ హంతకులకు శిక్షను ఆపే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు.
ఎన్ని రకాల అవకాశాలు ఉంటే.. అన్నింటినీ వాడుకుంటున్నట్టుగా ఉన్నారు. ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపిన వీళ్లపై వీళ్ల ఇంట్లో వాళ్లకు ఇంత ప్రేమ ఉందనమాట. వీళ్లకు ఇన్నేళ్లకు శిక్ష అమలు కాబోతున్నా వారు తట్టుకుంటున్నట్టుగా లేరు. మరి వీరివేనా ప్రాణాలు? వీరి చేత అతికిరాకతంగా హతమైన అమ్మాయివి ప్రాణాలు కావా?